Take a fresh look at your lifestyle.

మన్మోహన్‌ సేవలు నిరుపమానం

ఆయన నిబద్దత ఎంపిలకు ఆదర్శరం
రాజ్యసభలో ప్రధాని మోడీ వెల్లడి

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌,ఫిబ్రవరి8: మాజీ ప్రధాని డా.మన్మోహన్‌ సింగ్‌ను  ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ..డా. మన్మోహన్‌ సింగ్‌ తన ఆరోగ్యం బాలేనప్పుడు కూడా వీల్‌ చైర్‌లో పనిచేశారని గుర్తు చేశారు. ఒకానొక సమయంలో వోటింగ్‌ సందర్భంగా మన్మోహన్‌ వీల్‌ చైర్‌లో వొచ్చి వోటు వేశారని ఆ ఘటన వృత్తిపట్ల తనకున్న నిబద్ధతకు తార్కాణంగా నిలిచిందని పేర్కొన్నారు. పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ దిల్ల్లీలోని తన నివాసంలో గురువారం వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈమేరకు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాజ్యసభ సభ్యులు గ్రూప్‌ ఫొటోలు దిగారు.రాజ్యసభలో 56 మంది ఎంపీలు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం వారికి సభలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ నేత డా.మన్మోహన్‌ సింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన ఎంపీలందరికీ ఆదర్శమని కొనియాడారు.

ఈ దేశానికి మన్మోహన్‌జీ చేసిన సేవ అపారం. సుదీర్ఘకాలం పాటు రాజ్యసభకు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుంది. రాజ్యసభలో ఇటీవల ఓ బిల్లుపై జరిగిన వోటింగ్‌లో ట్రెజరీ బెంచ్‌ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన వీల్‌ఛైర్‌లో వచ్చి వోటు వేశారు. ఓ సభ్యుడిగా తన విధుల విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నారనడానికి ఇదొక ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో ఉన్నా పనిచేశారు. ఎంపీలందరికీ ఆయన ఆదర్శం అని మోదీ ప్రశంసించారు.

ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన ’బ్లాక్‌ పేపర్‌’ గురించి మోదీ ప్రస్తావించారు. ఆ పత్రం మా ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదే. మాపై చెడు చూపు పడకుండా చేస్తుంది. ప్రతిపక్షాల చర్యను మేం స్వాగతిస్తున్నాం అని అన్నారు. తన పదేళ్ల పాలనపై కేంద్రంలోని అధికార భాజపా  ’వైట్‌పేపర్‌’ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ’బ్లాక్‌ పేపర్‌’ను విడుదల చేశారు. నిరుద్యోగం, ధరల కట్టడి, రైతుల సమస్యలను తీర్చడంలో కేంద్రం విఫలమైందని హస్తం పార్టీ ఈ పత్రంలో ఆరోపించింది.

Leave a Reply