తెలంగాణ ఉద్యమ చైతన్యం సజీవం ..అజేయం ..!

ప్రజలు పార్టీని నమ్మిండ్రు…పాలకులు హామీలు అమలు చేయాలి : 
-జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో  ‘ప్రజాతంత్ర’ ముఖాముఖి 
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ను గద్దె దించడంలో అంతే శక్తివంచన లేకుండా కృషి చేశారు. కేసీయార్‌ నిర్బంధాల  మధ్య ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంతో సమానంగా ఉద్యమాలు నిర్వహించారు. ఆయన ఇంటి తలుపులను పోలీసులు బద్దలు కొట్టినా మరింత తెగింపుతో ముందడుగు వేశారు. కుటుంబ, నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడటంతోనే కాదు ప్రజా తెలంగాణలో పౌరహక్కులు, ప్రజాస్వామిక విలువలు స్థాపన కావాలంటున్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు నమ్ముకున్న పార్టీ, హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులకు ఉందని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ‘ప్రజాతంత్ర’ ముఖాముఖిలో వెల్లడించారు.  వారి మాటల్లో …
తెలంగాణ ప్రజల నాడీ తెలిసిన మీరు ప్రజా తెలంగాణకు బ్లూప్రింట్‌ ఎట్లా ఉండాలనుకుంటున్నారు.
ప్రొఫెసర్‌ కోదండరామ్‌ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక నిరంకుశమైన పాలన సాగించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సమష్టి వనరులను కొల్లగొట్టిండ్రు. ఇవ్వాల నిరంకుశ పాలన అంతం కావాలి. దీన్నే కాంగ్రెస్‌ కూటమి దొరల పాలనని అభివర్ణించింది. దాని స్థానంలో చట్టబద్దమైన ప్రజాస్వామిక పాలన రావాలి. వనరుల దోపిడీ పూర్తిగ ఆగిపోవాలి. ప్రజల మీద విచ్చల విడిగా నిర్బంధాన్ని  ప్రయోగించడం వొదులుకోవాలి. ప్రజల హక్కులను రక్షించి, గౌరవించాలి. ప్రధానంగా ఇవి నేటి ప్రజల అవసరాలను గుర్తించడం నేటి ప్రభుత్వం ప్రధాన బాధ్యత అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నిర్బంధ  పాలన పోయి ప్రజాస్వామిక పాలన రావాలి. వారు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాల్సి వుంటుంది. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలి. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాలి. ఉద్యోగాలు, ఉపాధి కల్పన జరగాలి. వీటి చుట్టు ప్రధానంగా విధాన రూపకల్పన జరగాలి. దీనికోసం చిన్న,సూక్ష్మ తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాలి. వ్యవసాయం మీద బతుకుతున్న వాళ్లకు ఆదాయ భద్రత చేకూర్చాలి. వృద్ధులకు కూడా ఆదాయ భద్రతను కల్పించాలి. గత ప్రభుత్వంలో ఒకే కుటంబం వనరులను దోపిడీ చేసింది. తెలంగాణను తన ఆస్తిగా మార్చుకుంది. ఆ రకమైన వ్యవస్థను కుప్పకూల్చి ప్రజాస్వామిక చట్టబద్ద పాలన నెలకొల్పాలి.
మీరనుకున్న ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో సాధ్యమవుతుందా ?
కోదండరామ్‌ : గత ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు అమలు చేసింది. ఇపుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు హామీలిచ్చింది కనుక ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆయా రంగాలకు చెందిన నిపుణులతో ఒక కమిటి వేసి చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే తప్పకుండా ఏదైనా సాధ్యంకాక మానదు. ప్రజలు విశ్వాసంతోనే మార్పును కోరుకున్నారు. అదే నమ్మకంతో నాయకత్వం కూడా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటుందని భావిస్తున్నాను.
కుంగిన పిల్లర్ల పునరుద్దరణ సాధ్యం కాదు, కాళేశ్వరం మళ్లీ నిర్మించాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిండు. మళ్లీ వేల కోట్ల వ్యయం అవసరమా ?
కోదండరామ్‌: వేల కోట్ల వ్యయం అవసరం లేదు. ఈ నిర్ణయం మనంగా తీసుకోవడం కంటే ఒక నిపుణుల కమిటి వేయాలి. వారి సలహా ప్రకారం నిర్ణయం జరగాలి. ఇంతవరకు కేసీయార్‌ తన కాంట్రాక్టర్ల లాభాల కోసం ప్రాజెక్టులు కట్టిండు. ఇకనైనా ఆ దృష్టి కోణం వదిలి పెట్టి నిపుణుల సలహామేరకే నిర్ణయం తీసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో నిపుణుల కమిటీ మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష జరపాలి. ఆ నిపుణుల కమిటీ సూచనలను ప్రభుత్వం పాటిస్తే నిధుల దుర్వినియోగం అరికట్టవచ్చు. ప్రాజెక్టు గురించి భవిష్యత్తులో ఏమీ చేయాలనే విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవొచ్చు.
ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్‌ఎస్‌ పార్టీ భవిష్యత్తుపై మీ వ్యాఖ్యనం…
కోదండరామ్‌ : మళ్లీ ఆ పార్టీని పునరుద్దరించుకోవడం సులభమైన విషయం మాత్రం కాదు. ఆ పార్టీకి ఉన్న ప్రధాన సమస్య ఇప్పటి వరకు కేసీఆర్‌ ఏకఛత్రాధిపత్యం వహించడమే. మళ్లీ అదే పద్ధతిలో కొనసాగితే పార్టీలో ఎవరూ కొనసాగరు. నా దృష్టిలో కేసీఆర్‌ ఆ మార్పునకు సిద్ధంగా ఉంటారనుకోవడం లేదు. కేసీయార్‌ నిరంకుశ వ్యవహార శైలీతోనే ఆ పార్టీ అంతర్గత విభేదాలకు కారణమైంది. రెండోది విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు. కాగ్‌ నివేదిక వొచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన వారిపైచర్యలు తీసుకోవాలి. గ్యారంటీగా బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు ఈ కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. అదే విధంగా ధరణి దుర్వినియోగం చేసి అడ్డగోలుగా పంచుకుని తిన్నరు. ఆ సమస్య చాలా సీరియస్‌గా ముందుకు వొస్తుంది. వీటన్నింటి నుంచి కేసీయార్‌ కోలుకోవడం కానీ, నిలిపి ఉంచే శక్తి ఆయనకుందని నేను అనుకోవడం లేదు. నా దృష్టిలో భారాసకు భవిష్యత్తు ఉందనుకోవడం లేదు.
మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన, ఈ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ను దించడానికి విస్తృతంగా చేసిన పర్యటనల్లోని అనుభవాలు..
కోదండరామ్‌ : ఏడాదిగా నా పర్యటనల్లో ప్రజల్లో బీఆర్‌ఎస్‌ను దించాలనే ఆలోచనలు ప్రధానంగా కనిపించాయి. ప్రత్యామ్నాయం ఏదని వెతుక్కున్నారు. ప్రజలు అప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. ప్రజలే ప్రత్యామ్నాయాన్ని వెతుకున్నారు. ఈ చైతన్యం చాలా గొప్పది. రెండుసార్లు అధికారమిచ్చినం, ఈసారి ఆయనను దించాలని, దించకపోతే మనల్ని బతకనీయడని ప్రజల్లో ఆలోచన వొచ్చింది. నిరంకుశ పరిపాలనపై ప్రజలు విసిగిపోయారు. ఒకసారి దించితే తప్ప బుద్ధ్దిరాదని, మరొకసారి ఇలాంటి తప్పులను పాలకులు చేయరని అందుకే దించాలని ఒక నిర్ణయానికి వొచ్చారు. ప్రజాస్వామిక సూత్రాలను ప్రజలు వ్యక్తం చేశారు. పాలకులు ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేయాలి. పనిచేయని పాలకులను వోటును ఆయుధంగా వాడుకొని పాలకులను అధికారం నుంచి దించాలనుకున్నరు. దించకుంటే మరింత పాలకుల్లో అణచివేత, అహంభావం  పెరుగుతుందని ప్రజలు గ్రహించారు.
ఉచిత పథకాలకు యేటా 2 లక్షల కోట్లు అవసరం. నిధులు ఎలా సమీకరిస్తారు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా సాధ్యమేనా ?
కోదండరామ్‌: రెండు లక్షల కోట్లు ఏమీ కాదు. గత సర్కార్‌ ప్రభుత్వం భూములను దుర్వినియోగం చేసింది. చాలా చోట్ల స్థలాలను ఆక్రమించుకున్నారు. అక్రమ పద్ధతుల్లో చేజిక్కించుకున్న భూములను విడిపించి అమ్ముకోగలిగితే  పథకాలకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవొచ్చు. ఉన్న రెగ్యులర్‌ బడ్జెట్‌ యధావిధిగా వాడుకోవొచ్చు. ఇది కొంతమంది మాజీ అధికారులు చెప్పిన అనుభవ విషయం. ఆ విశ్లేషణను నేను నమ్ముతున్న. సాధారణ ప్రజలకు నష్టం చేయని పన్నులు కూడా విధించవొచ్చు. వొచ్చిన ఆదాయాన్ని లీకేజీలు లేకుండా సమర్ధవంతంగా వినియోగిస్తే మనకు కొంత ఆదాయం పెరుగుతుంది. ఇవి సాధించగలిగితే పథకాలు అమలు చేయవొచ్చు. ప్రభుత్వం సమర్ధవంతమైన పాలన కూడా అందించవచ్చు.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ అన్నారు. ఇవన్నీ ఆచరణ సాధ్యమేనా ?
కోదండరామ్‌:  ఖాలీలు  ఉన్నయి కాబట్టి  భర్తీ చేయాల్సిందే. ఖాలీలు  భర్తీ చేయకుండా ప్రభుత్వాన్ని నడపలేరు కదా! మంచి సవులతులు కూడా ప్రజలకు అందించలేరు. విద్యా, వైద్యం సౌకర్యాలు అందాలంటే తప్పనిసరిగా ఖాలీలను భర్తీ చేయాల్సిందే. ఇది చాలా అవసరమైన విషయం.
మీరు కేవలం కేసీయార్‌ మీద కోపంతో కాంగ్రెస్‌ పార్టీకి మద్ధతు ప్రకటించారా ?
కోదండరామ్‌ : అలాంటిది ఏమీ లేదు. నాకు ఎవరి మీద వ్యక్తిగతమైన కోపతాపాలు లేవు. తెలంగాణ సమాజంలో ప్రజాస్వామిక పాలన రావాలని ప్రజలు కోరుకున్నరు. నిరంకుశ పాలకులను దించి ఇంటికి పంపాలనుకుంటున్న తరుణంలో ప్రజలు ప్రత్యామ్నాయం  కనుగొన్నారు. బలమైన ప్రత్యామ్నాయానికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం కూడా మద్దతు ఇవాల్సిన సందర్భం రాష్ట్రంలో వొచ్చింది. మార్పు కోసం మంచి పని ఎవరైనా చేయాల్సిందే కదా!
ప్రతిపక్షంలో ఉన్నపుడు పౌరహక్కుల ఛాంపియన్‌లా మాట్లాడే రాజకీయ పార్టీలు పవర్‌లోకి వొచ్చాక వాటిని కాలరాస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పని చేయకుండా ఉంటుందా?
కోదండరామ్‌ : హామీ ఇచ్చిండ్రు కనుక నమ్మడం. కొంతమేరకైనా పౌరహక్కుల పునరుద్ధరణ జరుగుతుందని ఆశమాత్రం ఉంది. రాజకీయపరమైన కేసులను సమీక్షించి రద్దు చేయడానికి హామీ ఇచ్చారు.
చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి.. రేవంత్‌రెడ్డి, సీతక్క ఆయనకు బీటీం అని ప్రచారంలో ఉంది. చంద్రబాబు పరోక్షంగా పెత్తనం చేస్తారని ప్రజల్లో ఆందోళన ఉంది..దీనికి మీ సమాధానం..?
కోదండరామ్‌ : మైత్రి పూర్వక సంబంధాలు ఉండొచ్చు. కానీ మునపటిలా ఆదేశిస్తే పనిచేసే అవకాశాలు మాత్రం లేవు. తప్పకుండా ఆలోచించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే తప్ప నిలదొక్కుకోలేని స్థితి ఉంది. ఈ మార్పు రాజకీయాలలో పూర్తిగా రాకున్నప్పటికీ పాక్షికంగా మాత్రం వొచ్చింది. ఆ మార్పును మనందరం గుర్తించాలి. మునుపటిలా ఆంధ్రనాయకుల పెత్తనం తెలంగాణలో చేయడం సాధ్యం కాదు.
రేవంత్‌రెడ్డి సీఎం కాగానే సోషల్‌ మీడియాలో సీమాంధ్రనేతల వ్యాఖ్యలు తెలంగాణవాదులను బెదిరింపులకు గురిచేసే విధంగా ఉన్నవి. వారి ధైర్యానికి కారణం ఏమంటారు.. ఈ భావన బి.ఆర్‌.ఎస్‌కు లాభం చేకూర్చదా?
కోదండరామ్‌ : ఎందుకు ఉపకరించదు! ఉపకరిస్తుంది కాని తెలంగాణ ప్రజల వోట్లు పొంది అధికారంలోకి వొచ్చిన వాళ్లు కేవలం బయటి వాళ్ల మాటలకు లొంగిపోతారనుకోవడం కరెక్టు కాదు. అంతగా లొంగిపోవడం సులభసాధ్యమైన విషయం కాదు. వాళ్లకు అధికారం తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. ఈ ప్రాంత పార్టీ కార్యకర్తలే కదా! ఇవన్నీ జరిగిన తర్వాత ఒక నాయకుడు ఎవరి కిందనో లొంగి ఉండటం సాధ్యం కాదు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ ఉద్యమ చైతన్యం చనిపోలేదని ఈ ఎన్నికలు మనకు ఒక సాక్షంగా
ఉన్నయి. ఆ చర్చ మొదలైతే ఇక ఎట్టిపరిస్థితుల్లో గెలకడం సాధ్యం కాదు. 2018 ఎన్నికల తర్వాత  ఏ రాజకీయ నాయకుడు సాహసం చేసే పరిస్థితిలో లేడు. వాళ్లకు అర్థమైంది. అట్లాంటి సానుభూతితో,వాళ్లకు  దగ్గరగా ఉంటే నష్టమని వారికి అర్థమైంది.
గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కార్పొరేటు కాలేజీలు ఉన్నయి. ఈ పరిస్థితుల్లో అందరికీ ఉచిత విద్యపై ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరించనుంది..
కోదండరామ్‌ : పార్టీ ఇచ్చిన హామీ ప్రధానమైంది కనుక అమలు చేయక తప్పదు. రెండోది ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఉచిత విద్య కావాలనే డిమాండ్‌ పెరిగిపోయింది. ఎందుకంటే ప్రైవేటులో అధిక ఫీజుల భారం మోయలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక భారం భరించలేకపోతున్నరు. అనివార్య పరిస్థితుల్లోనే నాణ్యమైన విద్య ప్రభుత్వమే అందిస్తే బాగుటుందనే డిమాండ్‌ ప్రజల్లో పెరిగిపోయింది. ఈమాటకు వొస్తే చాలా ఇతర రాష్ట్రాల్లో ఉచిత విద్య అనేది  కనీస కార్యక్రమాంగా మారింది. అందుకనే ఉచిత విద్యను ప్రభుత్వం తప్పించుకొని పోవడం సాధ్యం కాదు.
యూనివర్శిటీల స్వయం ప్రతిపత్తి, నియామకాలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వానికి మీరిచ్చే సూచనలు..?
కోదండరామ్‌: గతంలో యూనివర్శిటీల వీసీలు తమకు కావాల్సిన నిధులను ప్రభుత్వం నుంచి సాధించుకోలేకపోయారు. యూనివర్శిటీలకు కావాల్సిన నిధులు సమకూర్చాలి. నిధులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కేవలం ఉస్మానియా యూనివర్శిటీకి ఏడు వందల కోట్ల అవసరం ఉంది. అలా నిధులు ఇవ్వగలిగితే యూనివర్శిటీలకు పూర్వ వైభవాన్ని తీసుకొని రావొచ్చు.
పార్టీ ఫిరాయింపుల మీద కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి, భారాస కడియం శ్రీహరి, బీజేపీ రాజాసింగ్‌ నేతల వ్యాఖ్యలను ఏలా చూస్తారు…?
కోదండరామ్‌ : ప్రభుత్వం మారిపోతుందని కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల మీద చెప్పాల్సిన అవపరం ఉంది. నక్క లొటపిట పెదాలకు ఎదురు చూసినట్లుగానే ఉంది తప్ప అది అయ్యే పని కాదు. ఆయన వేస్తున్న ఎత్తుగడ ఆ పార్టీ మనుగడకే కష్టం కావడం ఖాయం.ఇది ఆయన అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే నష్టపోయేది బీఆర్‌ఎస్‌ పార్టీయే. ఇతరులకు ఎవరికీ ఏ నష్టం, సమస్య లేదు. బీఆర్‌ఎస్‌ నాయకులే తమ విధి విధానాలను మార్చుకోవాలి. ప్రభుత్వాన్ని కూలుస్తం అని మాట్లాడితే అది తప్పుడు సంకేతాలను వ్యాప్తి చేసినట్లవుతుంది. ఇదే ఆలోచనలు అధికార పార్టీకి వొస్తే కష్టమే కదా! ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యాఖ్యలను సహించాల్సిన పనిలేదు. చాలా మంది యువత, సంఘాలు ఇప్పటికే తప్పుబడుతున్నయి. అధికార పార్టీని గద్దె దించుతామనుకోవడం భ్రమ మాత్రమే. ఇలాంటి సంకేతాలు వారికే నష్టం కలిగిస్తాయి. ఒక తప్పుడు తోవ చూపించినట్లు అవుతుందని అది ఇవాళ మనం గ్రహించాలి.
పదేళ్ల ఉమ్మడి రాజధాని కాలం ముగియనుంది.. 9,10 షెడ్యూల్‌లోని సంస్థల విభజన జరగలేదు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ, తెలంగాణలో కాంగ్రెస్‌తో సమస్య పరిష్కారం ఎట్లా?
కోదండరామ్‌ : వాస్తవానికి చిన్న సమస్యలు మాత్రమే మిగిలి ఉన్నవి. సంస్థల విభజన ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. గత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటి పరిష్కారానికి దృష్టి పెట్టలేదు. ఇప్పటికీ చేయాల్సింది ఏమిటంటే ప్రభుత్వం సీరియస్‌గా కూర్చుంటే ఒక నెలరోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవొచ్చు. కొన్ని ప్రధాన కార్యాలయాల పంపకాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం కావడం సులభమే. కొత్త ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి వాటికి ప్రాధాన్యతను ఇవాల్సిన అవసరం ఉంది. వాటిని విభజన చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయి. ఆ సంస్థల్లోని ఖాలీలను  కూడా భర్తీ చేసి అభివృద్ధి కోసం కృషి జరగాల్సి ఉంది.
బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పు, కృష్టానదిలో మన వాటాపై ఏపీ అభ్యంతరాలతో ఎలా ముందుకు సాగుతారు…?
కోదండరామ్‌ : తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది జలాల పంపిణీ కోసం దృష్టి పెట్టాలి. ఇంతకుముందు కేంద్రం విభజన చట్టం నీళ్ల పంపిణీకి ఆటంకం కలిగిస్తుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అందువల్ల సమస్యేం లేదు.చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని పక్కన బెట్టి మొత్తానికి నీళ్ల విభజన సాధించుకునే విషయంపై దృష్టి కేంద్రీకరించాలి. నీటి విభజన కానంత వరకు ప్రాజక్టులకు అనుమతులు రావు. పర్మిషన్లు లేకుండా నిర్మిస్తే గెజిట్‌ ప్రకారం వాటిని ఆపే అధికారం కేంద్రానికి వుంటుంది. మొన్న నాగార్జున సాగర్‌ వద్ద తలెత్తిన సమస్యలు వొస్తుంటాయి. తక్షణంగా నీళ్ల పంపిణీ జరగాల్సి ఉంది.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రభుత్వం ఎటువంటి అవకాశాలు కల్పించబోతుంది..?
కోదండరామ్‌ : ఉద్యమకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు యోచన ఉంది. ఉద్యమకారులకు నివేశన స్థలాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కేసులను కూడా త్వరలో ఎత్తి వేస్తున్నారు.
కోదండరామ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేరబోతున్నారా ? చేరితే మీరే పాత్రను పోషించబోతున్నరు.
కోదండరామ్‌ :  ఏ రకంగానైనప్పటికీ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే ప్రధానంగా మేం దృష్టి పెట్టి పని చేయాలనుకుంటున్నాం.
తెలంగాణ జనసమితి పార్టీ భవిష్యత్‌ ఏమిటి?
కోదండరామ్‌ : తెలంగాణ జనసమితి పార్టీగా వుంటుంది. ప్రజా సమస్యలను లేవనెత్తుతుంది. వాటి పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తది.
(కోడం కుమారస్వామి,  ప్రజాతంత్ర, కాళోజీజంక్షన్‌, హన్మకొండ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *