ఎదనిండా నమ్మకాన్ని నింపుకుని
నిబ్బరంగా నిర్భయంగా
దేశానికి సేవచేసే సైనికుడైనాడు
శత్రువులెపుడు దండెత్తిన
బెదరక అడుగేసిన వీరుడతడు
అహర్నిశలు దేశమే శ్వాసగా
అంకితమై జన్మభూమికి రక్షకుడైన భరతమాత ముద్దుబిడ్డడు
నా దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తే
మనసెపుడు మరువలేని అవమానభారాన్నిచ్చింది
నాదేశమిపుడు కులమతాల కుతంత్రాలతో రగులుతున్న రణస్థలం
సంపన్నవర్గాలకు కాపలా
సమన్యాయమిక్కడ సమాదైంది
వెనుకబాటు కులాలకిక్కడ
రక్షణలేని రాజ్యమయింది
నా దేశమంటే భిన్నత్వంలో ఏకత్వం
ఏకత్వ ఏలికల నాయకత్వమిక్కడ
కులాలెపుడు రాజ్యమేలుతుంటాయ్
ఆదిపత్యకులాలిక్కడ
శాసిస్తుంటాయ్
వివక్షతలెపుడు జాతికి శాపంగా మారుతుంటాయ్
తక్కువ జాతోడెంతెదిగిన
అవమాన తీరాలను చేరుకోవాల్సిందే
మణిపూర్ సంఘటన దేశాన్నంతా కుదిపేస్తున్న
మౌనవ్రతంలో అదినాయకులు
భరతజాతికిదో మాయనికళంకం
జాతిమొత్తం తలదించుకునే సందర్భం
జాతిగర్వం నేడు నగ్నత్వాన్ని సంతరించుకుని
సిగ్గుతో తలదించుకుంటుంది
చందమామపై కాలమోపుతున్న భారతదేశం
ఆడదాని మానానికి అవమానాన్ని అంటించి
తలెత్తుకోలేని సందేశమిచ్చింది
-సి.శేఖర్ (సియస్సార్),
పాలమూరు, 9010480557




