డ్రోన్‌ క్లినిక్స్‌, గగన నిఘాల్లో డ్రోన్‌ టెక్నాలజీ..!

నాటి పాతరాతి యుగం నుంచి నేటి అత్యాధునిక డిజిటల్‌ నానో యుగం వరకు శాస్త్రసాంకేతికశాస్త్ర అనూహ్య ప్రగతి మానవాళి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. వైజ్ఞానిక కల్పిత సినిమాలు, సాహిత్యరంగాల్లో కనిపించే ఊహాజనిత టెక్నాలజీలను నేటి ఆధునిక డిజిటల్‌ నిపుణుడు సుసాధ్యం చేయడంతో పాటు ఇలాంటి డిజిటల్‌ టెక్నాలజీలను మానవాళి సేవల్లో వినియోగించడం చూస్తున్నాం. గగనసీమలో విహరిస్తూ, భూతలంపై జరుగుతున్న మానవ, జంతు కదలికల్ని వైమానిక త్రినేత్రంతో మన చెంతకు చేరవేసే అమూల్య పర్యవేక్షక సేవలను అందించే గురుతర బాధ్యతలను నేటి ఆధునిక నిఘా ‘డ్రోన్‌’ వ్యవస్థ నిర్వహిస్తున్నది.
ఆద్యుడు అబ్రహమ్‌ కరీమ్‌
అమెరికాకు చెందిన అబ్రహమ్‌ కరీమ్‌ కనుగొన్న డ్రోన్‌ టెక్నాలజీ ఉపయోగాలు నానాటికివిస్తరించడా చూస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజారోగ్యం, భూతల విభిన్న స్థితిగతులు, దేశ రక్షణ వరకు డ్రోన్‌ టెక్నాలజీ చేస్తున్న అమూల్య సేవలు ప్రశంసనీయంగా, అబ్బురపరిచేవిగా ఉన్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలలో ప్రారంభ కావలసిన ‘డ్రోన్‌ టెక్నాలజీ’ సేవలను భారతదేశంలో తొలిసారి సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అడుగులు వేయడం హర్షదాయకం. మన చేతిలోని స్మార్ట్‌ ఫోన్ల నుంచి అత్యాధునిక రోబోటిక్స్‌ వరకు ఉప్పెనలా వెల్లువెత్తిన శాస్త్రసాంకేతిక విప్లవ ఫలాలు మన జీవనశైలిని సమూలంగా మార్చడం ఆశ్చర్యంగా చూస్తున్నాం. ఈ అత్యాధునిక టెక్నాలజీ అందించిన మరో అద్భుత ఆవిష్కరణగా ‘డ్రోన్‌ లేదా మానవరహిత వైమానిక నిఘా వాహనం (అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహకిల్‌)’ నాటి కరోనా మహమ్మారి కాలంలో మంచి వరంగా వాడబడిరది. డ్రోన్‌ టెక్నాలజీతో ఖచ్ఛితత్వం, నాణ్యతగల సమాచారం, సులభ నియంత్రణ/వాడకం, భద్రత, సురక్షిత, గోప్యత, చవకైన, 3డి మ్యాపింగ్‌, ప్రమాదకర ప్రదేశాల్లో ఉపయోగం, పర్యావరణ పరిరక్షణ, మిలిటరీ వినియోగం, ప్రాణాల రక్షణ లాంటి పలు సానుకూలతలు ఉన్నాయి.
డ్రోన్‌ క్లినిక్‌లు
మానవాళి క్షేమం కోసం బహుముఖీన అనువర్తనాలతో డ్రోన్‌ స్వదేశీ టెక్నాలజీ దేశ నలుమూలల వినియోగించ బడుతున్నది. కోవిడ్‌-19 సమయంలో వ్యాధుల చికిత్స, బహిరంగ పబ్లిక్‌ ప్రదేశాల్లో సానిటైజేషన్‌, సరుకుల హోమ్‌ డెలివరీ, ప్రజారోగ్య పరిరక్షణ లాంటి విధులతో పాటు అసాంఫీుక శక్తుల కట్టడి, సన్నివేశాల ప్రత్యక్ష ప్రసారం, ప్రమాదకర ప్రదేశాల్లో కూడా గోప్యంగా నిఘా,  దేశ భద్రత, రక్షణ, ఉగ్రవాద కదలికల్ని పసిగట్టడం, వాణిజ్య ప్రకటనలు, సినిమాల నిర్మాణాలు, వన్యప్రాణుల కదలికలు గమనించడం లాంటి పలు ముఖ్య రంగాల్లో నేడు డ్రోన్లు విజయవంతంగా వినియోగించ బడుతున్నాయి. రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్ల సహాయంతో మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందించడం జరుగుతోంది. ఇప్పటికే పలు పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అతి తక్కువ సమయంలో ఔషధాలు, రక్త యూనిట్లు, వైద్య సూచనలు చేరవేయడం సాధారణం అయ్యింది.  మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సహాయం (ఔషధాలు, రక్తం లాంటి అత్యవసరాలు) చేర్చడానికి 4 – 6 గంటల సమయం పట్టే స్థితి నుంచి నేడు డ్రోన్ల వినియోగంతో 15 నిమిషాల్లో వైద్య సహాయం అందుతోంది. మారుమూల ప్రజల అనారోగ్యాలను సెల్‌ మెసేజీల ద్వారా తెలుసుకొని, వెంటనే అత్యవసర సేవలను ‘డ్రోన్‌ క్లినిక్‌’ల సహాయంతో నిమిషాల్లో చేరవేసే స్థితికి సాంకేతిక పరిజ్ఞానం ముందడుగు వేసింది. కరోనా కల్లోల సమయాన డ్రోన్లు చేసిన అమూల్య సేవలను ప్రపంచవ్యాప్త వైద్య సిబ్బంది, నిపుణులు కొనియాడడం జరిగింది. దూర ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో రక్తం అందించడం డ్రోన్ల వినియోగంతో సులభమైంది. వైరస్‌ విపత్తు గడియల్లో సామాజిక దూరాలు పాటించడం, సమూహాలుగా గుమికూడడం, మానవ కదలికల గుర్తింపు, కంటేయిన్‌మెంట్‌ ప్రదేశాల పర్యవేక్షణ, ఆటోమేటెడ్‌ డ్రోన్లతో సానిటైజర్లను స్ప్రే చేయడం లాంటి ముఖ్యమైన విధులను కూడా డ్రోన్‌ టెక్నాలజీ నిర్వహించింది.
రక్షణ రంగాల్లో డ్రోన్‌ టెక్నాలజీ
ఇండియాలో డ్రోన్ల వినియోగం విరివిగా, అర్థవంతంగా, సమర్థవంతంగా జరుగుతున్నది. ఆరోగ్య పరిరక్షణ, గగనతలం నుంచి నిఘా, మ్యాపింగ్‌, దేశ భద్రత, రక్షణ విధులకు డ్రోన్లు విరివిగా ఉపయోగపడుతున్నాయి. డ్రోన్ల శక్తిసామర్థ్యాలను సమర్థవంతంగా వాడుకోవడంలో భారత్‌ సఫలీకృతం అవుతున్నది. విభిన్న సంక్లిష్ట సమస్యలతో సతమతం అవుతున్న భారత్‌లో మిలియన్ల గిరిజన గ్రామీణ ప్రజలకు ప్రాధమిక ఆరోగ్య ప్రదాతలుగా డ్రోన్ల సేవలు కొనియాడబడుతున్నవి. ఇటీవల భారత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్వమిత్వ యోజన’ ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద డ్రోన్‌-ఆధార ప్రాజెక్టును చేపట్టడంతో 6 లక్షల గ్రామాల్లో డ్రోన్ల సహాయంతో సర్వేలు మ్యాపింగ్‌లు జరుగుతున్నాయి. సాంప్రదాయ విధానంలో అసాధ్యమనిపించే ప్రజా సేవలను కొద్ది నిమిషాల్లో పూర్తి చేయడానికి ‘మేకిన్‌ ఇన్‌ ఇండియా’ స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్‌ టెక్నాలజీ ఉపయోగపడడం సంతోషదాయకం.  రాబోయే రోజుల్లో దేశ ప్రజలకు డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా మరింత మేలైన సేవలను అందించాలని కోరుకుందాం. ఇలాంటి స్వదేశీ టెక్నాలజీలను సామాన్యులకు చేరువ చేస్తున్న భారతీయ సాంకేతిక నిపుణులను మనస్పూర్తిగా కొనియాడుదాం. డిజిటల్‌ విప్లవంతో స్వదేశీ పరిజ్ఞానాన్ని రూపొందించుకొని ‘ఆత్మనిర్భర భారత్‌’ను ఆవిష్కరిద్దాం.

-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి

 కరీంనగర్‌, 9949700037  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *