జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది : మంత్రి చామకూరి మల్లారెడ్డి

మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు , నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని అంతాయిపల్లిలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయం సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ముందు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, డీసీపీ శబరీష్, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, కలెక్టరేట్ ఏవో రాంమోహన్రావు, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని, తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్లో విలీనమై నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ, విద్యార్ధులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారని, ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణా అభివృద్ధికి నాంది పలికిందన్నారు. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రానికై పోరాడుతూనే ఉన్నారని, కానీ సంస్థానంలో భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్ముఖ్లు ప్రజలను రకరకాలుగా వేదించారని తెలిపారు. 85 శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణచివేత, వెట్టిచాకిరి, బానిసత్వం కొనసాగిందన్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల ద్వారా మగ్దూం మోహియోద్దీన్, రాజ్ బహదూర్గౌర్, రామానందతీర్ద, మాడపాటి హనుమంత రావు, బూరుగుల రామ కృష్ణా రావు, కొండా వెంకట రంగా రెడ్డి, రావి నారాయణ రెడ్డి, మందుగుల నర్సింగ రావు, వందేమాతరం రామ చందర్ రావు, దేవలపల్లి రామానుజారావు, కె.ఎల్. మహేంద్ర, డా. మర్రి చెన్నారెడ్డి ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. ఆనాడు జరిగిన ప్రజా పోరాటాలలో ఎందరో త్యాగధనులు తెలంగాణలో స్వాతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారని, రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బాసిన దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైనదన్నారు. మరోవైపు ప్రజలపై రజాకార్లు, జమీందార్ల దాడులు పెరిగిన నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని నిజాం రాజుకు రాయబారం పంపారని, తమ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించక పోవడంతో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం రంగంలోకి దిగి, ఆపరేషన్ పోలో తో, ఓవైపు సాయుధ పోరాటం మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమిలేక అప్పటి నిజాం భారత యూనియన్ లో విలీనానికి అంగీకరించాడని తెలిపారు. తదుపరి 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగి బూరుగుల రామకృష్ణా రావును ముఖ్యమంత్రిగా, కొండా వెంకట రంగా రెడ్డి ఉపముఖ్యమంత్రిగా, వి.బి. రాజు, యం. చెన్నా రెడ్డి తదితరులతో మంత్రివర్గం ఏర్పడినట్లు తెలిపారు. హైదరాబాదు సంస్థానం భారత యూనియన్లో కలిసిన తరువాత ఆనాటి కొందరి నాయకుల కుట్రల ఫలితంగా 1953లో మద్రాసు నుండి విడిపోయి మూడు సంవత్సరాల వరకు కర్నూలు రాజధానిగా చేసుకొని ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా కలపటానికి చేసిన నిర్ణయాన్ని ప్రముఖ తెలంగాణ నాయకులు వ్యతిరేకించినప్పటికి భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో 1956లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారని తెలిపారు. కాలక్రమేణా ఆంధ్ర పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో 1969లో ప్రారంభమయిన తొలిదశ ఉద్యమంలో సుమారు 350 మంది అసువులు బాసినారని, ఆ తరువాత మలిదశ ఉద్యమాన్ని నాటి ఉద్యమ నాయకుడు నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో 2001లో ప్రారంభించి సుమారు 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపిస్తూ ప్రజలందరిని ఒకేతాటిపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఫలితంగా జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అనతికాలంలోనే అధ్బుత ప్రగతిని సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *