•గద్దర్ పార్థివ దేహానికి నివాళ్ళు అర్పించిన ప్రముఖులు
•125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం వద్దకు తీసుకెళ్లి నివాళ్ళు
•అధికార లాంఛనాలతో అంతిమ యాత్రకు ఏర్పాట్లు
•ఆల్వాల్ మహాబోధి మహావిద్యాలయంలో సమాధి ఏర్పాట్లు
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : గద్దర్ పార్థివ దేహానికి ఇప్పటివరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ రావు, విహెచ్, గరికపాటి నరసింహారావులు నివాళ్ళర్పించారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన ఎల్బీ స్టేడియం గెట్ నెంబర్-16 షేడ్ కింద వేదికపైన ఆయన భౌతికకాయాన్ని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధువులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలు సందర్శనార్థం ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు ద్వారా క్యూ లైన్ లు పాటిస్తూ గద్దర్ భౌతిక కాయం కు నివాళ్ళు అర్పిస్తూ ముందుకు వెళ్తున్నారు.

దీనితో ఎల్బీ స్టేడియం అంతా కిక్కిరిసిపోయింది. మరోవైపు జానపద కళాకారులు గద్దర్ పడిన పాటలను పడుతూ నృత్యాలు చేస్తూ ఆయన అభిమానులకు ఆయన జ్ఞాపకలను గుర్తు చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు గాను పూలతో అలంకరించిన వాహనాన్ని సిద్ధం చేశారు. 12:40 నిమిషాలకు గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుండి ప్రారంభమై, నాంపల్లి లోని గన్ పార్క్ వరకు చేరుకొని అమరవీరుల స్థూపం వద్ద నివాళ్ళు అర్పించి అక్కడి నుండి నూతనంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం వద్దకు తీసుకెళ్లి అక్కడ నివాళ్ళు అర్పించనున్నారు. అనంతరం అల్వాల్ లోని ఆయన నివాసంకు తీసుకెళ్లి అక్కడి నుండి మహాబోధి మహావిద్యాలయం లో ఆయన దహణసంస్కారం నిర్వహించేందు ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుంది.




