మరో రెండు లోక్‌సభ సీట్లకు
బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన అధినేత కెసిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : వొచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్లను ప్రకటించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా కేసీఆర్ అభ్యర్థులను ఎంపిక చేశారు. తొలి జాబితాలో బీఆర్ఎస్ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇప్పటికే ఖరారుచేశారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై భారాస అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. వరంగల్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో బుధవారం సమావేశమయ్యారు.
ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితర నేతలు సమావేశానికి హజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణతో పాటు అభ్యర్థిత్వంపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను మాజీ మంత్రులు దయాకర్‌రావు, సారయ్య.. కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. అభ్యర్థి ఎంపికను కేసీఆర్ నిర్ణయానికే నేతలు వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటానని అధినేత వారితో చెప్పినట్లు సమాచారం. వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆరూరి రమేశ్ విముఖత చూపినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనవసర నిర్ణయాలతో భవిష్యత్ పాడు చేసుకోవద్దని రమేశ్‌కు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అవకాశమిస్తే మరోసారి పోటీ చేస్తానని ఎంపీ పసునూరి దయాకర్ వెల్లడిరచారు. మరోవైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్‌తో బీఎస్పీ నేతలు సమావేశమయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎంపీ రాంజీ గౌతమ్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చిస్తున్నారు. మాయావతి రాయబారిగా చర్చల్లో రాంజీగౌతమ్ పాల్గొన్నారు.





