పడుంటున్నా గత చరిత్ర గడ్డమీద
ఈ నిద్ర ఏ చీకట్లల్లో దాపురించిందో
శరీరాన్ని వేటాడుతూ స్వారీ చేస్తుంది
బుద్ధిని వెనక్కినెడుతూ పదేపదే
ఈ రోజును నిన్నటిలో కలుపుతూ
రేపటిని అమాంతం మింగుతూ
అగమ్యగోచరం చేస్తుంది
అసాధ్యమైన సరిహద్దుల్లోకి ఈడ్చి కొడుతుంది
లేవాలి లోపల నివురుగప్పిన నిప్పును లేపాలి
ధ్వంసమైన వరుసను మళ్ళీ పేర్చుకోవాలి
కాసిన్ని ఉత్ప్రేరకాల్ని తాగాలి
బుద్ధున్ని చెక్కుకోవాలి
ఓపికను పట్టును పునరుద్ధరించుకోవాలి
నిటారుగా పదునుగా నిలుచోవాలి
పిడికిలి తెరిస్తే మనల్ని నిర్వీర్యం గాంచే
శక్తులు చూర్ణమయ్యి రాలిపోవాలి
రఘు వగ్గు




