కుల మతాలకు ప్రాధాన్యతనిస్తున్న బిజెపి

కులమతాలకు, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తామని ప్రమాణంచేసే రాజకీయ పార్టీలు వోట్లకోసం  ఇప్పుడు వాటిచుట్టే పరిభ్రమిస్తున్నాయి. ఇంతకాలంగా ఆ కులాలను పట్టించుకోని  పార్టీలకు ఇప్పుడు ఎక్కడలేని ప్రేమ పుట్టుకు వొచ్చింది. వారిని ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ఒకరికి మించి మరొకరు పథకాల రచనల్లో పోటీ పడుతున్నారు. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ హామీల వర్షాలను కురిపిస్తున్నాయి.  ఇప్పటికే బిజెపి మిగతాపార్టీలకు ధీటైన ప్రకటన చేసింది. తమ పార్టీని గెలిపిస్తే  వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి  అవుతాడని ప్రకటించడం ద్వారా ఆ సామాజిక వర్గాలవారి వోట్లు గంపగుత్తాగా తమ పార్టీకి పడతాయన్న గట్టి నమ్మకంతో ఉంది. ఈ విషయంలో ఎవరో రాష్ట్ర స్థాయి నాయకుడితో కాకుండా సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీయే ప్రకటించడం వారిలో విశ్వాసాన్ని పెంచేదిగా ఉంది.

బిసి సిఎం అవుతాడని ప్రకటించి మూడురోజులు కూడా కాలేదు అప్పుడే మరో సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు మరోసారి ప్రధాని మోదీ హైదరాబాద్‌లో శనివారం అడుగు పెట్టారు. చాలాకాలంగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు ఆయన ఒక పరిష్కారం చూపించేందుకు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ( ఎంఆర్‌పిఎస్‌) ఆధ్వర్యంలో   ఏర్పాటు చేసిన మాదిగ ఉప కులాల విశ్వరూప సభ మోదీని ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014లో ఎంఆర్‌పిఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ దిల్లీలో  మోదీని కలిసినప్పుడు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాన్నిప్పుడు సరైన సమయంగా మోదీ భావించినట్లు కనిపిస్తున్నది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను బిజెపితో పాటు కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మూడు పార్టీలుకూడా తమదే గెలుపు అన్న ధీమాతో ఉన్నాయి. అందుకే అభ్యర్ధులను ఈ మూడు పార్టీలు ఆచితూచి ఎంపిక చేసుకున్నాయి. జనాభాలో సగం ఉన్న బిసీ వర్గాలను ఆకట్టుకునేందుకు బిజెపి బిసీ సిఎం ప్రకటన చేయడమేకాకుండా ఏకంగా 35 మంది బిసీలకు ఈ ఎన్నికల్లో టిక్కెట్‌  ఇచ్చి మిగతా రెండు పార్టీలకన్నా ముందు వరుసలో నిలిచింది.

ఇప్పుడు  ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో ఏర్పాటు చేసిన సభకు ప్రధాని అంతటివాడు  స్వయంగా రావడం వెనుక కూడా బిజెపి పెద్ద ఎత్తుగడే వేసిందని చెప్పుకోవొచ్చు. తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి సమాజంలోని రెండు వర్గాలను సరైన సమయంలో వాడుకుంటున్నదన్న వాదన లేకపోలేదు. మాదిగ, మాలలతోపాటు సుమారు 57 ఉపకులాలను కలిపి ఎస్సీలుగా వ్యవహరిస్తున్నారు. వీరికి 15 శాతం రిజర్వేషన్‌ కల్పించబడిరది. అయితే రిజర్వేషన్‌ ఫలాలను ఎక్కువగా మాలలే పొందతున్నారన్నది వివాదం. ఉద్యోగ, రాజకీయాల్లో కూడా వారే ముందున్నారన్న విషయాన్ని 1996లో జస్టీస్‌ రామచంద్రరాజు కమిషన్‌్‌ కూడా తేల్చింది. 1970 నుండి సాగుతున్న ఈ పోరాటానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దాదాపు పదేళ్ళుగా కేంద్రంలో పెండిరగ్‌లో ఉన్న ఈ అంశంపైన ఇప్పుడు బిజెపి దృష్టిపెట్టింది. ఇంతవరకు దానిపై  ఎలాంటి చర్యలు తీసుకోని ప్రధాని మోదీ  ఎంఆర్‌పిఎస్‌ ఏర్పాటు చేసిన ఈ సభకు రావడం పక్కాగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వొస్తున్నాడన్నది స్పష్టమవుతున్నది.

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే డిక్లరేషన్‌ల పేర వివిధ వార్గలను సంతృప్తిపరిచే పథకాలను ప్రకటిస్తూ వస్తున్నది. రైతు, ఎస్సీ, ఎస్టీ,లతోపాటు తాజాగా బిసీ, మైనార్టీ డిక్లరేషన్‌లను ప్రకటించింది. ఒక వైపు ఆరుగ్యారంటీలతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ డిక్లరేషన్‌లతో ప్రజలను ఆకట్టుకునే ప్రణాళికలను రచిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ మాదిరిగానే  బీసీ సబ్‌ ప్లాన్‌నుకూడా లక్షల కోట్లతో ఏర్పాటుచేస్తామని  ప్రకటించింది. కులగణనచేసి బిసి కమీషన్‌ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన  ఆరు నెలల్లోనే బీసీ రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇస్తున్నది.  విద్య, ఉపాధి,రాజకీయ, ఉద్యోగల విషయంలో బిసీలకు ప్రత్యేక నిధులు, ప్రాధాన్యతలను ఆ పార్టీ చెప్పుకొచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ కేవలం 23 మంది బిసీలకు టికట్‌ ఇవ్వడం గమనార్హం. కాగా బిఆర్‌ఎప్‌ ఈ పార్టీలకు దీటుగా బిసీ పథకాలను ప్రకటించింది.  ఇప్పటికే దళిత బంధును ప్రకటించిన విధంగానే బిసీ బంధును అమలు పరుస్తున్న విషయాన్ని చెప్పింది. ఆ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో  బిజెపికన్నా తక్కువ స్థానాలనే బిసీలకు కేటాయించింది. బిఆర్‌ఎస్‌ కేవలం 24 మంది బిసీలకు టికట్లుచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *