- ఎవరెన్ని కుట్రలు చేసినా…గెలిచేది బిఆర్‌ఎస్ పార్టీయే..
- తెలంగాణలో దొడ్డి దారిన గెలిచే ప్రయత్నం చేస్తున్నది
- కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదు
- మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మంత్రి హరీష్ రావు
మెదక్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని..బెంగళూరు నగరంలో జరిగిన ఐటి దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని..అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసే ప్రయత్నం చేసిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో మంత్రి హరీష్ రావు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ…కర్ణాటకలో ఇంతకు ముందు 40 శాతం కమీషన్ ప్రభుత్వం ఉంటే…ఇప్పుడు 50 శాతం కమీషన్ ప్రభుత్వం ఉందన్నారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న అంబికాపతి ఆరోజుల్లో 40 శాతం కమీషన్‌తో పని చేసేవారని, నేడు అదే అంబికాపతి 50 శాతం కమీషన్ వసూలు చేసి తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. అంబికాపతి సతీమణి అశ్వత్తమ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అని, ఇద్దరు ఇంట్లో వుండగానే ఐటి దాడులు జరిగాయని, ఐటీ దాడుల్లో రూ.42 కోట్ల నగదు దొరికిందని, అది తెలంగాణకు తరలించేందుకు కాంట్రాక్టర్‌ల నుంచి వసూలు చేసిన డబ్బు అని తెలుస్తుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అంబికాపతి డీకే శివ కుమార్‌కు అత్యంత సన్నిహితుడని, ఈశ్వరప్పకి కూడా సన్నిహితుడని తెలుస్తున్నదని మంత్రి అన్నారు. తెలంగాణ టాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి, పంపే కుట్ర చేస్తున్నారని, కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు బిల్డర్ల దగ్గర నుంచి, వ్యాపారుల నుండి, కాంట్రాక్టర్ దగ్గరి నుండి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయాలని, ఈ అక్రమ వసూళ్లకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన తెలిపారు. బెంగళూరు నుండి వయా చెన్నై ద్వారా హైద్రాబాద్ పంపాలని ప్లాన్ చేశారని, ఇందులో కొందరు బిల్డర్లు, కాంట్రాక్టర్లు పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నదని హరీష్ రావు తెలిపారు. ఇలాంటి రాజకీయాలతో తమకు సంబంధం లేదని, వారి వ్యాపారాలు వారు చేసుకోవాలని, ఎవరైతే కర్ణాటక అక్రమ సొమ్మును తెలంగాణకు తరలించే ప్రయత్నం చేస్తారో వారు భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వొస్తుందని మంత్రి హెచ్చరించారు. కాంగ్రె తెలంగాణలో దొడ్డి దారిన గెలిచే ప్రయత్నం చేస్తున్నదని, పార్టీలో అభ్యర్థులను నిర్ణయించుకోలేని పరిస్థితి ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అభ్యర్థులను తేల్చుకోలేని పార్టీకి సగం సీట్లలో అభ్యర్థులు కరువువయ్యారని అన్నారు. వారు పక్క పార్టీల దిక్కు చూస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని, షెడ్యూల్ వొచ్చినా టికెట్లు డిక్లేర్ చేసుకోలేని దుస్థితి ఆ పార్టీలో నెకొందన్నారు.
అభ్యర్థులు లేని కాంగ్రెస్, డబ్బులతో గెలిచే ప్రయత్నం చేస్తున్నదని, సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారం చేస్తున్నది తప్ప ప్రజల్లో ఆదరణ లేదని ఆయన దుయ్యబట్టారు. కర్ణాటక అంతా అవినీతి మయం అయ్యిందని, ఆ సొమ్మును ఇక్కడ ఖర్చు చేయాలని చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అది కాంగ్రెస్ పార్టీ కాదని..స్కాంగ్రేస్ ంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో లీడర్లు పంచుకుంటారు కానీ ప్రజలకు పంచరని, కాంగ్రెస్ నీతి ఏమిటీ అనేది భయట పడిందని, ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, గెలిచేది బిఆర్‌ఎస్ పార్టీయేనని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డబ్బుకు ప్రాధాన్యం ఇస్తుంది తప్ప, ప్రజల గురించి ఆలోచన లేదని, అప్లికేషన్లకు, టికెట్లు ఇచ్చేందుకు డబ్బులు వసూలు చేయడమే కాక ఇప్పుడు అక్రమ డబ్బు తరలింపును తెలంగాణ సమాజం ఎన్నటికీ సహించదని, వారికి తగిన గుణపాఠం తప్పదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే