ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకుపేరు గోవింద అన్న నానుడిలా ఉందిప్పుడు కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి లొల్లి. గతంలో కాంగ్రెస్‌లో కార్యకర్తలుండరు అందరూ నాయకులే అన్నట్లు, ఇప్పుడు నాయకుల్లో కొందరు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిమీదే అశ పెట్టుకున్నారు. క్రమేణ ముఖ్యమంత్రి అభ్యర్ధుల జాబితా పెరుగుతూ పోతోంది. అర్హతలు, అనుభవమన్న విషయాన్ని పక్కకు పెట్టి రెడ్డి వర్గమైతే ఎవరు, బిసిలకు అవకాశమొస్తే ఎవరు సిఎం కావాలె, ఎస్టీ, ఎస్సీలైతే ఎవరికి అవకాశం అన్నదాని మీదనే చర్చ జరుగుతున్నది. ఎన్నికలు ఇంకా మండలం రోజులుందనగానే ఇప్పటినుండే ఈ చర్చ కొనసాగుతున్నది. కర్ణాటక రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుండి, తెలంగాణ కాంగ్రెస్‌లోనూ జోష్ పెరిగింది. కాగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ బడా నాయకులు ఇక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకునే విషయంలో విస్తృత ప్రణాళికలను రచిస్తున్నారు. రాహుల్, సోనియా, ప్రియాంక లాంటి కాంగ్రెస్ కేంద్ర నాయకులనే సరాసరి ప్రచార రంగంలోకి దింపడంతో తెలంగాణ నాయకత్వానికి ధీమా ఏర్పడింది. ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం వారిలో ఏర్పడింది. దానికి తగినట్లు తెలంగాణలో కూడా కర్ణాటక ఫార్మూలానే అధిష్టానం ప్రయోగిస్తున్నది. అయితే కర్ణాటక ఎన్నికలప్పుడు సిద్దరామయ్యను, డికె శికకుమార్ను ముందు పెట్టి విజయం సాధించింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలిచ్చినా ఈ రాష్ట్ర ఎన్నికలను పర్యవేక్షణా బాధ్యతను డికె శివకుమార్‌కు పార్టీ అప్పగించింది. దీంతో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డికి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛలేకుండా పోయింది.
దానికి తోడు రేవంత్‌రెడ్డికి సరిజోడు ఎవరన్నది కూడా ఆ పార్టీ నిర్ణయించుకో లేకపోతున్నది. కాంగ్రెస్‌లో మొదటి నుండి రెడ్డి వర్గందే డామినేషన్ అన్న విషయం తెలియంది కాదు. దీంతో చాలామంది రెడ్డి వర్గీయులు రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబోయే ముఖ్యమంత్రిని తానేనని కలలు కంటున్నారు. కేవలం కలలే కాదు ఏకంగా బహిరంగ సభల్లోనూ తమ మనస్సులోని మాటలను వెల్లడిస్తున్నారు. ఇటీవల జానారెడ్డి, తాజాగా జగ్గారెడ్డి ప్రకటనలు ఆ పార్టీలో మరో తుఫాన్‌ను సృష్టించే సంకేతాలనిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వివిధ ముఖ్యమంత్రుల వద్ద అనేక మంత్రిపదవులు నిర్వహించిన కుందూరు జానారెడ్డి వారం రోజుల క్రితం తననే ముఖ్యమంత్రి పదవి వెతుక్కుని రావచ్చంటూ సంచలన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించింది. వెల్లడించిన మొదజాబితాలో జానా రెడ్డి కుమారుడి పేరు తప్ప ఆయన అభ్యర్ధిత్వాన్ని పార్టీ ప్రకటించలేదు. రెండవ జాబితాలో కూడా ఆయన పేరు ఉంటుందోలేదో తెలియదు. ఆయన ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదని కూడా తెలుస్తున్నది. అయితే తాను పోటీలో లేకున్నా, ఎంఎల్ఏగా ఎన్నిక కాకున్నప్పటికీ తననే ముఖ్యమంత్రి పదవి వెతుక్కుంటూ వొస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఆయన పివీని ఉదహరించారు. పివి నరసింహారావును ప్రధాని పదవి ఎలా వెతుక్కుంటూ వొచ్చిందో, తనకు కూడా సిఎం పదవి అలానే సంభవించవచ్చని చెప్పుకొచ్చారు. తనను ఆ పదవిలో చూడాలని ప్రజల హృదయాల్లో కూడా ఉందన్నారు. అయితే తాను ముఖ్యమంత్రి ఎలా అవుతానన్న క్లారిటీ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో పాల్గొంటున్న తన కుమారుడిచేత రాజీనామా చేయించి, ఆరు నెలల్లో ఎంఎల్ఏగా ఎన్నికై సిఎం పదవిని అలంకరిస్తానంటూ చెప్పడం చూస్తుంటే, తెలంగాణలో నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నంత నమ్మకం కలుగకపోదు.
ఇదిలా ఉంటే తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డికూడా తన మనస్సులో మాట బహిర్ఘతం చేశాడు. విజయదశమి వేడుకల సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ మరో పదేళ్ళకైనా తాను ముఖ్యమంత్రిని అవుతానన్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. పార్టీలోని ఇతర సీనియర్ నాయకుల్లో కూడా సిఎం పదవిని అధిష్టించాలని ఉన్నప్పటికీ బయట పడటంలేదు. కాని వారి పేర్లు మాత్రం మీడియా ముందు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ రెడ్డి వర్గానికే పదవి దక్కితే అందులో ముందు వరుసలో ముందుగా చెప్పుకున్న జానారెడ్డి, జగ్గారెడ్డితోపాటు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల కాలంలో కాంగ్రెస్ వీడుతారన్న ప్రచారం జరుగడంతో అధిష్టానం ఆయనను పక్కకు పెడుతుందన్న వాదన కూడా లేకపోలేదు. ఇక పార్టీకి రాష్ట్రంలో సారధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి పార్టీలో చేరినప్పటినుండి కొందరు సీనియర్ నాయకులు అలిగిన విషయం తెలియందికాదు. అధిష్టానం గనుక రేవంత్‌రెడ్డిని సింఎం చేస్తే, ఆ పార్టీనుండి ఎంతమంది నిష్క్రమిస్తారో తెలియదు. ఇదిలా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్‌లో బిసి లొల్లి కొనసాగుతున్నది. వీరిలో మధు యాస్కీ తోపాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి.. దళిత నేతకు రాజ్యాధికారం ఎందుకు ఇవ్వడం లేదని ఇంతకాలం ప్రశ్నించిన కాంగ్రెస్ నిజంగానే దళిత నేతను ఆ పదవిలో కూర్చోబెడితే మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం వొస్తుందను కుంటున్నారు. ఈ ఊహా గానాలకు తెరపడేట్లుగా పిసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనూ హ్యంగా సీతక్క పేరును తెర మీదకు తీసుకువొ చ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే కాబోయే ముఖ్యమంత్రి గిరిజన మహిళ సీతక్క అవుతుందని ఓ సందర్భంలో పేర్కొన్న విషయం తెలిసిందే. వీరంతా నేల విడిచి సాము చేస్తున్నట్లు, సమీపంలో ఎన్నికలు పెట్టుకుని, గెలపుపైన దృష్టి పెట్టాల్సిందిపోయి, వొస్తుందో రాదో అన్న అవకాశంపైన ఆశలు పెంచుకోవడమన్నది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది.





