ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం..ఉద్యోగాల్లో 50 శాతం

  • లోక్‌ సభ ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్‌ పార్టీ వరాల జల్లు
  •  ‘నారీ న్యాయ్‌ గ్యారంటీ’ పేర ఐదు గ్యారంటీలను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు ఖర్గే

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మార్చి 13 : లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళా వోటర్లపై కాంగ్రెస్‌ వరాల రaల్లు కురిపించింది. ‘నారీ న్యాయ్‌ గ్యారంటీ’ పేర తాము అధికారకంలోకి వొస్తే మహిళలకు ఐదు గ్యారంటీలను నెరవేరుస్తామని బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే ప్రకటించారు. ఇందులో ‘మహాలక్ష్మి’ పేర పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం అందించే గ్యారెంటీతో పాటు ఆది ఆబాది పూరా హక్‌, శక్తి కా సమ్మాన్‌, అధికార మైత్రి, సావిత్రి భాయి ఫూలే హాస్టల్‌ పేర గ్యారంటీలను నెరవేర్చనున్నట్లు పార్టీ ప్రకటించింది. ‘ఆది ఆబాది పూరా హక్‌’ గ్యారంటీ కింద కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నియామకాలలో సగానికి పైగా మహిళలలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇక ‘శక్తి కా సమ్మాన్‌’ గ్యారంటీ పేర అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ ఆదాయానికి కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు చేయనుంది.

‘అధికార మైత్రి’ గ్యారంటీ కింద మహిళలకు వారి హక్కులపై అవగాహనతో పాటు సాధికారత కల్పించేందుకు ప్రతి పంచాయతీలో ఒక పారాలీగల్‌ ప్రొఫెషనల్‌ని నియమించనున్నారు. ఐదవది ‘సావిత్రి భాయి ఫూలే హాస్టల్‌’ గారంటీ కింద శ్రామిక మహిళలకు సురక్షిత ఆవాసం కల్పించేందుకు అవకాశం ఉన్న మహిళలకు జిల్లా ప్రధాన కేంద్రంలో ఒక హాస్టల్‌ను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే ఈ హామీలను నెరవేరుస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ‘నారీ న్యాయం గ్యారెంటీ’ని ప్రకటిస్తుందని, దీని కింద దేశంలోని మహిళల కోసం పార్టీ కొత్త ఎజెండాను రూపొందించ బోతుందని, ‘నారీ న్యాయం గ్యారెంటీ’ కింద కాంగ్రెస్‌ ఐదు ప్రకటనలు చేస్తుందని ఖర్గే చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *