అన్ని వర్గాలు బీజేపీకి మద్దతు

  • కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే  
  • బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌కె. లక్ష్మణ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌బీజేపీ అంటే సబ్‌ ‌కా వికాస్‌…‌బీఆర్‌ఎస్‌ అం‌టే కెసిఆర్‌ ‌ఫ్యామిలీ వికాస్‌..‌కాంగ్రెస్‌ అం‌టే రాహుల్‌ ‌ఫ్యామిలీ వికాస్‌ అని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ ‌విమర్శించారు. డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌ ‌మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…ఆ రెండు పార్టీలలో పని చేస్తున్న వారు ఆ కుటుంబాలకు బానిసలుగా వ్వవహరిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు హామీలు అమలు చేయకుండా ఇప్పుడు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌దగ్గరకు వెళ్ళి అనుమతి ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ‌డ్రామాలు ఆడుతుందని ధ్వజమెత్తారు. ఒక్క రేషన్‌ ‌కార్డ్ ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తామని మాటలు చెబుతుందని, డిక్లరేషన్లు, గ్యారంటీలు అంటూ కాంగ్రెస్‌ ‌ప్రజలని మరోసారి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని, మైనారిటీ వోట్ల కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని, హిందువులను అవమానిస్తున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలు తగ్గించలేదని, ఇప్పటి వరకు కేసీఆర్‌ ఇక్కడ పెట్రోల్‌ ‌ధరలు, గ్యాస్‌ ‌ధరలు తగ్గించ లేదంటూ లక్ష్మణ్‌ ‌మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల కోసం హామీలు ఇస్తున్నారని ఆయన అన్నారు. సామాజిక న్యాయంలో భాగంగానే బీసీనీ సీఎం చేస్తామని బీజేపీ చెబుతుందని, బీసీ సీఎం అంటే బీసీల కోసం కాదు సమాజంలోని అన్ని వర్గాల కోసమని తెలిపారు. కేసీఆర్‌ ‌లేస్తే మనిషినీ కాదు అని అంటాడు కాని లేవడని, కాపలా కుక్కల ఉంటానని అన్న కేసీఆర్‌ ‌గుంట నక్కలా వ్యవహరిస్తున్నారంటూ లక్ష్మణ్‌ ‌మండిపడ్డారు. రేవంత్‌ ‌రెడ్డి, అసదుద్దీన్‌ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, నువ్వు కొట్టినట్టు చేయ్యు..నేను ఏడ్చినట్టు చేస్త అన్నట్లు వారి వ్యవహారం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఎంఐఎం, కాంగ్రెస్‌ ఒకటేనని, గతంలో కాంగ్రెస్‌తో ఆ పార్టీ ఉందని, బీజేపీ మానిఫెస్టో వోట్ల కోసం కాదని, అమలుకు నోచుకోని హామీలు ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. ఓవైసీ, రేవంత్‌ ‌రెడ్డిలు ఎవరి కోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసునని, కాంగ్రెస్‌కి వోటేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రీటైల్‌గా, హోల్‌ ‌సేల్‌గా అమ్ముడు పోతారని, ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు స్వయంగా చెప్పారని లక్ష్మణ్‌ ‌గుర్తుచేశారు. బీసీ, ఎస్సీలతో పాటు అన్ని వర్గాలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని, బిజెపి విజయం ఖాయమని, విలేఖరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కొందరు కుళ్ళుతో బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *