అధికార పక్షమైనా..ప్రతిపక్షమైనా ప్రజల పక్షాన నిలబడుతాం

రైతుబంధుపై స్పష్టత ఇవ్వండి…ఎప్పటిలోగా జమ చేస్తారో చెప్పండి
మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : అధికారం పక్షమైనా..ప్రతిపక్షమైనా ఎప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడుతామని మాజీ మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. అధికారంలోకి వొచ్చాక డిసెంబర్‌ 9వ తేదీన రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని చెప్పారని..రైతుబంధు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలోని విూడియా పాయింట్‌ వద్ద హరీష్‌ రావు విూడియాతో మాట్లాడుతూ…కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.  రైతుబంధుపై రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తుందని తెలిపారు. వడ్లు అమ్ముకోకండి.. వారు అధికారంలోకి రాగానే బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ప్రచారంలో చెప్పారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వొచ్చినందున వారు ఇచ్చిన హామీ రూ. 500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అంతే కాకుండా మిచౌంగ్‌ తుఫాను కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయని, అలాంటి రైతులను ఆదుకోవాలని హరీష్‌ రావు కోరారు. ప్రభుత్వం నుంచి కొంత స్పష్టత కావాలని..విమర్శలు చేయడానికి తాము రాలేదన్నారు. వ్యవసాయ పెట్టుబడిపైన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఓ వైపు వర్షాలు పడుతున్నాయని..బోనస్‌ యెప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారని..డిసెంబర్‌ 9న ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వటం లేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నవంబర్‌ చివరి వారం డిసెంబర్‌ మొదటి వారంలో వేశామని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. యాసంగి పంట వేసే సమయం వొచ్చిందని.. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. వారు చెప్పిన డిసెంబర్‌ 9 వొచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని హరీష్‌ రావు నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *