అగ్నిపథ్‌ ‌ను రద్ద్దు చేయాలి.. నిరుద్యోగులను ఆదుకోవాలి..

‘‘ఈ ‌టిఒడి స్కీమ్‌ ‌సమాజాన్ని సైనికీకరణ చేయడానికి దారి తీయవచ్చు. దాదాపు 40 వేల మంది యువత ప్రతీ ఏడాది సైన్యం నుండి బయటకు నెట్టబడతారు. ఉద్యోగం పోతే వారిని నిరాశ నిస్పృహలు వెంటాడతాయి. ఆయుధ వినియోగంలో శిక్షణ పొందినవారు ఆర్మీ నుంచి బయటకు వచ్చాక ఖాలీగా ఉంటారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం సైనికులను ఇళ్లకు పంపేయడానికి (డీ మొబిలైజేషన్‌ ఆఫ్‌ ‌సోల్జర్స్) 1919 ‌నాటి పంజాబ్‌ అల్లర్లకు ప్రత్యక్ష సంబంధముందని తేలింది. ఈ టిఒడి విధానం పుట్టిన అమెరికాలోనే దానివల్ల ఉత్పన్నమైన మాజీ సైనికులు ఇల్లు, వాకిళ్లు లేక నేరస్థులుగా స్థిరపడిపోతున్నారని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి..’’

భారతదేశంలో ఏం జరుగుతుందనే సందేహం నెలకొంది. నాడు రైతులు ఆందోళన చేస్తే వారంతా దేశద్రోహులు అయ్యారు. నేడు అగ్నిపథ్‌’’‌ను రద్దు చేయాలని నిరుద్యోగులు దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనలో సైతం దేశ ద్రోహులు ఉన్నారనే వాదన కొన్ని వర్గాల నుండి వ్యక్తమవుతుంది.

దేశంలోలోని ఆయా రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌వద్ద ఆర్మీలో చేరేందుకు సిద్ధపడిన నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరుద్యోగులు ఆగ్రహంతో ఆస్తులను ధ్వంసం చేయడంతో లాఠీఛార్జ్, ‌తూటా మోత మోగింది. నాడు రైతుల పోరాటం నిజం కాదని దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం కొంత మంది చేశారు. ఇదే తరహాలో ఏ పోరాటం ప్రజా వెల్లువలో వచ్చినా అందులో దేశ ద్రోహులు ఉన్నారనే ప్రచారం సర్వ సాధారణం అయిపోయింది. ఇలాంటి ప్రచారంలో చివరికి రైతులే గెలిచారన్నది దేశం ముందు కండ్లకు కట్టినట్లు ఉన్నది.

కానీ రైతు పోరాటంలో ఎంతో మంది రైతులు తమ ప్రాణాలను విడిచారు. ప్రాణాలు విడిస్తే కానీ పాలకులకు అర్థం కాలేదు. ప్రస్తుతం అగ్నిపథ్‌ ‌విషయంలో ఆందోళనకారులు ఎందుకు ఆందోళన చేస్తున్నారనే అనే విషయాన్ని పట్టించుకోకుండా, కొంతమంది వాళ్లు కూడా దేశద్రోహులుగా కొనసాగుతున్న ప్రచారం కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతుంది. అగ్నిపథ్‌ ‌చాలా బాగుందని సమర్థిస్తూ ఇంట్లో కూర్చొని సోషల్‌ ‌మీడియాలో విపరీతంగా ఫేక్‌ ‌పోస్ట్ ‌లు పెడుతున్న వారి సంఖ్య లేకపోలేదు. అదే తరహాలో వారు చేస్తున్న పోరాటానికి పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాస్వామికవాదులు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డడు తల్లి గర్భం నుంచే పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తాను పుట్టిన మట్టి కోసం, పీడిత తాడిత ప్రజల బాగు కోసం పార్టీలకతీతంగా ఉద్యమాలు చేసే మనస్తత్వం కలిగినదే తెలంగాణ గడ్డ. తెలంగాణ గడ్డ మరోసారి బుల్లెట్‌ ‌మోతలతో ఉలిక్కిపడింది. రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఎవరూ లేనప్పటికీ స్వచ్ఛందంగా పోరాటంలో బాధితులు భాగస్వామ్యం కావడం తెలంగాణ సమాజంలో చైతన్యం ఏ స్థాయిలో ఉందో గమనించవచ్చు.

కడుపు నిండినోడు ప్రజా ఉద్యోగ రైతాంగ పోరాటాలను పక్కదారి పట్టిస్తున్నప్పటికి అంతిమంగా ప్రజలే రైతులే నిరుద్యోగులే పోరాటంలో గెలుస్తున్నారు అన్నది కళ్ళ ముందున్న సత్యం. ఒకరకంగా చెప్పాలంటే భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువత నేడు భారతదేశాన్ని ప్రైవేటీకరణ చేసే క్రమంలో కార్పొరేట్‌ ‌శక్తులకు కంపెనీలను సంస్థలను ధారాదత్తం చేస్తున్న పాలకుల తీరుకు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దేశాన్ని కాపాడాలంటూ పోరాటం చేసిన వారు దేశద్రోహులు అయితే దేశాన్ని ప్రైవేట్‌ ‌కార్పొరేటీకరణకు దారాదత్తం చేసే పాలకులు దేశద్రోహులే కదా అని యువత నినాదాలతో భారత భూమి కంపిస్తుంది. యావత్‌ ‌సమాజంలోని యువత ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఎవరికి వారు బాధితులుగా పిడికిలి బిగించి నినాదాలతో ముందుకు కదిలే రోజుల్నిపాలకులు కల్పిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్‌ ‌శక్తులకు కట్టపెట్టే ప్రయత్నాలు చేసినప్పుడల్లా దేశ భవిష్యత్తు కోసం తెలుగు నేల ఎప్పుడూ పోరాటంలో ముందు వరుసలోనే ఉంటుందనటానికి సాక్షమే సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌ఘటన. ప్రైవేటీకరణలో మునిగి తేలుతున్న మోడీ సర్కారు దేశ రక్షణకు అవసరమైన సిపాయిలను సైతం కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని నిర్ణయించడం దేశానికి వినాశకరమని, సైన్యం రిక్రూట్‌మెంట్‌లో కీలక మార్పులు చేస్తూ ‘అగ్నిపథ్‌’ ‌పేరిట ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ విధానం ప్రకారం 17-21 సంవత్సరాల మధ్య వయసున్న వారిని నెలకు రూ.30 నుంచి రూ.40 వేల వేతనంతో నియమిస్తారు. వారికి ‘అగ్ని వీరులు’ అని నామకరణం చేసి ఆరు నెలల పాటు రక్షణ వ్యవహారాల్లో శిక్షణ ఇస్తారు. వేతనంలో మూడవ వంతు మొత్తాన్ని కార్పస్‌ ‌ఫండ్‌కు మళ్లిస్తారు. అంటే తొలి ఏడాది నెలకు రూ. 20 వేలు మాత్రమే వేతనంగా లభిస్తుంది. నాలుగేళ్ల సర్వీసు పూర్తి అయిన తరువాత ఎంపికైన వారిలో 25 శాతం మందిని మాత్రమే రక్షణ శాఖలో కొనసాగించి మిగిలిన 75 శాతం మందిని ఇంటికి పంపేస్తారు. కార్పస్‌లో వారు దాచుకున్న సొమ్ముకు సమాన మొత్తాన్ని సర్కారువారు కలిపి వన్‌టైమ్‌ ‌బెనిఫిట్‌ ‌కింద రూ.11- 12 లక్షల వరకు చెల్లిస్తారు. పెన్షన్‌, ‌గ్రాట్యుటీ లేదా ఇంకే ఇతర బెనిఫిట్స్ ఉం‌డవు. అక్కడితో వారికి సర్కారుతో సంబంధం తెగిపోతుందన్నమాట.

గత రెండేళ్ళ కాలంలో సైన్యంలో రిక్రూట్‌మెంట్‌ ‌లేదని , కేవలం సైన్యంపై ఖర్చును తగ్గించుకోవాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పథకం ఇప్పుడు ఆవిర్భవించిందన్నది ఆర్మీ అభ్యర్థుల ఆవేదన. ప్రజాస్వామ్య దేశంలో ఇది తగునా? పూర్వపు మిలటరీ సాంప్రదాయాలు, నైతిక విలువలు, నిబంధనలకు అనుగుణంగా ఈ పథకం లేదని పలువురు విశ్రాంత సైన్యాధికారులు విమర్శించిన్నప్పటికి దానిని అమలు చేస్తామని తమ నియంత పోకడలతో పాలకులు అవలంబిస్తున్నారు. సైనిక దళాలను ఆర్థిక కోణంలో చూడవద్దని, ఖజానాకు ఆదా చేసిన డబ్బు నుంచి సైనిక జీతం, వృత్తిని అంచనా వేయలేమని వారి వాదనను అన్ని సామాజిక మాధ్యమాల్లో వారు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు, అనుభవ సారాలే. ఈ టిఒడి స్కీమ్‌ ‌సమాజాన్ని సైనికీకరణ చేయడానికి దారి తీయవచ్చు. దాదాపు 40 వేల మంది యువత ప్రతీ ఏడాది సైన్యం నుండి బయటకు నెట్టబడతారు. ఉద్యోగం పోతే వారిని నిరాశ నిస్పృహలు వెంటాడతాయి. ఆయుధ వినియోగంలో శిక్షణ పొందినవారు ఆర్మీ నుంచి బయటకు వచ్చాక ఖాలీగా ఉంటారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం సైనికులను ఇళ్లకు పంపేయడానికి (డీ మొబిలైజేషన్‌ ఆఫ్‌ ‌సోల్జర్స్) 1919 ‌నాటి పంజాబ్‌ అల్లర్లకు ప్రత్యక్ష సంబంధముందని తేలింది. ఈ టిఒడి విధానం పుట్టిన అమెరికాలోనే దానివల్ల ఉత్పన్నమైన మాజీ సైనికులు ఇల్లు, వాకిళ్లు లేక నేరస్తులుగా స్థిరపడిపోతున్నారని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. కనుక అగ్నిపథ్‌ ‌భారత సమాజానికి ఎంతమాత్రమూ మంచిది కాదనే వాదనను పాలకులు గ్రహించకపోతే భారతదేశ పెను ప్రమాదంలో పడుతుంది. కాల్పులతో కాలాన్ని పొడిగించవచ్చు, కానీ కడుపులో నుంచి వచ్చే ఆవేదన ఆక్రోశం కన్నీటి గాథలను తీర్చలేరు.

నిరంతరం దేశభక్తి, జాతీయత అంటూ గొంతు చించుకునే పాలకులు ఏకంగా సైన్యాన్ని కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తామనడం సిగ్గుచేటుగా భావించాలి. సైన్యంలో చేరినవారు లేదా చేరాలనుకునేవారు ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యేది వారి దేశభక్తి, చైతన్య స్ఫూర్తితోపాటు తమకేమైనాగాని తమ కుటుంబానికి ఏ లోటూ లేని విధంగా సర్కారు ఆదుకుంటుందన్న భరోసా కారణం అనేదే పాలకులు మరువకూడదు. కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని ఈ కాంట్రాక్టు సిపాయిలకు ఎలాంటి స్ఫూర్తి కలుగుతుంది? ఏం భరోసా ఉంటుంది? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ ‌పేరిట తెచ్చిన ఈ వినాశకర పథకాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రతి ఒక్కరూ అడగాల్సిందే.

నిరుద్యోగులకు రాజకీయ చైతన్యం లేనప్పటికీ ఒక నిరుద్యోగ ఆగ్రహంతో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలను పాలకపక్షం, ప్రతిపక్షం గ్రహించి సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకు సమయం ఆసన్నమైంది. ప్రతిపక్ష విపక్ష పార్టీలు  శాంతియుత వాతావరణంలో రాజకీయాలకు అతీతంగా సమస్యను పరిష్కరించే విధంగా బాధ్యత వహించాలి. పాలకపక్షం సమస్యను స్నేహపూర్వకంగా  పరిష్కరించడానికి ఒక మెట్టు దిగి వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నది. కరోనా సమయంలో ఆర్మీ రిక్రూట్మెంట్‌ ఆగిపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగులు పెరిగిపోవడంతో వారి వయసు నుంచి శాశ్వత పరిష్కారం దిశగా ఆర్మీ రిక్రూట్మెంట్‌ ‌చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయాలి. అగ్నిపథ్‌ ‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి, ఆర్మీని  ప్రైవేటీకరించడం కోసం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. 

-గోపీనాథ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *