కాలం కళ్లెర్రజేసి కల్లోలం రేపినా
కొరోనా కక్షగట్టి కకావికలం చేసినా
కన్నీళ్లతో కడుపు నింపినం తప్పా
బిచ్చం కోసం మిమ్ము అర్థించలేదు
కనీస మద్దతు ధర ఇవ్వకున్నా
ఎరువుల సబ్సిడీలు అందకున్నా
నేలమ్మను నమ్ముకున్నమే తప్పా
శాపనార్థాలతో తిట్టిపొయ్యలేదు
సాగుబాటు నగుబాటు చేసినా
జీవితాలతో చెలగాటం ఆడినా
మారుతరని ఆశ పడ్డమే తప్పా
గద్దె దించే కుట్రలు రచించలేదు
అయినా మీ పీఠాన్ని అడగలేదు
దోచి దాచిన సొమ్ము కోరనేలేదు
చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని
కొనుగోలు చేయమని వేడుకున్నం
దానికే నానా రాద్ధాంతం చేస్తూ
పరస్పర దూషణలకు దిగుతూ
కయ్యానికి కాలుదువ్వుతున్నరు
పగటి వేషగాళ్లను మరిపిస్తున్నరు
మా రెక్కల కష్టం ఫలమే కదా
మీరు బొజ్జనిండ తిని బలిసేది
మా వోట్లు తెగ దండుకునే కదా!
మహారాజులై రాజ్యాలేలుతుంది
పాలకులారా ! ఇకనైనా..
ఉత్తరకుమార శపధాలు తీసికట్టి
రాజకీయ రంకులాటలు కట్టిపెట్టి
వరి గింజలు కొనుగోలు చేయండి
అన్నదాతకు అండగా నిలువండి
కాదంటే వడ్ల పోరాటం పోటెత్తుడే
మీ రాజ్య పీఠాలు బీటలుబారుడే
(వరి ధాన్యంపై కేంద్ర రాష్ట్ర పాలకుల
కువైఖరికి నిరసనగా…)
– కోడిగూటి తిరుపతి :9573929493