రాజకీయ సంక్షోభంలో పాకిస్తాన్‌.. ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక

భారతదేశానికి ఆ చివరన పాకిస్తాన్‌, ఈ ‌చివరన శ్రీలంక… ఈ రెండు దేశాలు ఇప్పుడు సంక్షోభ పరిస్థితిని ఎదుర్కుంటున్నాయి. పాకిస్తాన్‌ ఎప్పటిలాగానే రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంటే, పాలనా వైఫల్యాలతో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో పడిపోయింది. ఇప్పుడు సహాయంకోసం ఇతర దేశాలను అర్థించే స్థితికి దిగజారింది. ఒక విధంగా తమ రాజకీయ లబ్ధికోసం విపరీత నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందన్నదానికి ఇప్పుడు శ్రీలంక ఉదాహరణగా నిలుస్తున్నది. తమ పదవులను కాపాడుకునేందుకు రాష్ట్రాలైనా, దేశాలైనా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే క్రమంలో అంచనాలకు మించిన కార్యక్రమాలను చేపట్టడమే చేటుగా మారుతోంది. ముఖ్యంగా ‘ఉచిత’ అనే పథకాలవల్ల ప్రభుత్వాలు బోలెడన్ని నిధులను వెచ్చించాల్సిరావడం, వాటికోసం ఇతర దేశాలనుండి అప్పులు తీసుకురావడం,అవి తడిపి మోపడై అటు ప్రజల నెత్తిన కుంపటిగా మారడమేకాకుండా ఇలా శ్రీలంక తరహాలో ప్రజల ముందు, ఇతర దేశాలముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. శ్రీలంక ప్రభుత్వం కూడా తమ రాజకీయ లబ్థికోసం ప్రజలను సంతోషపెట్టేందుకు కోట్లాది రూపాయల పన్నులను రద్దు చేసింది.

వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని కెమికల్‌ ‌ఫర్టిలైజర్స్‌ను నిషేధించి, ఆర్గానిక్‌ ‌సాగును ప్రోత్సహించింది. ఈ చర్య మంచిదే అయినా దాని పర్యవసానాలను ఊహించలేకపోయింది. సరైనా విధానంలో ఉత్పత్తి జరుగకపోవడంతో ఉత్పత్తి పడిపోయింది. దానికి తగినట్లు కొరోనా  కారణంగా టూరిజంపైన వచ్చే ఆదాయం కుంటుపడింది. దీంతో తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొంటున్న తరుణంలో ఎక్కువ వడ్డీతో కమర్షియల్‌ ‌బ్యాంకులనుండి తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేక చతికిలపడింది. ఫలితంగా దేశ ప్రజలకు కనీస అవసరాలను తీర్చలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. అక్కడి ప్రజలు నిత్యావసర సరుకులను కూడా పొందలేక పోతున్నారు. ఒక వేళ లభించినా వంద శాతం ఎక్కువ ధరను చెల్లించాల్సిన పరిస్థితి. దానికి కూడా గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సి వస్తున్నది. కిలో బియ్యం ఖరీదు  రెండు వందల రూపాయలయింది. పండ్లు, కూరగాయల ధరలను మాట్లాడించేట్లులేదు. కిలో యాపిల్‌ ‌వెయ్యి రూపాయలు పలుకుతున్నది.

దాదాపు పదమూడు నుండి పదిహేను గంటలవరకు విద్యుత్‌ ‌సరఫరా నిలచిపోతున్నది. గ్యాస్‌, ‌కిరోసిన్‌ ‌లభించడంలేదు. దీంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల తిరుగుబాటు మొదలయింది. పాలన చేతగాని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు చేస్తున్నారు. ఏకంగా దేశాధ్యక్షుడి నివాసంపైకే దూసుకు పోవడంతో  పెద్ద గందరగోళమే ఏర్పడింది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో రాజకీయ పరిస్థితులుకూడా శరవేగంగా మారుతూ వస్తున్నాయి. రాజపక్స కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లో ఉండడానికి వీలులేదని ప్రజలు నినదిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం సోషల్‌ ‌మీడియాపై ఆంక్షలు విధించడం, కర్ఫ్యూ అమలు చేయడం, ఎత్తివేయడం లాంటిచర్యలతో సతమతమవుతున్నది. శ్రీ లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాని మహింద్‌ ‌రాజపక్స మినహా దాదాపు 26 మంది మంత్రులు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభంకూడా బయలు దేరింది. కొత్త మంత్రివర్గాన్ని ఎంపిక చేయడంకోసమేనని ప్రభుత్వం చెబుతున్నా పాలనలో ఉండేందుకు నాయకలు ఇష్టపడడంలేదని తెలుస్తున్నది.

ఇదిలా   ఉంటే అధికార పక్ష కూటమి అయిన ఎస్‌ఎల్‌పిపినుండి దాదాపు నలభై మంది సభ్యులు చట్టసభనుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడా సర్కార్‌ ‌మైనార్టీలో పడిపోయింది. అయినా ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదు, తమ వద్ద మెజార్టీ సభ్యులున్నారని చెబుతోంది. తక్షణం తమను ఆదుకునేందుకు సహకరించాల్సిందిగా విదేశాలముందు ప్రభుత్వం అర్రులు చాస్తోంది. శ్రీలంక ప్రజల దీనావస్థను చూసిన భారత్‌ ‌ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువచేసే బియ్యం, డీజిల్‌ అయిల్‌, ఇతర వస్తువులను విడుతల వారీగా అందజేస్తోంది. దీని కంతటికీ తమ అధికారాన్ని నిలుపుకునేందుకు రాజపక్స కుటుంబ సభ్యులు అనుసరించిన అంచనాలేని అర్థిక విధానాలే కారణమని పత్రికలు, విశ్లేషకులు కోడై కూస్తున్నాయి.  ఇది ఒకవిధంగా మన దేశంతోపాటు, చీటికిమాటికి అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన రుద్దే ప్రభుత్వాలకు గుణపాఠం అవుతుందంటున్నారు.

పాకిస్తాన్‌లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం మొదలయింది. మంచి క్రికెటర్‌ అయిన ఇమ్రాన్‌ఖాన్‌ ‌మంచి రాజకీయ నాయకుడు కాలేక పోవడమే ఈ సంక్షోభానికి కారణంగా చెబుతున్నారు. మిత్రపక్షమైన ముత్తాహిదా మూవ్‌మెంట్‌-‌పాకిస్తాన్‌ (ఎం‌క్యూఎం-పి) బుధవారం కూటమి నుండి వైదొలగటంతో పార్లమెంట్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ‌ప్రభుత్వం మెజార్టీని కోల్పోయింది. మిత్రపక్షాల డిమాండ్లను తీర్చలేకపోవడంతో ఆ పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దానికి తోడు దేశంలో ఆయన చేస్తున్న ప్రసంగాలు, విపక్ష, స్వపక్షాలన్న తారతమ్యంలేకుండా నోటిదురుసుతనం వల్ల అందరినీ దూరం చేసుకుంటున్నాడన్న అపవాద ఆయనపైన ఉంది. యుక్రెయిన్‌-‌రష్యా యుద్ధంలో భారత్‌లాగా తటస్థ వైఖరిని అవలంభించాలనుకున్న ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. యుద్దం సమయంలో ఆయన రష్యా అధ్యక్షుడిని కలవడం అమెరికాకు నచ్చలేదు. అందుకే దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం వెనుక అమెరికా హస్తం ఉందంటూ ఆయన బహిరంగంగానే ప్రకటించాడు. దానికి తగినట్లు ఆయన అధికారానికి రావడానికి దోహదపడిన అక్కడి మిలటరీ అమెరికాకు వత్తాసు పలుకుతుండడంకూడా ఆయన్ను మరింత ఊబిలోకి నెడుతున్నది. సంక్షోభ పరిస్థితిలో ఉన్న ఈ రెండు దేశాల ప్రభావం పరోక్షంగా భారత్‌పై పడుతోంది. అక్కడి సంక్షోభ పరిస్థితుల కారణంగా భారత్‌కు మరిన్ని వలసలు పెరిగే ప్రమాదమున్నది..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page