‌ప్రొఫెసర్‌ ‌సాయిబాబా నిర్దోషి

మావోయిస్ట్ ‌సంబంధాలను తోసిపుచ్చిన బాంబే హైకోర్టు
•విడుదలకు ఆదేశాలు

ముంబై, మార్చి 5 : మావోయిస్టులతో సంబంధాల ఆరోపణల  కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ ‌సాయిబాబాకు భారీ ఊరట లభించింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ మంగళవారం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీంతో కొన్నేళ్లుగా జైలులో ఉన్న  సాయిబాబా త్వరలో  నాగ్‌పూర్‌ ‌సెంట్రల్‌ ‌జైలు నుంచి విడుదల కానున్నారు. వివరాల్లోకి వెళితే దిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సాయిబాబాను 2017లో గడ్చిరోలి సెషన్స్ ‌కోర్టు దోషిగా తేల్చిన విషయం విధితమే. దేశంపై యుద్ధం చేసే కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై  ఆయనను దోషిగా నిర్దారించింది. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. అయితే సెషన్స్ ‌కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా, ఇతరులు చేసిన అప్పీల్‌పై బాంబే హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. నాగ్‌పూర్‌ ‌సెషన్స్ ‌కోర్టు తీర్పును న్యాయమూర్తులు వినయ్‌ ‌జోషి, వాల్మీకి ఎస్‌ఏ ‌మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ ‌విఫలమైందని న్యాయమూర్తులు వినయ్‌ ‌జోషి, వాల్మీకి ఎస్‌ఏ ‌మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఇక యాభై నాలుగేళ్ల సాయిబాబా వీల్‌చైర్‌కే పరిమితమైన దివ్యాంగుడు. దిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్‌ ‌లాల్‌ ఆనంద్‌ ‌కళాశాలలో ఇంగ్లీష్‌ ‌ప్రొఫెసర్‌గా సాయిబాబా చాలాకాలం పనిచేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నట్టు ఆరోపణలపై జైలుపాలు కావడంతో 2021 ఫిబ్రవరిలో  అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ఉద్యోగం నుంచి ఆయనను తొలగించారు. ఈ క్రమంలో ఆయన కోర్టులోనే పోరాడారు. మావోయిస్టు లింక్‌ ‌కేసులో జిఎన్‌ ‌సాయిబాబా, హేమ్‌ ‌మిశ్రా, మహేష్‌ ‌టిర్కీ, విజయ్‌ ‌టిర్కీ, నారాయణ్‌ ‌సాంగ్లికర్‌, ‌ప్రశాంత్‌ ‌రాహి, పాండు నరోటే (మరణించారు)లను బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ ‌బెంచ్‌ ‌నిర్దోషులుగా ప్రకటించింది. హైకోర్టు గతంలో నిర్దోషిగా విడుదల చేసిన ఉత్తర్వును సుప్రీమ్‌ ‌కోర్టు కొట్టివేయడంతో సాయిబాబా అప్పీల్‌ను బాంబే హైకోర్టు మళ్లీ విచారించింది. ఈ క్రమంలో జస్టిస్‌ ‌వినయ్‌ ‌జోషి, జస్టిస్‌ ‌వాల్మీకి ఎస్‌ఏతో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడిస్తూ.. మావోయిస్టు సంబంధాల కేసులో దిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ ‌జిఎన్‌ ‌సాయిబాబాతో పాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ ‌బెంచ్‌ ‌నిర్దోషులుగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *