- నీట్ ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులకు రాహుల్ గాంధీ హామీ
- మోదీ 24 లక్షల విద్యార్థులను, వారి కుటుంబాలను నాశనం చేశారని విమర్శ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 9 : నీట్ ఫలితాల్లో అవకతవకలపై 3వ సారి ప్రధాని పదవిని చేపట్టబోయే నరేంద్రమోదీని దుయ్యబట్టారు. పార్లమెంట్లో విద్యార్థుల గొంతకగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని లోక్ సభలో ప్రతి పక్ష నేతగా బాధ్యతలు నిర్వహించబోయే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. నీట్ అవకతవకలపై రాహుల్ మాట్లాడుతూ..నరేంద్ర మోదీ ప్రధానిగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే నీట్ పరీక్షలో జరిగిన స్కామ్ 24 లక్షలకు పైగా విద్యార్థులను, వారి కుటుంబాలను నాశనం చేసిందని అన్నారు. ఒకే పరీక్షా కేంద్రం నుండి ఆరుగురు విద్యార్థులు గరిష్ట మార్కులతో పరీక్షలో అగ్రస్థానంలో ఉన్నారని, చాలామంది సాంకేతికంగా సాధ్యం కాని మార్కులను పొందారని, అయినా పేపర్ లీక్ అయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కొట్టిపారేసుందని అన్నారు.
విద్యా మాఫియా, ప్రభుత్వ యంత్రాంగంతో కుమ్మక్కైన పేపర్ లీక్ ఇండస్ట్రీని ఎదుర్కునడానికి కాంగ్రెస్ పటిష్టమైన ప్రణాళికను రూపొందించిందని, తమ మేనిఫెస్టోలో, చట్టం చేయడం ద్వారా విద్యార్థులను పేపర్ లీక్ నుండి విముక్తి చేస్తామని హామీ ఇచ్చామని రాహుల్ చెప్పారు. పార్లమెంటులో తాను వారి గొంతుకగా మారి భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను గట్టిగా లేవనెత్తుతానని దేశంలోని విద్యార్థులందరికీ హామీ ఇస్తున్నానని రాహుల్ తెలిపారు.
యువత ఇండియా కూటమిపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారని, కూటమి వారి గొంతును అణచివేయడానికి అనుమతించదని రాహుల్ అన్నారు. నీట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు పర్యవేక్షణలో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, బీజేపీ యువతను మోసం చేసి వారి భవిష్యత్తుతో ఆడుకుంటుందని కాంగ్రెస్ శుక్రవారం ఆరోపించింది. నీట్ సహా అనేక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, రిగ్గింగ్, అవినీతి అంతర్భాగంగా మారాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.




