పథకాల అమలులో ముందుండాలి..!

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రినిధులు,అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష
దళిత బంధు పథకం ఒక సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం సమాజంలో లేదని అది చూసే వారి ఆలోచనలో ఉందని మంత్రి అన్నారు.ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీవోలతో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు గురువారం
 ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మెదక్   జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ చేశారు. వివిధ పథకాలను అర్హులకు అందించే విషయంలో అందరూ దృష్టి సారించాలని మంత్రి హరీశ్​రావు ఆదేశించారు. రాష్ట్రంలో అమలవుతున్న, అమలు కాబోతున్న పథకాల్లో జిల్లా ముందుండాలని స్పష్టం చేశారు.
 ముఖ్యమంత్రి కేసీఆర్  ఎస్సీ సామాజిక వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కాబట్టి నియోకవర్గస్థాయిలో లబ్దిదారుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని నిజమైన అర్హులకు మొదట పథకాలు అందేలా చూడాలన్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వెంటనే వారికి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా బీసీలకు లక్ష రూపాయాల ఆర్థిక సాయం (బీసీ బంధు), గృహ లక్ష్మి, ఇళ్ళ స్థలాల పంపిణీ, గొర్రెల పంపిణీ, వికలాంగుల పెన్షన్, కేసీఆర్​ న్యూట్రీషన్ కిట్ వంటి పథకాల అమలులో జిల్లా పనితీరుపై మంత్రి హరీశ్​ రావు పలు సూచనలు చేశారు.వీటితో  పాటు పెండింగ్ పనులు పూర్తి  చేసి జిల్లా ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు .
బీసీ బంధు , గృహ లక్ష్మి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి హరీశ్​ రావు ఎమ్మెల్యేలకు, అధికారులకు స్పష్టం చేశారు. మహిళల పేరుమీదనే ఈ పథకం అందిచబోతున్నందున.. అర్హులందరూ లబ్ది పొందేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఆదేశించారు. దఫాల వారీగా నియోజకవర్గాలలో ఈ పథకాలను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని..అందరికీ సమయానికి అందించే విధంగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు చొరవ చూపాలని మంత్రి కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్  పెద్ద మనసుతో వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే రూ.3 వేల పెన్షన్ ని రూ.4 వేలకు పెంచి వారి సంతోషానికి కారణమయ్యారన్నారు.నియోకవర్గంలో ఉన్న దివ్యాంగులు అందరికీ పెన్షన్ అందే విధంగా చూడాలని ఆదేశించారు.  కలెక్టర్ లు కొత్తగా ఇవ్వబోతున్న పెన్షన్ గురించి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి అందించాలన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలు వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నూతన పీహెచ్ సీ భవనాలు, పల్లె దవాఖాన్లతో పాటు ఇతర పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
అదే విధంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనందున ప్రతి నియోజకవర్గంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల నిర్వహణ, మరమత్తులు మొత్తం ఈ పాటికే పూర్తి చేసుకోవాలన్నారు. అయితే ఇంకా ఎక్కడైనా మిగిలిన పనులు ఉంటే వాటిని కూడా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు వేగంగా ఇళ్ళ పట్టాలు అందించాలని తెలిపారు.
ఉమ్మడి మెదక్​ జిల్లా అభివృద్ధికి  కోసం చేసిన విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు స్వీకరించి వాటిని పూర్తి చేసిన మంత్రి హరీశ్​ రావుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్,మదన్ రెడ్డి ,మాణిక్ రావు ,పద్మ దేవండర్ రెడ్డి , ముతిరెడ్డి యాదగిరి ,సతీష్ బాబు , ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, సుభాష్ రెడ్డి  , రాష్ట్ర హ్యాండ్లూమ్​ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ , అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి , సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ , మెదక్ కలెక్టర్ రాజ్​ హర్ష , సంగారెడ్డి కలెక్టర్ శరత్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతా , మెదక్ , సంగారెడ్డి ఎస్పీలు, మూడు జిల్లా అడిషనల్​ కలెక్టర్లు , ఆర్డీవో లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *