నేరుగా భక్తులకు తిరుమలలో దర్శనం

తిరుమల, జూన్‌ 28 : ‌కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారిని 69,143 మంది భక్తులు దర్శించుకోగా 26,145 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు వచ్చిందని వివరించారు.

ఇదిలావుంటే తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూన్‌ 30 ‌నుంచి జూలై 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం గురువారం  సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ఏవైనా దోషాలు జరిగినా, ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

ఇందులో భాగంగా శుక్రవారం మొదటిరోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారని ఆలయ అధికారులు వివరించారు. జూలై 1న ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం, జూలై 2న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *