రాష్ట్రంలో నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
సమస్యాత్మక 13 నియోజకవర్గాలలో 4 వరకే పోలింగ్
మొత్తం 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు
ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఇసి
వోటేయడానికి సొంతూళ్లకు తరలివెళ్లిన నగర ప్రజలు… దారిబత్తా ఇచ్చి తీసుకువెళుతున్న నేతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : దేశ వ్యాప్తంగా నాలుగో వ్నిడత ఎన్నికలలో భాగంగా నేడు తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. లోక్ సభ ఎన్నికలకు శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. ఆ తరవాత రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులోకి వొచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టటైన ఏర్పాట్లు చేశారు. 160 కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మోహరించాయని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి 20 వేల పోలీస్ బలగాలు వొచ్చాయని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో రెండు బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని వివరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందని, వాటిని సీఈఓ ఆఫీస్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. లక్ష 90 వేల మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. వొచ్చే 48 గంటల పాటు వొచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని వివరించారు. 21 వేల 680 మంది వోటర్లు హోమ్ వోటింగ్ వేసుకున్నారని వికాస్ రాజ్ తెలిపారు. 328 పోలింగ్ కేంద్రాలను ఏజెన్సీ ఏరియాల్లో ఏర్పాటు చేశామని వెల్లడిరచారు.
మూడు పోలింగ్ కేంద్రంలో అత్యల్ప వోటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల విధుల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది వోటర్లు ఉండగా. ఇందులో సగానికి పైగా మహిళా వోటర్లే. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను 13 నియోజక వర్గాల్లో మహిళా వోటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లలో ఎండలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని సూచించింది ఎన్నికల సంఘం. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల సంఘం, అలాంటి ఏరియాల్లో ప్రత్యేక బలగాలతో నిఘా పెట్టేలా ప్లాన్ చేసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం.. అలాంటి ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగాలని నిర్ణయించింది. రాష్ట్ర పోలీసులతో పాటు ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్రం నుండి 175 కంపెనీలు విధుల్లో ఉండనున్నాయి. ఎన్నికల విధుల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల్లో వ్యయ పరిశీలకులుగా 14 మందిని నియమించారు. జనరల్ పరిశీలకులుగా 17 మందిని నియమించారు. ఇకపోతే ఎన్నికల సిబ్బంది సామాగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వారిని ప్రత్యేక వాహనాల్లో భద్రత మధ్య చేరవేశారు.
వోటేయాడానికి సొంతూళ్లకు తరలివెళ్లిన నగర ప్రజలు…దారిబత్తెం ఇచ్చి తీసుకు వెళుతున్న నేతలు
అసెంబ్లీ ఎన్నికల్లో వోటు వేసేందుకు ప్రజలు సిటీ నుంచి సొంతూళ్ల బాట పట్టారు. నగరంలో కూలీనాలీ చేసుకునే వారు ఇప్పటికీ సొంతూళ్లలోనే వోటును కలిగి ఉన్నారు,. వీరంతా ఆయా పార్టీల పిలుపుతో సొంతూళ్లకు బయలుదేరారు. వివిధ జిల్లాలకు వెళ్లేవారు ఒకరోజు ముందుగానే బయలుదేరారు. పోలింగ్ సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవులు కలుపుకుని సోమవారం ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో శనివారం సాయంత్రం నుంచే కుటుంబాలతో వెళ్తుండగా బస్టాండ్లలో రద్దీ కనిపించింది. ఆదివారం కూడా పెద్ద ఎత్తున బస్టాండ్ల వద్ద, రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ కనిపించింది. రెండు మూడు రోజులుగా అడ్డాలపై కూలీలు కూడా పెద్దగా కనిపించడంలేదు. వలస వోటర్లను సొంతూళ్లకు రావాలని ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు కోరారు. కొద్దిరోజులుగా అభ్యర్థులు కూడా సిటీకి వచ్చి తమ సెగ్మెంట్లలోని వోటర్లతోనూ ఆత్మీయ సమ్మేళనాలు సైతం నిర్వహించారు.
తప్పకుండా వొచ్చి వోటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందినవారు ఎక్కువగా ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, బీఎన్‌రెడ్డి నగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో ఉంటారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు మెహిదీపట్నం వైపు, వరంగల్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల వారు ఎల్ బీనగర్, ఉప్పల్ వైపు, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు లింగంపల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఈసారి వలస వోటర్లపై దృష్టి సారించారు. పోలింగ్ రోజు వొచ్చేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు వోటర్లను తరలించే పనిలో ఉన్నారు. వీరికోసం ప్రత్యేకంగా వాహనాలు పెట్టారు. వోటేయడానికి వొస్తే అయ్యే ఖర్చులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.




