నేడు కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం

జాతీయ రాజకీయాల్లో విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అత్యున్నత నిర్ణాయక మండిలి సమావేశాలను కాంగ్రెస్‌ ‌పార్టీ హైదరాబాద్‌ ‌కేంద్రంగా నేడు ప్రారంభించనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీని పునర్‌ ‌వ్యవస్థీకరించారు. అలా వ్యవస్థీకరించబడిన కమిటీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సమావేశమవుతున్నది. జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఈ కమిటీ ద్వారా తీసుకునే నిర్ణయాలపై యావత్‌ ‌దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అంతటి అతి ముఖ్యమైన కమిటీ సమావేశాలు సాధారణంగా దిల్లీలోనే జరుగుతాయి. కాని, ఈసారి ఆ ఆనవాయితీని కాదని వ్యూహాత్మకంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వెనుక కాంగ్రెస్‌ ‌పెద్దలు పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లు కనిపిస్తున్నది. తెలంగాణతో పాటుగా అయిదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే మరో ఆరు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్‌ ‌తీసుకునే నిర్ణయాలు కాంగ్రెస్‌ ‌భవిష్యత్‌ను నిర్ణయించేవిగా ఉంటాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ గత దబాబ్ధకాలంగా అధికారానికి దూరమైంది. అప్పటినుండీ అనేక ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తాకుతూనే వచ్చాయి. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో విజయదుందుబి మోగించిందో ఆ పార్టీకి కొత్త మలుపు వచ్చింది. దాని తర్వాతే దేశంలోని 28 రాజకీయ పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడే అవకాశానికి దారితీసింది. కూటమిలోని రాజకీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌ అం‌డగా నేడు అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని ఎదుర్కోవడానికి సన్నద్దమైనాయి. ఈ పరిస్థితిలో దేశ రాజకీయాల విషయంలో కాంగ్రెస్‌ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆసక్తి అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది. అయితే హైదరాబాద్‌ ‌కేంద్రంగా సిడబ్ల్యుసీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కోల్పోయిన రెండు తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ‌తన బలాన్ని పుంజుకునే అవకాశంతోపాటుగా, త్వరలో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం లేకపోలేదు.

కాంగ్రెస్‌ ‌పార్టీ తీసుకునే నిర్ణయాలకు దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ ‌చర్చావేదికగా మారుతుంది. అంతేగాక కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ముఖ్యనేతలందరూ మూకుమ్మడిగా హైదరాబాద్‌ ‌చేరుకోవడంతో రాష్ట్రంలో మరో రెండు మూడు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని ఈ సమావేశాల ద్వారా పూరించినట్లు అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయినప్పటి నుండి ఇక్కడి అధికార పార్టీ బిఆర్‌ఎస్‌కు ఇంతకాలం బిజెపియే ప్రత్యమ్నాయమైంది. అయితే ఆ పార్టీలో మారిన పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌పార్టీ బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయమన్న మాట వినవస్తున్నది. దాన్ని మరింత బలంగా ముందుకు తీసుకుపోవడానికి ఈ సమావేశాలు ఆ పార్టీకి ఎంతో ఉపయోగించనున్నాయి. వాస్తవంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కాంగ్రెస్‌ ‌హయాంలోనే అనడాన్ని ఎవరూ కాదనలేనిది. అయితే తెలంగాణను ఏర్పాటు చేయడంద్వారా కాంగ్రెస్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరమైంది. తెలంగాణ ప్రజలు ఏ ఆశయంతోనైతే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారో, ప్రత్యేక తెలంగాణలో ఆ ఆశయాన్ని ప్రజలు పొందలేకపోయారన్న ఆవేదనలు సర్వత్రా వినవస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీకి అధికారాన్నిస్తే ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ పాలన సాగుతుందన్న హామీ ఇవ్వడానికే ఈ సమావేశాన్ని వ్యూహాత్మకంగా ఇక్కడ ఏర్పాటుచేశారు.

ఎందరో అమరుల త్యాగాలకు చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసింది. ఆలాంటి తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడంలేదని, ఇప్పటికైనా ప్రజలు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారా సోనియాకు రిటర్న్ ‌గిఫ్ట్ ఇవ్వాలంటున్నారు స్థానిక నాయకులు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు ఉండాలంటున్న కాంగ్రెస్‌ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతు, యూత్‌, ‌వెల్ఫేర్‌, ఎస్సీఎస్టీ డిక్లరేషన్‌లను ప్రకటించింది. శనివారం సీడబ్ల్యుసీ సమావేశాలనంతరం ఆదివారంనాడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో అత్యంత ప్రధానమైన అయిదు అంశాలను సోనియాగాంధీ ప్రకటించబోతున్నది. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అయిదు అంశాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతున్న క్రమంలో ఆ అయిదు అంశాలేవిటని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సోనియాగాంధీతోపాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలతో పాటు కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, అశోక్‌ ‌గెహ్లట్‌, ‌భూపేష్‌ ‌భాగెల్‌, ‌సుఖ్విందర్‌సింగ్‌ ‌సుజు, దేశంలోని పలువురు కాంగ్రెస్‌ ‌ముఖ్యులు రాష్ట్ర రాజధానికి చేరుకుంటుండడంతో రాష్ట్ర రాజధాని కాంగ్రెస్‌ ‌కోలహాలంగా మారబోతున్నది. ఆ పార్టీ ఆలోచన కూడా అదే. రానున్న ఎన్నికల వేళ ఈ సమావేశాలు తమ పార్టీవర్గాలకు మరింత జోష్‌ను ఇస్తాయనడంలో సందేహం లేదన్నది వారి అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *