నీట్‌ అవకతవకలపై ప్రధాని మౌనమెందుకు..

  • ప్రమాదంలో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం
  • కేంద్రం తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపాటు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 18 : ఎంబీబీఎస్‌ సహా పలు వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘నీట్‌ యూజీ-2024’లో అక్రమాలపై  ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు ‘మౌనం’గా ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. పరీక్షా పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని కోరుతూ పార్లమెంట్‌ లోనూ, పార్లమెంట్‌ బయటా యువత పక్షాన తమ వాణి వినిపిస్తామని మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్టులో పేర్కొన్నారు. బీజేపీ పాలిత బీహార్‌, గుజరాత్‌, హర్యానా రాష్ట్రాల్లో పరీక్షల్లో అవినీతి చోటు చేసుకుందని స్పష్టంగా        కనిపిస్తుందని, పరీక్షా పత్రాల లీకేజీకి బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రంగా నిలిచాయని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

నీట్‌ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారుతున్నా ప్రధాని నరేంద్రమోదీ సహజ సిద్ధమైన మౌనం పాటిస్తున్నాపేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పరీక్షా పత్రాల లీకేజీకి కేంద్రంగా మారాయనడానికి ఆ రాష్ట్రాల్లో జరుగుతున్న అరెస్టులే నిదర్శనమని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు తీసుకుని వొచ్చి యువత భవిష్యత్‌కు బాటలు వేస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన లోక్‌ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొందని, యువత వాణిని వినిపించేందుకు, వారి భవిష్యత్‌ కోసం కఠిన విధానాలు రూపొందించేందుకు కేంద్రంపై విపక్ష పార్టీగా ఒత్తిడి తెస్తామని రాహుల్‌ స్పష్టం చేశారు. నీట్‌ యూజీ-2024 నిర్వహణలో ‘0.001 శాతం’ నిర్లక్ష్యం జరిగినా సహించే ప్రసక్తి లేదని సుప్రీమ్‌ కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాహుల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *