నిండా మునిగిన ఉల్లేపల్లి

ఉగ్ర ఆకేరుతో గ్రామం బురదమయం…నీట మునిగిన 90 గృహాలు
కట్టుబట్టలతో మిగిలిన 120 కుటుంబాలు
350 ఎకరాల్లో పంట నష్టం…వరదలో కొట్టుకుపోయిన గేదెలు, మూగ జీవాలు
వివరాలు సేకరిస్తున్న అధికారులు…ప్రత్యేక మెడికల్‌ క్యాంపు ఏర్పాటు
 
మరిపెడ, ప్రజాతంత్ర, సెప్టెంబరు 4 : గాఢ నిద్రలో ఉన్న ఉల్లేపల్లిని ఉగ్ర ఆకేరు ఒక్కసారిగా ముంచెత్తింది. ఓ పక్క హోరు వాన..మరో పక్క మోకాళ్లలోతు నీరు ఇళ్లల్లోకి చేరింది. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే అంతకంతకు వరద పెరుగుతుండటంతో ఇళ్లు సామాన్లు వదిలి గ్రామస్తులంతా కట్టు బట్టలతో ఎత్తైన ప్రాంతాలకు, భవనాల పైకి చేరారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆకేరు వాగు ఊర్లో ప్రవహించటం ప్రారంభమైంది. దీంతో గ్రామంలో యువత, పెద్దలు ఊర్లోని అందరిని అప్రమత్తం చేసి వృద్ధులను, మహిళలను, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాఢాంధకారంలో ఏరు ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో బిక్కుబిక్కుమంటు తెల్లవారే వరకు గడిపారు. కానీ తెల్లవారినా అటు వరణుడు, ఇటు ఆకేరు కరుణించకపోవటంతో గ్రామంలోని సుమారు 90 ఇండ్లు పూర్తిగా నీటమునిగాయి. 1989తర్వాత ఇంతటి ఉపద్రవం గ్రామంలో ఎప్పుడు చూడలేదని, అప్పటి కంటే ఇప్పుడు మరింత అధికంగా ప్రవాహం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
గ్రామం మొత్తం బురద మయం..
ఉల్లేపల్లి గ్రామానికి ఎగువన ఉన్న ఊర చెరువు, వీరారం చెరువు, జమ్మి చెరువు, తుమ్మల చెరువు కట్టలు తెగి ఆకేరులో కలవటంతో ఊరి ఇరుపక్కలా కి.మీ మేర విస్తరించింది. మర్నాటికి వరద ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ఇళ్లకు చేరుకుకున్న గ్రామస్తులకు ఎటు చూసినా బురదే దర్శనమిచ్చింది. అన్ని రైతు కుటుంబాలే కావటంతో గత వేసవిలో దాదాపు గ్రామంలోని అందరు వడ్లు పట్టించి బియ్యం ఇండ్లల్లో వేసుకున్నారు. వరద తాకిడికి గ్రామంలో సుమారు 400 క్వింటాళ్లపైనే బియ్యం వరదల్లో పనికి రాకుండా పోయింది. దీంతో గ్రామంలో ఏ ఇంట్లోను బియ్యం లేని పరిస్థితి. బియ్యంతో పాటుగా నిత్యవసరాలు, విలువైన పత్రాలు కూడా చాలా వరకు తడిచి పనికి రాకుండా పోయాయి. సుమారు 70 ఇండ్లల్లో వంట సామాన్లు కూడా కొట్టుకుపోయి, గృహాపకరణాలు పాడై సర్వస్వం కోల్పొయారు. ఇండ్లల్లో బురద పేరుకుపోవటంతో రెండు రోజుల నుంచి శుభ్రం చేస్తున్నా కొలిక్కిరాని పరిస్థితి.
image.png
రైతులకు అపార నష్టం..
ఆకేరు వరద గ్రామంలోకి దూసుకురావటంతో ఇంట్లో ఉన్న ధాన్యం, జొన్నలు, పత్తి, కందులు, పెసలు వంటి పంటలు మొత్తం తడిచి పనికి రాకుండా పోయాయి. మోర వెంకన్న, మోర వీరన్నల 10 క్వింటాల పెసలు, బేతమల్లు శ్రీనుకు చెందిన 10 క్వింటాళ్ల పత్తి, కొలిచెలమల శాంతయ్య 120 క్వింటాళ్ల ధాన్యం, కొలిచెలమల వెంకన్న 100 క్వింటాళ్ల ధాన్యం తడిచి ముద్దైంది. ఇక వరద ధాటికి గ్రామ పరిధిలోని సుమారు 350 ఎకరాల పంటలు ధ్వంసమైనట్లు వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. అధిక శాతం వ్యవసాయ క్షేత్రాల్లో ఇసుక మేటలు వేసి వొచ్చే పంట కూడా సాగు చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లు రైతులు తెలిపారు. అదే విధంగా సాగు కోసం తెచ్చిన ఫర్టిలైజర్స్‌ కూడా కరిగిపోయాయి. గ్రామానికి చెందిన మోర వెంకన్న, వీరన్న, పురుషోత్తంలకు చెందిన రూ. 50వేల విలువ చేసే ఫర్టిలైజర్స్‌ ధ్వంసమవగా, ఉల్లోజు బంగారి ఇంట్లోని 35వేలు, ప్రతాపరెడ్డి ఇంట్లో 50వేలు కొట్టుకుపోయినట్లు బాధితులు తెలిపారు. అదే విధంగా గ్రామంలో 3 గేదెలు, 70 జీవాలు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
వ్యాపారులకు సైతం తీరని నష్టం..
గ్రామంలో కిరాణ షాపులు నిర్వహిస్తున్న తవిసి గోవర్థన్‌, తవిసి జయమ్మ, ఉప్పల వెంకన్నలు ముగ్గురివి కలిపి సుమారు రూ.2 లక్షల మేర సామాన్లు వరదలో కొట్టుకుపోయినట్లు తెలిపారు. అదే విధంగా గ్రామంలో రెండు ఫర్టిలైజర్‌ షాపులుండగా మాలోత్‌ తిరుపతికి చెందిన షాపులో సుమారు రూ.70వేలు, నరేష్‌ కు చెందిన షాపులు సుమారు రూ.50వేల విలువ చేసే ఫర్టిసైడ్స్‌ కొట్టుకుపోయాయని వారు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థిక చేయూత అందించాలని వేడుకున్నారు.
ఆహారం కోసం ప్రజలకు తప్పని తిప్పలు..
దాదాపు గ్రామంలోని 70 శాతం ఇండ్లు నీట మునగటంతో ప్రతి ఇంట్లో బియ్యం లేని పరిస్థితి. అంతే కాకుండా నిత్యవసరాలు కూడా పూర్తిగా పాడవటంతో 120 కుటుంబాలకు ఆహారం కోసం తిప్పలు తప్పటం లేదు. కొంత మేర బియ్యం అందుతున్నప్పటికి వంట సామాన్లు, నిత్యవసరాలు లేక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం త్వరగా నిత్యవసరాలు, అదే విధంగా బెడ్‌ షీట్స్‌ కూడా అందివ్వాలని కోరుతున్నారు.
కొనసాగుతున్న పారిశుధ్యం, వైద్య శిబిరం..
రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాను సారం గ్రామంలో అధికారులు నష్టపోయిన వారి వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్‌ నేతలు గ్రామంలో పలువురు దాతల సహకారంతో నిత్యవసరాలు అందిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముంపునకు గురైన ఇండ్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తక్షణ సాయం అందించేందుకు వారి నుంచి కుటుంబసభ్యుల వివరాలు, నేరుగా బ్యాంకు ఖాతలోకే సాయం చేరేలా ఖాతా నెంబరు తీసుకుంటున్నారు. గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *