ఏమి ఉద్ధరించవనీ
ఈ దేశం మీద విద్వేషం
ఏమి అర్పించావనీ
ఈ వ్యవస్థ మీద ఆక్రోశం
ఎంతసేపూ…
కులమత కుంపట్లు తప్పా
సమైక్య జీవిక కలగన్నావా?
స్వార్థపు వెంపర్లాట తప్పా
విశాలత్వం ప్రదర్శించావా?
ద్వేషంతో ఊరేగుట తప్పా
ప్రేమ జల్లుల కురిపించావా?
నేల విడిచి సాము తప్పా
ఒదిగిన్నట్లు కనిపించావా?
ఓయి నాగరిక మనిషి !
అణువంత ఆశించకనే
గాలి నీరు నిప్పు ప్రకృతి
సర్వం దారబోస్తున్నాయ్
పీడనగా తలవక నేలమ్మ
కడదాకా నిను భరిస్తుంది
నోరులేని జీవదాతువులే
త్యాగాల నెలవైనప్పుడు
బుద్దిజీవైన నువ్వెందుకు
వినాశకారిగా మిగుల్తావు?
ఇప్పటికైనా..
సర్వ మానవ శ్రేయ కొరకు
సకల ప్రాణుల క్షేమ కొరకు
కార్యదక్షునివై అడుగువెయ్
నవజీవన సేద్యం సాగించి
విజ్ఞాన ఫలాలు పండించు
విశ్వజనీన ప్రేమలు పంచు
అప్పుడే నీ జీవితానికి
సార్థకత్వం చేకూరినట్లు
నీ దేశ రుణం చెల్లించినట్లు
– కోడిగూటి తిరుపతి, 9573929493