తిరుమల, జనవరి 28 : తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. సప్త వాహనాలపై మలయప్పస్వామి భక్తులకు దర్శనచ్చారు. సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 9 గంటలకు చిన శేష వాహన సేవ,11 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహించచారు. మధ్యాహ్నం హనుమంత వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చారు. సాయంత్రం కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఇక రాత్రి 8 గంటలకు చందప్రభ వాహనంపై భక్తులకు కనిపించనున్నారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనమిచ్చారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ప్రత్యక్ష దైవం సూర్యనారా యణుడి జన్మదినాన్ని పురష్కరించుకుని రథసప్తమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో శ్రీవారు సప్తవాహనాలపై దర్శనం ఇచ్చారు. శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చందప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీవారు భక్తులు రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలుగా భావిస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. రథ సప్తమి సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. దీంతో తిరుమలలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.
భక్తుల కోసం మాడ వీధుల్లోని గ్యాలరీల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, అన్న పానియాలు వితరణ చేపట్టారు. రద్దీకి తగినవిధంగా అక్కడక్కడా తాత్కాలిక షెడ్లు ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ భక్తులకు వసతి సదుపాయాలు లేకపోవడంతో చలిలోనే స్వామివారి దర్శనం కోసం ఆరుబయట గడిపేసారు. రథసప్తమి నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సర్వ దర్శన టోకెన్ల జారీ రద్దు చేసింది. భక్తులకు అందుబాటులో స్వామివారి ప్రసాదం 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ ఉంచుకుంది. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.