ఎన్నికలలోనే రాజకీయం…అభివృద్ధి విషయంలో కాదు
రాష్ట్రాభివృద్ధిలో రాజీ లేదు…భేషజాలు లేవు
ప్రధాని మోదీ పెద్దన్నలా సహకరించాలి
ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా
ఆదిలాబాద్ సభలో సిఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4 : రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. అభివృద్ధి విషయంలో కాదని సిఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో సంబంధాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదని, రాష్ట్ర అభివృద్ధికి అది ఆటంకమని, సహృద్భావ వాతావరణం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పదేపదే ఘర్షణాత్మక వైఖరి వల్ల నష్టపోయేది రాష్ట్రాల ప్రజలేనని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత అనేక విషయాలను ప్రధాని దృష్టికి తీసుకని వెళ్లామన్నారు. భూములు సహా అనేక విషయాలను పరిష్కరించామని అన్నారు. అభివృద్ధిలో రాష్రానికి మోదీ పెద్దన్నలాగా ఉన్నారని అన్నారు. సోమవారం ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని శాలువాతో సత్కరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వొచ్చిన ప్రధానికి స్వాగతం తెలుపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు రాష్ట్రానికి వొచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. .గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనకబడ్డామని, రాష్ట్ర విభజన హామీ మేరకు ఎన్‌టిపిసి 4 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే.. గత ప్రభుత్వం ధోరణితో కేవలం 1600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందన్నారు.
మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తాము అన్ని అనుమతులు ఇస్తామని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో వెలుగులు నిండనున్నాయన్నారు. అందుకే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసామని రేవంత్ రెడ్డి అన్నారు. స్కై వేలు, టెక్స్ టైల్స్ ఏర్పాటు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పనందించినందుకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి పట్ల తమ ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో, మూసీ నదీ పరివాహక అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో తమ ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదని, కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. దేశంలో ఐదు ట్రిలియన్ ఎకానవిూ సాధనకు తెలంగాణ సహకరిస్తుందన్నారు. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఆదిలాబాద్‌కు నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని, దీని కోసం భూసేకరణకు కావాల్సిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ప్రధాని మోదీకి సిఎం రేవంత్ రెడ్డి విన్నవించారు.





