నువ్వు ఏం మాట్లాడినా
నీ నొసటిమీద కుంకుమ బొట్టులా
ఒక ముద్రను అచ్చుగుద్దుతాడు వాడు
గోడలకు సున్నం కొట్టినంత సులభంగా
నీ మాటలకు లేని
వింత వింత రంగులను పులుముతాడు
పలుకుల్లో వినిపించని అర్థాలకు
పండితోత్తములతో కొత్తభాష్యాలను పలికిస్తాడు
మాట్లాడటమెంత నేరమో
సాక్షాత్తు’’రాజ్యాంగం’’నోటితో
నిజానికీ-అబద్ధానికి మధ్యగల ‘‘గీత’’
వాని అరచేతిలో కులుకుతూ కూర్చుంటుంది
మాటల మీద నిషేధ విషాదాలనుచిమ్మిన వాడు
జనాలమీదికి స్వేచ్ఛగా అబద్ధాలను
అణుబాంబుల్లా విసురుతాడు
బాణం కొసకు విషం పూసినట్టు
ప్రతి మాటకూ అసత్యలేపనం రుద్ది మరీ వదులుతాడు
ఏది నిజమో,ఎదబద్ధమో అర్థం కాక
నువ్వూ-నేనూ
రెండు శిబిరాల్లో యుద్ధవీరులమవుతాం
యుద్ధంలో సత్యం నెత్తురుకక్కుతూ నేల రాలుతుంది
ఇక నిజమెప్పటికీ తేలదు
వానిముందు
నిజనిర్ధారణ కమిటీలు సైతం
అందమైన అబద్ధం మీద ఆటోగ్రాఫులు వేస్తుంటాయి
– తోకల రాజేశం
9676761415