‘‘పుతిన్, జెలెన్‌స్కీలు వెనక్కి తగ్గకుండా సై అంటే సై అంటూ కాలుదువ్వడం, యుద్ధాన్ని భీకర స్థాయిలో కొనసాగించడం చూస్తున్నాం.
ఉక్రెయిన్ గెలిస్తే అంతర్జాతీయ వేదికల్లో రష్యా ప్రాబల్యం తగ్గడం, రష్యా గెలిస్తే నాటో కూటమితో కొత్త వివాదాలు తలెత్తే అవకాశమే కాకుండా మరికొన్ని యుద్ధాలను ప్రపంచం చూడవచ్చని ఊహిస్తున్నారు. అమెరికా మిత్రదేశాలు అందిస్తున్న ఆయుధాలు, టెక్నాలజీ, ఆర్థిక సహాయంతో ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. ఈ సహాయం ఎన్ని రోజులు దొరుకుతుందో తెలియదు. ఎంతటి సమస్యలను అయినా ప్రజాస్వామ్యయుత చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, ప్రపంచ దేశాలతో పాటు ఐరాస కూడా ఈ దిశగా ఇరుపక్షాలను అంగీకరింపజేసి, మధ్యేమార్గంగా రాజీ కుదిర్చి ప్రపంచ శాంతి స్థాపన దిశగా పటిష్ట అడుగులు చేయాలని పౌర సమాజం కోరుకుంటున్నది. ’’
ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా 23 ఫిబ్రవరి 2023 నిర్వహించిన 193- సభ్యత్వం కలిగిన ఐరాస 11వ అత్యవసర ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో రష్యా దాడిని ఖండిస్తూ యుద్ధం ముగియడానికి రష్యా బలగాలు బేషరతుగా సత్వరమే వెనక్కి తగ్గాలని కోరుతూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో 141 దేశాలు యుద్ధ అంతానికి రష్యా బేషరతుగా, వెంటనే వెనక్కి తగ్గాలని కోరగా తీర్మానించగా, 07 దేశాలు (బెలారస్, కొరియా, ఎరిట్రియా, మాలి, నికార్‌గువా, రష్యా, సిరియా) వ్యతిరేకించగా, 32 దేశాలు ఓటింగుకు హాజరు కాలేదు. ఓటింగుకు హాజరు కాని దేశాల్లో ఇండియా, చైనా లాంటి దేశాలు ఉండడం విశేషం. ఓటింగుకు దూరంగా ఉన్న ఇండియా కూడా యుద్ధం త్వరగా అంతం కావాలని ఇరుపక్షాలను కోరడం మనకు తెలుసు. ఈ ఐరాస తీర్మానానికి ఎలాంటి చట్టబద్దత లేనప్పటికీ అధిక దేశాలు యుద్ధ ముగింపును కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది. భద్రతా మండలిలో రష్యా, చైనా లాంటి దేశాల వీటో పవర్‌తో యుద్ధ అంతానికి ఐరాస ప్రయత్నాలు నిర్వీర్యం అవుతున్నాయి. పుతిన్ పుర్రెలో తిరిగిన దాడి పురుగు కారణంగా ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే దుస్సాహసానికి వ్యతిరేకంగా యుద్ధం ఏడాది కాలంగా కొనసాగడం, ఉక్రెయిన్ ప్రతిఘటనకు (యూయస్, యూరొప్ దేశాలు చేయూతనిస్తూ) రష్యా బలగాలు అపార నష్టాలను చవిచూడడం, దిక్కుతోచని దుస్థితిలో రష్యా యుద్ధం కొనసాగించడం జరుగుతున్నది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని సమర్థించుకుంటున్న అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఈ యుద్ధం కొనసాగడానికి అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలే కారణమని, తమ భూభాగాలను పొందడానికి మాత్రమే ఈ పోరాటం చేస్తున్నామని వాదిస్తున్నారు. మా పోరాటంలో మా మిత్రుడైన చైనా కూడా తమ వైపు నిలబడి చేయూతను ఇస్తున్నట్లు తెలుపుతున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఎన్నటికీ మాస్కో గెలవడం అసాధ్యమని యూరొప్ దేశాలు రష్యాను హెచ్చరిస్తున్నాయి. కొద్ది రోజుల్లో/వారాల్లో ముగియవచ్చనుకున్న యుద్ధం వీరోచిత ఉక్రెయిన్ ప్రతిదాడులతో ఏడాది పాటు కొనసాగడం, అపార నష్టాలను ఇరు దేశాలు చవిచూడడం, ప్రపంచ దేశాలు పలు తీవ్ర ప్రభావాలను ఎదుర్కోవడం జరుగుతున్నది. పుతిన్, జెలెన్‌స్కీలు వెనక్కి తగ్గకుండా సై అంటే సై అంటూ కాలుదువ్వడం, యుద్ధాన్ని భీకర స్థాయిలో కొనసాగించడం చూస్తున్నాం. ఉక్రెయిన్ గెలిస్తే అంతర్జాతీయ వేదికల్లో రష్యా ప్రాబల్యం తగ్గడం, రష్యా గెలిస్తే నాటో కూటమితో కొత్త వివాదాలు తలెత్తే అవకాశమే కాకుండా మరికొన్ని యుద్ధాలను ప్రపంచం చూడవచ్చని ఊహిస్తున్నారు. అమెరికా మిత్రదేశాలు అందిస్తున్న ఆయుధాలు, టెక్నాలజీ, ఆర్థిక సహాయంతో ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. ఈ సహాయం ఎన్ని రోజులు దొరుకుతుందో తెలియదు. ఎంతటి సమస్యలను అయినా ప్రజాస్వామ్యయుత చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, ప్రపంచ దేశాలతో పాటు ఐరాస కూడా ఈ దిశగా ఇరుపక్షాలను అంగీకరింపజేసి, మధ్యేమార్గంగా రాజీ కుదిర్చి ప్రపంచ శాంతి స్థాపన దిశగా పటిష్ట అడుగులు చేయాలని పౌర సమాజం కోరుకుంటున్నది.
కరీంనగర్ – 9949700037