కులమతాల గజ్జితో
పుండువారిన సమాజంలో
వివక్షల పక్షపాతపు దృక్కులు
ఎన్నాళ్ళు?ఇంకెన్నాళ్లు?
పంచభూతాలకు లేని పక్షపాతం
మనకెందుకు?
మనిషికి మనిషికి మధ్య
మానని గాయమై
రసి కారుతోన్న ఈ వర్ణవివక్ష
అంటు వ్యాదంటూ
ఊకదంపుడు ఉపన్యాసాలే!
ఎవ్వరైనా ఈ బలహీనతనే
బలమైన నావగా మలచుకొని
ఎన్నికల నదిని దాటేది.
ప్రజాస్వామ్య దేశంలో
విద్వత్తు,విజ్ఞానం,రాజ్యపు భవిత
అజ్ఞానాంధకారంలో
తిరుగేటట్లుగా చేస్తూ
మేధస్సును పక్షపాత ఊబిలో
కూర్చేస్తోన్న,
ఈ ఓట్ల రాజకీయాలింకెన్నాళ్లు?
కుత్సిత రాజకీయ మనుగడకై
పరస్పర విభేదాలసృష్టి
ఇంకెన్నాళ్లు?
మకిలిపట్టిన వ్యవస్థలో
మిణుకు మిణుకు పట్టాలే
వెలుగులు విరజిమ్ముతోంటే,
సమన్యాయం కరువవ్వగా,
కలలను జోకొడుతూ
బరువైన బతుకులీడుస్తోన్న యువత
నైరాశ్యంలో కూరుకుపోతోంటే
దేశమేగతి బాగుపడును?
మార్పులేని శిలాశాసనంలా
ఇంకెన్నాళ్ళీ వివక్ష?
ఆలోచించాలి మేధావి వర్గం.
సరస్వతీపుత్రుల ఆకలి తీర్చే,
ప్రజ్ఞకు పట్టం కట్టే దిశగా
వెతకాలి పరిష్కారం.
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం