ఈ ఎన్నికలు ఎవరికి ప్రయోజనం..?

 

 

కార్పోరేట్ ఏజెంట్లకు సీట్లు ఇస్తున్న ప్రధాన పార్టీలు

పొంగులేటి.. పువ్వాడ అజయ్ ఇద్దరూ కార్పోరేట్ రాజకీయ నాయకులే వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దం అవుతున్న పార్టీలకు బుద్ది చెప్పండి.

మావోయిస్టు పార్టీ అగ్రనేత అజాద్ ప్రకటన విడుదల

 

భద్రాచలం, ప్రజాతంత్ర , అక్టోబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల కోలాహలం నెలకొంది. మాదే గెలుపంటే మాదే గెలుపని ప్రధాన పార్టీలు రెండు తీవ్రంగా పోటీ పడుతూ ఆరోపనలు, ప్రత్యారోపనలతో జనాలను గందరగోళానికి గురిచేస్తున్నారని మావోయిస్టు పార్టీ అగ్రనేత అజాద్ సోమవారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. మాయమాటలు, అమలుకు వీలుకాని హామిలతో మేనిఫెస్టో తయారు చేసి ఒకరికి మించి మరొకరు ఉచితాలను ఇస్తామంటూపోటీపడుతున్నారని అన్నారు. చిత్తశుద్ధిలేని హామీలతో మరో మారు ప్రజలను మోసంచేసేందుకు సిద్ధమయ్యారు.76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికి ప్రజల బ్రతుకుల్లో ఎలాంటి మార్పూలేదని లేఖలో విమర్శించారు.. 18 సార్లు ప్రతి ఐదేళ్ళకు ఒక సారి పౌరులు తమ బ్రతుకులు మార్పుకోసం ఓట్లల్లో పాల్గొంటూనే ఉన్నారు. ఈ దేశంలో పాలకులు సామాన్యుడి బ్రతుకుల్లో ఎలాంటి మార్పులు చేయకపోగా పెట్టుబడిదారులు, కార్పోరేట్ లీడర్లు, భూస్వాముల ఆధాయం మాత్రం ఘననీయంగా పెంచేందుకు చట్టాలను తయారుచేశారు. రైతులు కూలీలుగా, మధ్యతరగతివారు పేదలుగా మారి ఉన్న ఊర్లను విడచి పట్టణాలకు వలసలుపోయి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎన్నో ఖాలీలు ఉన్నా అవి పూర్తిస్థాయిలో భర్తీ చేసిందిలేదు. నిరుద్యోగం చదువుకున్న యువతను పట్టి పీడిస్తుందని వివరించారు.. అనేక కంపెనీలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డ ఉదాహరణలు కోకొల్లలు. మహిళల పరిస్థితిలో నేటికి ఎలాంటి మార్పు లేదు. నిత్యం దాడులు, లైంగిక వేదింపులు, మానభంగాలతో నరకం చూస్తున్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ప్రస్తుతం జరిగే ఎన్నికలు మొదటివి కావు చివరివీకావు. పేదలను బిచ్చగాళ్ళుగా చేసి వో ట్ల నాలుగురోజులు డబ్బులు, మద్యం ప్రవాహంలా మారి ఓటరు ఒక కొనుగోలు వస్తువయ్యాడు. ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వస్తున్న పార్టీలు సంక్షేమం పేరుతో పేదలను బానిసలుగా మార్చుతున్నారని విమర్శించారు. ఏ సంక్షేమ పథకం పేదల బ్రతుకుల్లో శాస్వత మార్పుకోసం ఉపయోగపడిందిలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉన్నపథకాలను అటు ఇటు చేసి అమలు చేయడం కొత్తపేర్లతో ప్రజల్లోకి తీసుకురావడం తప్ప పెద్దగా పేదలకు ఏమాత్రం ఉపయోగం ఉండదు.

(1) పొంగులేటి.. పువ్వాడ అజయ్ ఇద్దరూ కార్పోరేట్ రాజకీయ నాయకులే : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక పక్క పొంగలేటి శ్రీనివాసరెడ్డి, ఇంకో పక్క పువ్వాడ అజయ్ లు అధికార పార్టీ నుంచి ఒకరు, ప్రతిపక్షపార్టీ నుంచి మరొకరూ తమ ఏజెంట్లను గెలిపించుకునేందుకు పోటీ పడుతున్నారు. నిజానికి ఇద్దరూ ఒక్కటే. వారి ప్రయోజనాలు కాపాడుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చినవారే. రాజకీయ అండదండలతో అడ్డూ అదుపు లేకుండా దోపిడీ కొనసాగించుకునేందుకే వారి తాపత్రయం. అక్రమ మార్గంలో వేల కోట్లు సంపాదించి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పటు చేసుకున్నారు. ప్రస్తుతం వారి దోపిడి మూడు పూవులు ఆరు కాయలు కావాలంటే అధికారం అవసరం. అధికారం కోసం జిల్లాలో వేల కోట్లు ఓటర్లకు పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అవినీతి డబ్బుతో అందలం ఎక్కేందుకు, అధికారం చేజిక్కించుకునేందుకు కత్తులు దూసుకుంటున్నారు.పొంగులేటి జిల్లా మొత్తం తన ఏజెంట్లకు టిక్కెట్ల కోసం ఢిల్లీ పెద్దలను, తన సామాజిక వర్గానికే చెందిన రేవంత్ రెడ్డిని కాక పెడుతున్నాడని అన్నారు. తన ఏజెంట్ల ( అభ్యర్థుల)కు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి వందల కోట్ల నజరాన ఆశ చూపుతున్నాడు. ఎంతైనా కార్పోరేట్ రాజకీయనాయకుడు కదా..?. ఏళ్ళ తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జెండాలు మోసి పార్టీకి సేవలు చేసిన వారిని కాదని తన వర్గానికి చెందిన తన మనుషులకే టిక్కెట్లు ఇవ్వాలని పట్టుపడుతున్నాడు. నిజంగా సేవ చేయాలనే తపనున్న అనేక మంది కాంగ్రెస్ ఆశావాహుల ఆశలపై పొంగులేటి కార్పోరేట్ కత్తి వారి జీవితాలను బలితీసుకుంటుంది. ఒక్కో నియోజకవర్గానికి రూ.40 కోట్లు, జిల్లా మొత్తం రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని అధిష్టానానికి ఆశ చూపుతున్నాడు. హామీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో కాంగ్రెస్ పార్టీ పొంగులేటి చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఇప్పటి వరకు ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేసి టికెట్ కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలపై పొంగులేటి మధపుటేనుగు ఆదిపత్యం కొనసాగిస్తున్నది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఇబ్బంది తప్పదు. పొంగులేటి తన అహంకారాన్ని వీడక పోతే ప్రజలు బుద్ధిచెపుతారు.ప్రస్థుత మంత్రి పువ్వాడ అజయ్ సైతం జిల్లా అంతా తన చెప్పుచేతల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. తన వ్యాపార సామ్రాజ్యంలో కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఇచ్చి జిల్లాను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాడు. తాను సైతం జిల్లా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేసేందుకు డబ్బులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆలోచించాల్సింది ప్రజలే :

రెండు పార్టీలు వారి కార్పోరేట్ రాజకీయ నాయకులు జిల్లాలో ఆదిపత్యం కోసం ఎదురుచూస్తున్నవారే. వేల కోట్లు ఖర్చు చేసి ఓట్లను కొనుగోలు చేసేవారే. రెండు పార్టీల్లో ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి గెలిచినా పొంగులేటి ప్రయోజనాలనో, పువ్వాడ ప్రయోజనాలనో కాపాడేందుకే ఉపయోగపడతారే తప్ప పేదల ప్రయోజనాలకోసం పనిచేస్తారనుకోవడం కలే. భూటకపు ఎన్నకల మూలంగా ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలు గమనించాలి. పోరాడి హక్కులు సాధించుకోవాలే తప్ప ఈ ఓట్లతో సీట్లతో ఎలాంటి ఉపయోగం ఉండదు. దొంగ ఓట్ల, దొంగ నోట్ల రాజ్యానికి బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుంది. పేదల రాజ్యన్ని కొట్లాడి సాధించుకునేందుకు పీఎల్జీఏలో భర్తీ కావాలని మావోయిస్టు పార్టీ అగ్రనేత అజాద్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *