ఇందిరమ్మ ఇళ్లతో సహా అన్ని హామీలు నెరవేరుస్తాం..

రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం  ప్రభాకర్‌
అమీర్‌ పేటలో స్వయంగా జీరో కరెంట్‌ బిల్లులు  తీసి ఇచ్చిన మంత్రి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : అధికారంలోకి వొచ్చిన 90 రోజుల్లోనే తాము ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని, ఇందిరమ్మ ఇండ్లతో సహా అన్ని గ్యారెంటీలను నెరవేర్చుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం అమీర్‌ పేట్‌  ధరంకరం రోడ్డులో గృహ జ్యోతి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా మీటర్‌ రీడిరగ్‌ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు. ఆయన వెంట హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురశేట్టి, విద్యుత్‌ శాఖ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా ప్రజలకు ఇప్పటికే 10 లక్షల ఆరోగ్య శ్రీ కవరేజ్‌తో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. హైదరాబాద్‌ జంట నగరాల్లో జీరో బిల్లుకి సంబంధించి అమీర్‌ పేట్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. సుమారు రూ.1000 విలువైన కరెంట్‌ని ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని,  అనవసరమైన విమర్శలు చేయొద్దని హితువు పలికారు. ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్దానాల్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్‌, రూ.500 లకు  గ్యాస్‌ ద్వారా మహిళా సాధికారత వొస్తుందని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *