ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందజేస్తున్న ఆసరా పెన్షన్ కోసం ఆమనగల్లు తంతి తపాలా కార్యాలయంలో వృద్ధులకు నిరీక్షణ తప్పడం లేదు.. సుదూర ప్రాంతాల నుండి పెన్షన్ తీసుకుందామని ఎక్కడికి రాగా నిరీక్షణ తప్పడం లేదన్నారు. దాదాపుగా ఆమనగల్ మున్సిపాలిటీ తో పాటు మంగళపల్లి చింతలపల్లి పలు గ్రామాలకు చెందిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆమనగల్ తంతి తపాలా కార్యాలయం సిబ్బంది ద్వారా అందజేయడం జరుగుతుంది. మంగళవారం సిబ్బంది తమ పని నిమిత్తం వేరే గ్రామానికి వెళ్ళగా ఉదయం 6 గంటల నుంచి పోస్ట్ ఆఫీస్ కు చేరుకున్న వృద్ధులు నిరీక్షించారు. తపాలా కార్యాలయ సిబ్బంది కొంతమందికి పెన్షన్ అందజేసి తదనంతరం పనుల నిమిత్తం వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది రాక కోసం నిరీక్షించారు. విషయం తెలుసుకున్న స్థానిక విలేకరులు తంతి తపాలా కార్యాలయం చేరుకొని విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు పెన్షన్ను నేరుగా పోస్ట్ ఆఫీస్ ద్వారా అందివ్వకుండా తమ తమ అకౌంట్లో జమ చేయాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న వారు పట్టించుకోవడంలేదని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఆరోపించారు. ఇప్పటికైనా తమ బాధలను అర్థం చేసుకొని ఉన్నత అధికారులు తమ బ్యాంకు ఖాతాలో ఆసరా పెన్షన్ డబ్బులను జమ చేయాలని వేడుకుంటున్నారు. ఈ విషయమై ఆమనగల్ పోస్ట్ మాస్టర్ సచిన్ యాదవ్ ను ప్రజాతంత్ర వివరణ కోరగా ఆమనగల్ పోస్ట్ ఆఫీస్ లో సిబ్బంది కొరత కారణంగా తమ పనులను మానేసుకొని పెన్షన్లకు అందజేయడం జరుగుతుందని సెలవు దినాల్లో కూడా పెన్షన్లు అందించామన్నారు. ప్రతినెల ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు


