(08 మార్చి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా…)
సృష్టిలో ఆమె సగం. అతివే సంతానలక్ష్మి. నవ్వులు పంచే త్యాగమయి. ఆర్థికాభివృద్ధిలో ఐశ్వర్యలక్ష్మి. గృహ కోవెలలో కొలువైన దేవత. ఓపికకు ప్రతీక మహిళ.
కుటుంబ సంక్షేమ నిధి అతివ. ఇంటి గడపకు ఆమె పసుపు పారాణి. అమ్మతనం ఆవిడ స్వంతం. మామిడి తోరణాల పచ్చని పందిరే పడతి. మగాడి గుండె
సవ్వడే కాదు మానవత్వ నెలవు. పురుష వృక్షానికి తల్లి వేరు గృహలక్ష్మి. ఎవ్వరికీ పట్టక పోయినా అందరి శ్రేయస్సు కోరే ఆదిశక్తి.
పడతి పట్టుదలతోనే ప్రగతి పరుగిడును. సహనశీల మహిళలు గృహసీమ సంతోష సిరులు.
మహాశక్తి స్వరూపిణి అయిన మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ప్రగతిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా 08 మార్చి రోజున నిర్వహించుకునే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’లో భాగంగా సాహస సఫల ధీరవనితలను సన్మానించుకోవలసిన సరైన వేడుక. అంతర్జాతీయంగా లింగ సమానత్వ సాధన, మహిళల హక్కుల పరిరక్షణ, మహిళల ఆత్మగౌరవ సాధన, విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, స్వేచ్ఛ రెక్కలు తొడగడం, ఆర్థిక స్వావలంభన దిశగా అడుగులు వేయడం, నిర్ణయాధికారాలు అప్పగించడం, భ్రూణ హత్యలను కట్టడి చేయడం, అత్యాచార హత్యలను నిలువరించడం, ప్రతిభావంతులైన మహిళలను గుర్తించి ప్రోత్సహించడం, మహిళా కేంద్రంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాల్సిన వేదికగా 08 మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిలుస్తుంది.

అంతర్జాతీయ మహిళా దినం-2024 నినాదం
‘అంతర్జాతీయ మహిళా దినం-2024 నినాదంగా ‘ఆమెను గణించండి : మహిళాభివృద్ధికి పెట్టుబడి, పురోగతిని వేగవంతం చేయడం (కౌంట్ ఇన్ హర్ : ఇన్వెస్ట్ ఇన్ వుమెన్, అక్సిలరేట్ ప్రోగ్రేస్)’ తీసుకున్నారు. 1975లో ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, తగు పరిస్కార మార్గాలను చర్చించడంతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళామణులను సత్కరించుకోవడం జరుగుతోంది. మహిళాభివృద్ధికి తగు పెట్టుబడులు పెట్టడం, లింగ సమానత్వ సాధనకు పెద్ద పీట వేయడం, మహిళల ఆరోగ్య పరిరక్షణ, మహిళలకు మానవ హక్కుల కల్పన, సమగ్ర సమ్మిళిత అభివృద్ధి సాధనలో మహిళలను భాగస్వామ్యం చేయడం, హరిత మహిళల అభివద్ధి, పేదరిక నిర్మూలనలో అతివలకు ప్రాధాన్యం ఇవ్వడం, స్త్రీవాదానికి ఊతం ఇవ్వడం లాంటి పలు చర్యలు మహిళాభ్యున్నతికి దోహదపడతాయని గమనించాలి.
కూతురు భారం, కొడుకు వంశాంకుర దీపమా..
ప్రపంచాన్ని సవాళు చేస్తూ నవ్య ప్రగతి రథం పరుగిడుతుంది. సవాళ్ళను ఎదుర్కొని నిలబడినపుడే సకారాత్మక మార్పులకు ఆస్కారం ఉంటుంది. అమ్మ, ఆలి, సోదరి, వదిన, బామ్మ లాంటి పాత్ర ఏదైన బేషరతుగా కుటుంబ సంక్షేమానికి అనుక్షణం శ్రమించే నిస్వార్థ ప్రాణి స్త్రీమూర్తి మాత్రమే. అందరికీ అమ్మ కావాలి, ఆలి అనివార్యంగా ఉండాలి, కాని కూతురు వద్దంటోంది నేటి విచిత్ర ప్రపంచం. కూతురు ఓ భారం, కొడుకు ఓ వంశాంకుర దీపం అనే అనాగరిక సమాజంలో మనం ఉన్నాం. భ్రూణ హత్యలు, లైంగిక వేధింపులు, అత్యాచార హత్యలు, గృహ హింసలు, బాల్యవివాహాలు లాంటి పలు దురాచారాలను ఎదుర్కొంటున్న మహిళలు మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది. ప్రాంతం, దేశం, మతం, కులం, వర్గం, వర్ణం, జాతి, సంప్రదాయం, ఆర్థిక స్థితి, సంస్కృతులను బట్టి మహిళా వివక్ష తీవ్రత మారుతూ వస్తున్నది. విద్య లేకపోయినా సంస్కారిగా అబల చిన్నచూపును భరిస్తూ లింగ వివక్ష వలలో చిక్కుకుపోయిన శ్రమ జీవి ఆమె. లింగ వివక్ష రాజ్యమేలినంత కాలం మహిళా సమాజం సమస్యల నడుమ నలుగుట ఖాయంగా తోస్తున్నది. మహిళలు ప్రవేశించని రంగం లేదు, సృజించిని అంశం లేదు. అంతరిక్షంలో విహరించడం, సాగర సరిహద్దుల్లో గస్తీలు తిరగడం, అంతరిక్ష రహస్యాల శోధనలు చేయడం, యుద్ధ క్షేత్రంలో ధీర వనిత, యుద్ధ విమానాలకు దిశ నిర్థేషనం చేయడం, అంతర్జాలాన్ని అన్వేషించడం లాంటి విధులను సమర్థవంతంగా నిర్వహించడం ఎరిగిన తెలివిగల మేధావి మహిళ. కొడుకుతో సమానంగా కూతురిని పెంచడం, ఇరువురికీ ఉన్నత విద్యను అందించాల్సిన కనీస బాధ్యత తల్లితండ్రులు మీద ఉంది.
సమస్యల వలయంలో భారత మహిళ
భారతదేశంలో అధిక జనాభా, పేదరికం, నిరక్షరాస్యత, పోషకాహారలోపం, అసమానతలు లాంటి తీవ్ర సమస్యల నేపథ్యంలో మహిళలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంట్లో మహిళలకు స్వేచ్ఛ, స్వతంత్రం ఉండదు. తల్లితండ్రులు నవజాత శిశు స్థాయి నుంచే అమ్మాయిల పెంపకంలో వివక్షను చూపుతూ, విద్యకు, స్వేచ్ఛకు దూరం చేయడం నమ్మలేని నిజాలు. బాల్యవివాహాల వలలో చిక్కి చిరు ప్రాయంలోనే అమ్మాయిలు తల్లులు కావడం, అనారోగ్యాల పాలు కావడం సర్వసాధారణం అయ్యింది. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు తరుచుగా జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో ఆసిడ్ దాడులు, గృహ హింస, ఆర్థిక అసమానత, వరకట్న వేదింపులు/చావులు, గర్భంలో ఆడ పిల్ల ఉందని అని తెలిసి అబార్షన్‌లు (భ్రూణ హత్యలు), బలవంతపు వ్యభిచార వృత్తి లాంటి పలు సమస్యలను భారతీయ మహిళా సమాజం ఎదుర్కొంటున్నది. సమాజంలో సగమైన మహిళలు భారత పార్లమెంట్‌లో 14.5 శాతం మాత్రమే ఉన్నారు. ప్రపంచదేశాల లింగ అసమాన సూచిక-2023 ప్రకారం 140 దేశాల్లో ఇండియా 135వ స్థానంలో ఉన్నది. మహిళల్లో సెకండరీ విద్య పూర్తి చేసిన మహిళలు 39 శాతం (పురుషులు 63.5 శాతం) ఉన్నారు. శ్రామిక లోకంలో 27.2 శాతం మహిళలు (78.8 శాతం పురుషులు) నమోదు అయ్యారు.
భారత సమాజంలో అష్టలక్ష్ములను దేవతలుగా కొలిచిన సనాతన సంస్కృతి మనది. చదువుల తల్లి సరస్వతి, సంపద ప్రదాత లక్ష్మి, ధైర్యానికి ప్రతీక దుర్గలను మహాశక్తి రూపాలుగా పూజించడం మన నరనరాల్లో జీర్ణించుకు పోవాలి. మహిళా మహాశక్తులను కొలుచుకోవడం ఒక వైపు, స్త్రీలను అశ్లీల వస్తువుగా చూసే మృగాళ్ళు మరో వైపు సమాజంలో తిష్ట వేసి ఉన్నారు. మహిళలో దేవతను దర్శించి, లింగ సమానత్వాన్ని స్వచ్ఛంధంగా సాధించే ప్రయత్నంలో మనందరం భాగస్వాములు అవుదాం, ఆమెకు అమితానందాలను అందిద్దాం.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





