లింగోద్భవం, శూన్యం నుంచి విభూతి, కుంకుమ సృష్టించడం వంటి వీధి గారడీవాళ్లు ప్రదర్శించే కనికట్టు విద్యలను ప్రదర్శించి చూపి వాటిని ఆధ్యాత్మిక శక్తులుగా చలామణీ చేయడం దగాతో, మోసంతో సమానమని అందువల్ల అతను నేరస్తుడని న్యాయమూర్తి అన్నారు. అతనికి సహచరులుగా ఉండిన ముగ్గురికి కూడా యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు.
ప్రేమానంద కేసులో జిల్లా సెషన్స్ జడ్జి న్యాయస్థానంలో ఈ కేసు వచ్చినప్పుడే ప్రేమానంద తరఫున వాదించడానికి రామ్ జెత్మలానీని ఏర్పాటు చేసుకున్నారు. అంటే అప్పటికే ప్రాసిక్యూషన్‌కు లంచం పెట్టి కేసును మాఫీ చేసుకోవడం, తప్పుడు వాదనలు పెట్టేలా చూసుకోవడం కుదరని స్థితి వచ్చిందన్నమాట. అసలు రామ్ జెత్మలానీలాంటి సుప్రసిద్ధ న్యాయవాదిని పెట్టుకోవడం ఎందుకు జరుగుతుందంటే, అప్పుడు చిన్న స్థాయి న్యాయమూర్తిని బెదరగొట్టవచ్చు. అటువంటి చిన్న న్యాయస్థానాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఉండే పరపతిని దెబ్బతీయవచ్చు.
ప్రేమానంద కేసు సెషన్స్ కోర్టులో విచారణ సాగుతుండగానే ఆ వ్యవహారం మీద హైకోర్టుకు అప్పీళ్లు వచ్చాయి . ఆ అప్పీళ్ల ద్వారా కింది కోర్టు విచారణను ఆలస్యం చేయడానికి ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో న్యాయవాదులు సుధా రామలింగం, నాగశైల నాకు ఆ విషయం చెప్పి నన్ను ‘‘హైకోర్టులో వాదించగలవా’’ అని అడిగారు. అవతలివైపు, ప్రేమానంద తరఫున, రామ్ జత్మలానీ వంటి సుప్రసిద్ధ న్యాయవాది వాదిస్తున్నాడు గనుక, ప్రత్యర్థి వాదనలు వినిపించడానికి నాకు వీలవుతుందా అని వాళ్లు అడిగారు.
సాధారణంగానే క్రిమినల్ కేసులలో డిఫెన్స్ న్యాయవాది ఎద్దులాగ అవతలి వాదనలను కుమ్మేయవలసి ఉంటుంది. తుత్తునియలు చేయవలసి ఉంటుంది. సాక్ష్యాలను చీల్చి చెండాడవలసి వుంటుంది. రామ్ జెత్మలానీ అటువంటి పనులలో సిద్ధహస్తుడు. ఆయన వాదనలు వింటుంటేనే మతి పోతుంది. ఇక అప్పటికి బాధితుల తరఫున నాగశైల వాదిస్తుండింది . ఆమెకు వయసూ చిన్నదే. వృత్తిలో అనుభవమూ తక్కువే. కాని ఆమె చాలా సమర్థురాలు. తన వాదనలను స్పష్టంగా వినిపిస్తుండేది. మామూలుగా ఇటువంటి అసమాన స్థితిలో ఉన్న న్యాయవాదులు జరిపే వాదప్రతివాదనలలో కొందరు న్యాయమూర్తులు జూనియర్ న్యాయవాదుల పట్ల కాస్త ఔదార్యంతో ప్రవర్తిస్తారు. రక్షిస్తూ ఉంటారు. ఈ సంగతి తెలుసు గనుక నేను ఆ వాదనలకు రానక్కరలేదని చెబుతూ ఆ ఇద్దరికీ ఎటువంటి వాదనలు పెట్టాలో వివరంగా సూచనలు ఇచ్చాను. చివరికి వాళ్ల వాదనలే నెగ్గాయి . ఆ భగవదవతారం అని చెప్పుకున్న వాడికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.
ఇక ఆ తీర్పును పునఃపరిశీలించాలని హైకోర్టులో చేసుకున్న అప్పీలు మరొక సంగతి. క్రిమినల్ అప్పీలు అంటే వాస్తవాల మీద పునర్విచారణ అన్నమాట. విచారణ జరిపిన న్యాయమూర్తి చాలా సాహసంతో ఆ ఆధ్యాత్మిక గురువు బండారాన్ని బట్టబయలు చేసినప్పుడు, ఆ భగవదవతారానికి కఠినమైన శిక్షలు విధించినప్పుడు ఇక హైకోర్టులో అప్పీలుకు మరింత ప్రాధాన్యత వస్తుంది. అసలు కింది కోర్టు విధించిన శిక్షలు చూడండి. దేశ దేశాలలో భక్తకోటి ఉన్న, ముఖ్యంగా గణనీయమైన సంఖ్యలో విదేశీ భక్తులు ఉన్న స్వామి ప్రేమానందకు న్యాయమూర్తి రెండు యావజ్జీవ కారాగార వాస శిక్షలు విధించారు. అవి రెండూ ఒకదాని తర్వాత ఒకటి అమలు కావాలని తీర్పు చెప్పారు. ఆ శిక్షలతోపాటు అరవై ఆరు లక్షల రూపాయల జరిమానా విధించారు. ఆ జరిమానా చెల్లించకలేకపోతే 32 సంవత్సరాలపాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పు చెప్పారు. లింగోద్భవం, శూన్యం నుంచి విభూతి, కుంకుమ సృష్టించడం వంటి వీధి గారడీవాళ్లు ప్రదర్శించే కనికట్టు విద్యలను ప్రదర్శించి చూపి వాటిని ఆధ్యాత్మిక శక్తులుగా చలామణీ చేయడం దగాతో, మోసంతో సమానమని అందువల్ల అతను నేరస్తుడని న్యాయమూర్తి అన్నారు. అతనికి సహచరులుగా ఉండిన ముగ్గురికి కూడా యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు.
ఇంత తీవ్రమైన శిక్షలను అది వరకు ఏ న్యాయస్థానమూ విధించి ఉండలేదు. ఆ నేర నిర్దారణలకూ, శిక్షలనూ ధ్రువీకరింపచేయడానికి చాలా కృషి అవసరమవుతుంది. అందువల్ల చెన్నైలోని మహిళా సమాఖ్య నాయకులు, పియుసిఎల్ న్యాయవాదులు బాధితుల తరఫున నన్ను వాదించమని కోరారు. అటువంటి వాదనలు వినిపించడమంటే హైదరాబాద్ వదిలి చెన్నైలో చాలా కాలం మకాం పెట్టవలసి ఉంటుంది గదా అని నేను మొదట సందేహించాను. కాని హైకోర్టుకు వచ్చేసరికి యు ఆర్ లలిత్ అనే రాష్ట్రీయ స్వయం సేవకసంఘ్ కు చెందిన న్యాయవాది ప్రేమానంద తరఫున వాదించడం మొదలు పెట్టారు. ఆయన ఒకప్పుడు ఢల్లీిలో పియుసిఎల్‌లో ఉండేవాడు. ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వాతావరణం చెదిరిపోయేవరకూ ఆయన పియుసిఎల్‌లో ఉన్నాడు. నాకు ఆయన వ్యక్తిగతంగా పరిచితుడే. ఆయన ఆ తర్వాత కాలంలో టాడా కేసులను సమర్థిస్తూ కూడా వాదనలు వినిపించాడు. ఆయన చాలా సమర్థుడైన, ప్రతిభావంతుడైన న్యాయవాది. ఆయన ప్రేమానంద తరఫున ఒక నెల రోజులపాటు వాదనలు వినిపించాడు.
క్రిమినల్ కేసులలో కింది కోర్టు, సెషన్స్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, ఆ తీర్పును ధ్రువీకరించడానికి హైకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు సాధారణంగా బాధితుల తరఫున వాదనలు వినిపించే అవకాశం లేదు. అక్కడ బాధితుల తరఫున జోక్యం ఉండదు. కాని ఆ సాధారణ సూత్రానికి కొన్నిసార్లు మినహాయింపులు కూడా ఉంటాయి . అందువల్ల ఒక వేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరైన పద్ధతిలో వాదనలు పెట్టకపోతే నావైపు నుంచి వాదనలు వినిపించడానికి నేను సిద్ధమైపోయాను. నేను వాదించడానికి అంగీకరించాలా లేదా అనేది న్యాయమూర్తుల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. యు ఆర్ లలిత్ తన వాదనలను మూడు వాయిదాలలో వినిపించాడు. గనుక నాకు కూడా పని సులువైంది. నేను హైదరాబాద్‌కూ మద్రాసుకూ మధ్య తిరుగుతూ ఆ వాదనలను వినగలిగాను.
నేను అక్కడ కూర్చొని డిఫెన్స్ న్యాయవాది వాదనలు వింటూ ఉండడం, అప్పటికే న్యాయవాదిగా నా పేరు ప్రఖ్యాతులు తెలిసి ఉండడంవల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇది చాలా తీవ్రంగా ఘర్షణ సాగే కేసు అని అర్థమైపోయింది. తన వంతు వచ్చినప్పుడు ప్రాసిక్యూటర్ కూడా పది పదిహేను రోజులపాటు చాలా సమర్థంగా వాదనలు వినిపించాడు. ఆయన ఆ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్నీ కూలంకషంగా చర్చించాడు. దానితో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టిన అద్భుతమైన వాదనలకు అదనంగా నేను చేర్చవలసినదేమీ లేదని న్యాయస్థానానికి చెప్పాను.
ఆ కేసు జస్టిస్ షణ్ముగన్, జస్టిస్ చొక్క లింగంల ధర్మాసనం ముందు జరిగింది. ఆ ఇద్దరు న్యాయమూర్తులూ న్యాయవాదిని ఎప్పుడూ తొందరపెట్టలేదు. వాదనలన్నిటినీ జాగ్రత్తగా విన్నారు. దుష్టులనూ దుర్మార్గులనూ సమర్థిస్తూ వాదనలు వినిపించడం చాలా కష్టం. కాని యు ఆర్ లలిత్ చాలా మంచి వాదనలు వినిపించాడు. సాక్ష్యాధారాలు సరిగా ఉన్న ఇబ్బందికరమైన విషయాలను జాగ్రత్తగా దాటవేశాడు.
ఆ కేసు ఎటువంటి ముందస్తు దురభిప్రాయాలు లేని ధర్మాసనం ముందుకు వచ్చినందుకు మేం చాలా సంతోషించాం. నిజానికి ఒక న్యాయమూర్తుల ధర్మాసనాన్ని నిర్ణయించుకోవడం ఒక బ్రహ్మ ప్రయత్నం అవుతుంది. మొట్టమొదట ఈ కేసు ఒక ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు సీనియర్ న్యాయమూర్తి. ఆయనకు ఏమంత మంచి పేరు లేదు. మరొకరు జూనియర్ న్యాయవూర్తి. ఆయన ప్రేమానంద భక్తుడని లోకానికంతా తెలుసు.




