- భారీగా పోటెత్తిన రేసింగ్ అభిమానులు
- వాహన పార్కింగ్ లేకపోవడంతో ఆందోళన
- సచిన్ టెండుల్కర్ రాక…క్రికెటర్లు, సినిమా సెలబ్రిటీలు కూడా చేరిక
- ఆనందంగా ఈ కార్ రేసింగ్ పోటీలు..అసౌకర్యాలు ఉన్నమాట నిజమే : హాజరైన మంత్రి కెటిఆర్
- ఈ కార్ రేసింగ్‌తో బ్రాండింగ్ పెరుగుతుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శనివారం గంట 25 నిమిషాల పాటు ఈ రేసు జరగనుంది. దీనిని చూసేందుక పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. ఇక విదేశీ సందర్శకులు సైతం పోటెత్తారు. ఏకంగా 7వేల మంది ఫార్ములా ఈ క్వాలిఫైయింగ్ రేస్ చూసేందుకు వొచ్చారు. ఇక క్రికెట్ దిగ్గజం..సచిన్ టెండూల్కర్ సైతం ఈ రేస్‌ను చూడటానికి రావడం విశేషం. సినీ ప్రముఖులు కూడా పలువురు ఇక్కడకు వొచ్చారు. హుస్సేన్‌సాగర్ తీరంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. గంటకు 300 కిలోవి•టర్ల మెరుపు వేగంతో దూసుకుపోయే ఫార్ములా ఈ కార్ల విన్యాసం చూసేందుకు హైదరాబాద్ నగర వాసులు పెద్ద ఎత్తున రేసింగ్ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. మొత్తం 22 మంది రేసర్లు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈవెంట్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఫార్ములా ఈ ప్రాక్టిసింగ్ రేస్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్ రేస్ ప్రారంభం అయ్యింది.
ఈ రేస్ కారణంగా ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, తెలుగుతల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు విధించారు. రేసింగ్ చూసేందుకు 21 వేల మందికి సీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ రేసింగ్‌ను చూడటానికి వొచ్చిన అభిమానులకు వెహికిల్ పార్కింగ్‌కు స్థలం కేటాయించక పోవడంతో వొచ్చిన వారు తీవ్రనిరాశకు గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా ఈ రేసింగ్ చూసేందుకు వొచ్చిన అభిమానులకు వెహికిల్ పార్కింగ్ తలనొప్పిగా మారింది. ఈ రేసింగ్ నిర్వహణలో గందరగోళం నెలకొంది. టికెట్ కొనుగోలు చేసినా వెహికిల్ పాస్ కావాలంటూ ఖైరతాబాద్ ఫంలైల ఓవర్ వద్ద ప్రేక్షకులను పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో టికెట్లు కొన్న రేసింగ్ అభిమానులు అయోమయంలో పడ్డారు. మరోవైపు కార్ పార్కింగ్‌కు నిర్వహకులు స్థలం కేటాయించక పోవడంతో సమస్యలు తలెత్తాయి. తమ వెహికిల్స్‌ను ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో అభిమానులు సతమతమయ్యారు. టికెట్ల కొనుగోలు సమయంలో ఈవెంట్ నిర్వాహకులు వెహికిల్ పాస్ ఇవ్వకపోవడంతో… టికెట్లు కొన్నవారికి పోలీసులతో పార్కింగ్ చిక్కులు ఏర్పడ్డాయి.
ఈ కార్ రేసింగ్ కోసం సచిన్ రాక…క్రికెటర్లు, సినిమా సెటబ్రిటీలు కూడా చేరిక
దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్‌లో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఈ-రేసింగ్ వీక్షించేందుకు సచిన్ నగరానికి వొచ్చారు. ఉదయం 10.40 గంటలకు నిర్వహించిన క్వాలిఫయింగ్ రేసును ప్రత్యక్షంగా తిలకించారు. సచిన్‌తోపాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, సినీనటుడు మహేశ్ బాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్ కూడా రేస్ చూసేందుకు తరలివచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నారా బ్రాహ్మణి కూడా హుస్సేన్ సాగర్ తీరానికి వొచ్చారు. కార్ రేసింగ్‌ను వీక్షించేందుకు సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు తరలిరావడంతో అభిమానుల్లో జోష్ కనిపిస్తున్నది. పలువురు సెలబ్రిటీలు, వారి పిల్లలు భారీగా తరలివస్తున్నారు.
హీరో రామ్ చరణ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తనయుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తదిరుల రాకతో పాటు హుస్సేన్ సాగర్ ప్రాంతం అభిమానులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్ హైదరాబాద్‌లో ఈ కార్ల రేస్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తానెప్పుడు ఇలాంటి రేసింగ్‌లకు బయటకు వెళ్లలేద న్నారు. 18 మలుపులతో ఉన్న హైదరాబాద్ స్ట్రీ సర్క్యూట్‌లో 32 ల్యాప్స్ జరుగుతాయి. 45 నిమిషాల తర్వాత విన్నర్‌ను తేల్చేందుకు మరో ల్యాప్ నిర్వహిస్తారు. తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన వారు రౌండ్ 4 విన్నర్ అవుతాడు. అతనికి 25 పాయింట్లు దక్కుతాయి. తొలి పది స్థానాల్లో నిలిచిన వారికే పాయింట్లు లభిస్తాయి.
ఆనందంగా ఈ కార్ రేసింగ్ పోటీలు..అసౌకర్యాలు ఉన్నమాట నిజమే : మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఉత్సాహంగా ప్రారంభమైన ఈ రేసింగ్ క్వాలిఫైంగ్ రౌండ్ కు హాజరైన మంత్రి కేటీఆర్.. నెక్లెస్ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడటానికి ఎంతో బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఉన్న యువత, క్రీడాభిమానులు ఈ రేస్ ను చూసేందుకు తరలివస్తున్నారని చెప్పారు. ఈ ఈవెంట్స్ లో కొంత అసౌకర్యం కలుగుతుందన్నమాట నిజమేనన్న కేటీఆర్.. కానీ అది మన్నించి సహకరి స్తున్నందుకు నగరవాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇంటువంటి కార్యక్రమాలతో హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, ఈ కార్యక్రమం సవ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఈ కార్ రేసింగ్‌తో బ్రాండింగ్ పెరుగుతుంది : కిషన్ రెడ్డి
ఈవీ వెహికల్స్ ఉత్పత్తి పెంచేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కు హాజరైన కిషన్ రెడ్డి…ఈ రకమైన కార్యక్రమాల ద్వారా దేశ బ్రాండింగ్ టూరిజం పెరుగుతుందని చెప్పారు. ప్రపంచంలోనే అనేక దేశాలు గ్రీన్ ఎనర్జీకి షిప్ట్ అవుతున్నాయని వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రజలను మోటివేట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఎలక్టిక్రల్ వెహికల్స్ వినియోగం భారీగా పెరుగుతుందని.. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతాయని ఆయన తెలిపారు.




