హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత

  • ప్రజలకు న్యాయ సేవలు చేరువయ్యేలా మార్పులు అవసరం
  • తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి సుప్రీమ్‌ కోర్టు సిజే జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ శంఖుస్థాపన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : కింది కోర్టులతో పాటు హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందని సుప్రీమ్‌ కోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ అన్నారు. తెలంగాణలో కొత్త హైకోర్టు భవనం కోసం చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సిజెలను ఆయన అభినందించారు.   బుధవారం రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన సముదాయానికి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సుప్రీమ్‌ కోర్టు సిజే మాట్లాడుతూ..నూతన హైకోర్టు భవనానికి శంఖుస్థాపన చేయడం తనకు సంతోషం కలిగించందన్నారు. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని ఆకాంక్షించారు.

బ్రిటిష్‌ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, కాల క్రమేణా మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. అదే క్రమంలో యువత వేగంగా మార్పులు రావాలని కోరుకుంటుందని అన్నారు. నూతన భవనంలో మహిళలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు ప్రత్యేక సౌకర్యాలుండాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. న్యాయవ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలన్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవాలని, ఇటీవల ఈ-కోర్టు పథకంలో భాగంగా ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నర్సింహా, జస్టిస్‌ పివి సంజయ్‌ కుమార్‌, హైకోర్టు సిజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, పలువురు న్యాయమూర్తులు, న్యావా దులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *