హైదరాబాద్, డిసెంబర్ 28(ఆర్ఎన్ఎ) : ఫామ్ హౌస్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం..ఆ లోగా ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఈడీ, రోహిత్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మంగళవారం విచారణకు రావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినా ఆయన గైర్హాజరయ్యారని ఈడీ కోర్టుకు తెలిపింది.
దీంతో ఈ నెల 30న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపినట్లు ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు. రోహిత్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన లాయర్ తన క్లయింటు రెండుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారని న్యాయమూర్తికి చెప్పింది. సమన్లలో ఈడీ అడిగిన అన్ని వివరాలు సమర్పించినట్లు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈడీకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది.



