దండిగా మానవత్వపు మూలాలున్న కవిత్వం అనేక సంచారాల్లో కూడా విలక్షణ అన్వేషణల వీక్షణమవుతుంది. ఆరంభమైన నడకని గమ్యానికి చేర్చే దిక్సూచి లాంటిది కవిత్వపు బాధ్యత. కవి కవిత్వం రాయటానికి సమాయాత్తం కావటమంటే అగ్ని పూసిన అక్షరాలను, కాగి మాగిన అనుభవాలను దోసిట్లో పట్టుకోవడమే. శిథిలాలను, భయోద్విగ్నాలను కూడా పదిలంగా కవిత్వంలోకి ఒంపే ధీరతను కవి పుణికి పుచ్చుకుంటాడు. అందుకే కవి కవిత్వం పంజావిప్పిన పెద్దపులిలా గర్జించడమే కాదు, మానవతా కాసారాన్ని హృదయగతమూ చేస్తుంది. సంక్లిష్ట సౌందర్యాలే కాదు, బీభత్స విరాట్ దృశ్యాలను సైతం ఆవిష్కరిస్తూ ప్రముఖకవి, సాహితీవేత్త డాక్టర్ టి శ్రీరంగస్వామి డిశంబర్ 11 పేరిట సృజన/ అనుసృజన కవిత్వాన్ని సంపుటిగా వెలువరించారు. శ్రీలేఖ సాహితి ప్రచురణగా వెలువడిన ఈ సంపుటిని తమ కూతురు దీపికకు తండ్రిగా శ్రీరంగస్వామి పుట్టినరోజు కానుకగా అందించారు.
మన నడక మన చేతిలో లేదు/ మన విన్యాసం మనది కాదు అని పరావర్తనం కవితలో చెప్పారు. మనిషి జీవన విధానాన్ని అక్షరీకరిస్తూ ఈ బతుకు సరసితం కాదు / మన జీవితం మనది కాదు/ కేవలం పరావర్తనం అని ముక్తాయింపును ఇచ్చారు. మనిషి జీవితంలోని ఎన్నో విచిత్రాలను అవలోకిస్తూ వలస పయనం కవిత వాస్తవాలను కళ్ల ముందుంచింది. వలసపోతున్న ఒక అనామకుడైన మానవుడి పొట్టకూటి వేదన, అందరికందరూ దూరమైతే కలిగే పేగుబంధపు సంవేదనను తడితనపు తపనతో అక్షరమయం చేశారు.
హృదయం ఉప్పొంగి చేతనత్వమైతే మధురత మనసు నిండా పరచుకొని ఇంద్ర ధనుస్సవుతుందంటారు. గాయాల వలయాల మధ్య తెల్వని పోరులో మనిషి బ్రతుకే తెల్లారుతుందని ఖేదపడ్డారు. తిమ్మాపురం బాల్యం తీపి గుర్తుల్ని తలచుకొని అప్పటి సెలయేరు పాయల్ని స్పృశించి తన్మయత్వాన్ని పొందారు. మదిల పొదిళ్ళలో జ్ఞాపకాల రగళ్ళను నీలి నీడల బారిన పడకుండా అపురూప బాల్యానికి అదృశ్య హస్తాలను రక్షణగా చేశారు. జీవన వైవిధ్యాన్ని చెరువాత్మతో అనుసంధానించి ఒక్కసారి గత వైభవాన్ని గమనించి వర్తమానాన్ని సమీక్షించారు. కోటిరతనాల వీణ తెలంగాణలో నేటి స్థితిని ఇమాందారే సియాసత్ కవిత స్పష్టంగా ప్రతిబింబించింది. ఆకాంక్షల ప్రదర్శనా వేదికగా బాలోత్సవ్‌ను చూపారు. నవ తెలంగాణ జీవనం తెలివిడిగా భవిత వైపు నడవాలని ఆకాంక్షించారు.
మృణ్మయమైనా హిరణ్యం అవుతుంది/ మట్టిపనికైనా మనింటి వాడుంటే అని శీతల పవనం కవితలో అన్నారు. సరస్వతిపై రాసిన ముక్తకంలో అక్షర కటాక్షాన్ని ఆశించారు. కనబడ్డ చోటే అన్న కవితలో భారత సౌహృద జీవనాన్ని మలినం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రక్షాబంధన్‌ను హృదయబంధంతో పోల్చారు. నా గొడవను కోట్ల మెదళ్ల కదిలికకు పునాదిగా భావించారు. కాకతీయ కేతనాన్ని బహుముఖంగా రెపరెపలాడించి ఓరుగల్లు గరిమను చాటారు.
తెలంగాణ జీవనానికి మూలాలను కెంపుల సింగడి ఆర్ణవం కవితలో ప్రస్తావించారు. ఈ నేలలో ప్రతి శ్వాస జీవామృతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ జీవనమంతా ఆకుపచ్చని ఆర్ణవంతో మేలిమి పచ్చని దుపట్టా కొరకై హరితహారం తెలంగాణ తల్లి కంఠహారమైందన్నారు. ముదిమి దుశ్శాలువ ఒడిలో వెండికొండై మెరుస్తున్నదని తెలిపారు. జీవన వింగడింపు కవిత ముదసలి తనాన్ని పరిమళ భరితం చేసి చూపింది. మాయా మోహంలో మనిషి పదితలల వాడై పరిమితిని కోల్పోతున్నాడని దారిదీపం కవితలో చెప్పారు. ప్రతిక్షణం గుండెకోతకు గురవుతున్నా జీవనం ఆగదు కదా అని నేను ఎప్పటికీ ఆశాజీవినేనని చెప్పుకున్నారు. బాలల వికాసమే నవ్య సమాజానికి గొప్ప పునాది అని నవనీతం కవితలో వెల్లడించారు. నాకు అవకాశం వచ్చినప్పుడు జ్ఞాపకాల సెగల నుండి నిత్య స్నానితుడనవుతానని చెప్పారు.
జీవితమంతా వ్యధాభరితమే కనుక సమన్వయించుకోమని కవి శ్రేష్టుడా అన్న కవితలో తెలిపారు. నవ భావనాలతకు పందిరి గుంజవోలే నిలుస్తానని నిత్యనూతన చేతనను అందించారు. మది పులకించిన క్షణాన సాంధ్య రాగాన్ని వినిపించారు. జీవితం చిన్నదంటూ ముక్తకాన్ని అందించారు. అంతరంగ మథనం జీవన వికాసానికి సుగమ సోపానమవుతుందని చెప్పారు. జీవనయానం ప్రతి ఒక్కరి గుండెలో ఒదిగి ప్రవర్తనా నియమావళిని నేర్పుతుందన్నారు. జీవనమంతా ఎగుడు దిగుడుల పరిమళ సోయగమనుకుంటానని తృప్తి పడ్డారు.
నులివెచ్చని ఆకుల ఆత్మ ప్రబోధాన్ని ప్రార్థనామయం చేశారు. అలలు అలలుగా హృదిని చుట్టుకున్న ఆత్మీయ భావాలకు అక్షరాలా ప్రాణం పోశారు. గడ్డి మైదానాన్ని నూత్న కాంతులు వెదజల్లే వధువుతో పోల్చారు. నాన్నతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాలమే మనసును చక్కబరుస్తుందని కోల్పోతున్న భావనకు సర్దిచెప్పారు. గుజరాత్ గాయాన్ని ప్రస్తావిస్తూ సకల కల్మషాలను సజీవ సమాధి చేద్ధామని పిలుపునిచ్చారు. స్పర్శించి చైతన్యకాంతిని అద్దుతానని కోటి సాహిత్యాల వెలుగులో తెలంగాణ అమేయ ప్రతిభను దర్శించారు. జ్ఞాపకాల సెగల రొదల మాటున కవిత్వాన్ని ఒక సుందర స్వప్న భూమికగా, జీవన వాహినిగా మలుచుకున్నారు. హృదయ భాషగా కవిత్వాన్ని అర్థవంతంగా, రసవంతంగా నిర్వచించారు. జీవజల చైతన్యంతో జన చైతన్య వేదికగా కవిత్వాన్ని కవి అభివర్ణించారు. ఎన్నో కవితలు అనుభవాల బరువును విప్పాయి. సంధించే ఎన్నో ప్రశ్నలకు తన సమాధానాన్ని అందించే బృహత్తర ప్రయత్నం ఇందులో జరిగింది. ఎంతో ఆలోచనాత్మకంగా, విభిన్న అంశాలతో సమకూర్చిన ఈ సంకలనంలోని కవితలు భవిష్యత్తును అద్వితీయంగా మలిచే దీపికలుగా వెలుగుతాయి.
– డా.తిరునగరి శ్రీనివాస్
8466053933




