తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 6: బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తాండూరు నియోజకవర్గం లోని పెద్దేముల్ మండల పరిధిలోని బండపల్లి, అడికిచర్ల, బాయిమీది తండా, రుద్రారం లతోపాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరోగ్యారెంటీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రజా సంక్షేమ పథకాలను ఎన్నికల సమయంలో హడావిడిగా ప్రారంభించి వాటిని ప్రజలకు అందించలేదన్నారు. దళిత బంధు, మైనారిటీ బందు, బీసీ బందుల పేరుతో ఎన్నికల స్టంటుకు తెరలేపి తన అనుచరులకే ఆ పథకాలన్నీ చేరేలా చేసిందని ఆరోపించారు. నిజమైన పేదవారికి ఎలాంటి సంక్షేమ పథకాలను అందించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు అనుగుణంగా ఉన్న కాంగ్రెస్ మేనిఫెస్టోతో ఇందిరమ్మ రాజ్యం తిరిగి రానున్నట్లు ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన రోహిత్ రెడ్డి అభివృద్ధి పేరుతో పార్టీ మారి తాండూరు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. తన అభివృద్ధి మాత్రమే చూసుకున్నారని అన్నారు. పాత అభివృద్ధి పనులకు కేటాయించబడిన నిధులతోనే అనేక నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.
హామీలు అమలు చేయడంలో భీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం





