భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) దిల్లీ కి చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని (బిఆర్ఎస్)గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతివ్వడంతో ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో బిఆర్ఎస్ ఆవిర్భావ సంబరం జరిగింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ను విస్తరిస్తామని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నట్లుగా ముందుగా దేశ రాజధాని దిల్లీ లో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగానే చెప్పినట్లు ఈ నెల 14న దిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బిఆర్ఎస్ తాత్కాలిక జాతీయ కార్యాలయ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.. మరో రెండు నెలల్లో పార్టీ సొంత కార్యాలయం అన్ని హంగులతో పూర్తి చేసుకోనుంది. పార్టీకి నూతన నామకరణ చేయడం ఒకటైతే, జాతీయ స్థాయి పార్టీగా ఆవిర్భవిస్తున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని పెద్ద యాగమే చేయాలని కెసిఆర్ సంకల్పించారు.
ఈ కార్యక్రమాన్ని మూడు రోజులపాటు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాజశ్యామల యాగం, నవ చండీయాగం అనంతరం పూర్ణాహుతి ఉంటుంది. దేశరాజధానిలో మొదటిసారిగా అత్యంత వైభవంగా జరుప తలపెట్టిన ఈ యాగాన్ని శృంగేరీ పీఠానికి చెందిని రుత్వికులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతీయ, జాతీయ పార్టీల అధినేతలను, నాయకులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తున్నది. అంతకు ముందుగానే దిల్లీ లో ఉన్న వివిధ పార్టీల నేతలను ఆయన కలుసుకుని చర్చించే అవకాశాలుకూడా ఉన్నాయి. ఒక పక్క ఏర్పాట్లను పర్యవేక్షణ, మరో పక్క ఆయా పార్టీల నాయకులతో సంప్రదింపులు జరిపేందుకు కెసిఆర్ కుటుంబ సమేతంగా ముందుగానే దిల్లీ ప్రయాణమయ్యారు. ఒక వైపు లిక్కర్ స్కామ్‌లో కూతురు కవిత పేరు రావడంతో ఆమెను ఏడు గంటల పాటు సిబిఐ అధికారులు విచారించిన ఆనంతరం, తిరిగి హాజరు కావాలని మరో నోటీసు పంపిన నేపథ్యంలో కెసిఆర్ నాలుగు రోజుల దిల్లీ పర్యటన పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో జాతీయ స్థాయిలో అరంగెట్రం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు గల కారణాలను ఈ సందర్భంగా దేశ ప్రజలకు కెసిఆర్ జాతీయ మీడియా ముఖంగా వివరించబోతున్నారన్నది ఆ పార్టీ వర్గాల ద్వారా తెలస్తున్నది. అలాగే పార్టీ జాతీయ కార్యవర్గాన్నికూడా ప్రకటించే అవకాశాలున్నా యంటున్నారు. ఇదిలా ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి, అందుకు తీసుకోవాల్సిన నూతన ఆర్థిక విధానం, వ్యవసాయ రంగం, రైతాంగ సమస్యలు, విద్యుత్, మహిళా సాధికారత తదితర విషయాలపై చేపట్టాల్సిన జాతీయ విధానం, అందుకు తమ పార్టీ చేపట్టనున్న ప్రణాళిక తదితర అంశాలపై కెసిఆర్ సుదీర్ఘంగా దేశ ప్రజలకు •వివరించే అవకాశాలున్నాయి.
టిఆర్ఎస్ పార్టీ పేరు మార్పు జరిగిన వెంటనే వివిధ రాష్ట్రాల్లో బిఆర్ఎస్ను ఆహ్వానిస్తున్నట్లుగా ప్లెక్సీలు, బ్యానర్లు వెలుస్తున్నాయి. మూడు రోజుల దిల్లీ కార్యక్రమాలకు ముందుగానే అక్కడ పెద్ద ఎత్తున గులాబీ ప్లెక్సీలు వెలిశాయి. ‘‘దేశ్‌కీ నేత… కిసాన్ భరోసా’’ అంటూ కెసిఆర్ ప్రకటించిన కిసాన్ సర్కార్‌కు మద్దతు పలికేవిగా ఉన్నాయి. అలాగే ‘‘ కెసిఆర్ ఫర్ ఇండియా’’ లాంటి బ్యానర్లతోపాటు భారత దేశ చిత్రపటంతో కూడిన గులాబీ రంగు పతాకాలు వెలిశాయి. విచిత్రమేమంటే కెసిఆర్ బిఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటించిన వెంటనే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పటికే ఏపిలో తమ పార్టీ విస్తరణకు సమాలోచనలు కూడా జరుగుతున్నాయి. త్వరలో విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో బిఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది.. ఏపిలో రానున్న లోకసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పక్షాన పోటీ చేసేందుకు అక్కడి నాయకులు కొందరు ఇప్పటికే ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా వైఎస్ఆర్, తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్ర పోటీ ఉంది. అయితే ఈ రెండు పార్టీలకు దూరంగా ఉన్న కొందరు సీనియర్ నాయకులపైన కెసిఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది.అక్కడ పార్టీ ఏర్పాట్ల విషయాలన్నీ ప్రస్తుతానికి రాష్ట్ర మంత్రి తలసాని యాదవ్‌కు అప్పగించినట్లు తెలుస్తున్నది. అలాగే పలు రాష్ట్రాల్లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయా రాష్ట్రాల్లోని బిజెపి యేతర ముఖ్యనాయకులతో సంప్రదించడం ఒకటైతే, ఆయా రాష్ట్రాల్లో కలిసివొచ్చే స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునే అంశాలపై చర్చించేందుకు త్వరలోనే కెసిఆర్ రాష్ట్రాల పర్యటన చేయనున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఏదిఏమైనా బిఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో కొత్త జోష్‌ను నింపినట్లైంది.




