- అని నేను అనలేదు ..
- కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడి
- ఖండించిన అన్ని పార్టీలు
- కోమటిరెడ్డి పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్!
- కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తాయని ఆవేదన
- వ్యాఖ్యలపై అధిష్టానానికి నివేదిక
- కోమటిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు : మంత్రి జగదీష్ రెడ్డి
- ఎవరైనా గెలుస్తమని చెప్తరు…కాంగ్రెస్ ఓడిపోతమని చెప్తున్నది : బండి సంజయ్
- రాష్ట్రంలో హంగ్ వొచ్చే అవకాశం లేదు : బిజెపి ఎంపి లక్ష్మణ్
న్యూ దిల్లీ /హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : రాష్ట్రంలో రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దిల్లీ లో మంగళ వారం కీలక వ్యాఖ్యలు చేశారు. వొచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని వెల్లడించారు. కాంగ్రెస్ గాడిన పడుతుందన్న కోమటి రెడ్డి..వొచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు కూడా రావని, అప్పుడు తమ పార్టీ కీలకం కాబోతుందని వివరించారు. ఆ పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలవడం ఒక్కటే బీఆర్‌ఎస్‌కు ఉన్న మార్గమని, అందుకే వొచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోవడమే ప్రధాన సమస్య అని, సీనియర్ అయినా, జూనియర్ అయినా.. గెలిచే సత్తా ఉన్న వాళ్లకే టికెట్లు ఇవ్వాలన్నారు.
దిల్లీ నుంచి హైదరాబాద్ కు సాయంత్రం వొచ్చిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తాను వొచ్చే శాసన సభ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా అని అనలేదని ..తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు భారాస తో ఉండదని అన్నారు. కాగా..రాష్ట్ర రాజకీయాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వొచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఅర్..కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదనే కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. బీజేపీ నేతలు కూడా స్పందించడం మరింత కాక రేపుతుంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ..కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదని విమర్శించారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు..బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ కూడా రియాక్ట్ అయ్యారు. ‘తెలంగాణలో హంగ్ వొచ్చే ఛాన్స్ లేదు. బీజేపీని ఎదుర్కునలేకనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పొత్తుల కోసం చూస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ కూడా స్పందించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ..‘తెలంగాణలో హంగ్ వొచ్చే ఛాన్స్ లేదు. బీజేపీని ఎదుర్కునలేకనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పొత్తుల కోసం చూస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్ చేశారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయింది. ఎవరైనా గెలుస్తామని చెప్తారు. కానీ, కాంగ్రెస్ ఓడిపోతామని చెబుతున్నారు. ఓడిపోతామని తెలిసి కూడా యాత్ర ఎందుకు చేస్తున్నారు?. ఎన్నికలకు ముందు ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేదు. తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. అందుకే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారు. వొచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలుస్తుంది. కేసీఆర్ ఇంకా..ఈటల రాజేందర్ తన మనిషే అనుకుంటున్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారు బీఆర్‌ఎస్‌లోకి వెళ్ళారు.
కాంగ్రెస్‌కి వోటు వేస్తే బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తాయి. వీళ్లందరూ దండుపాళ్యం బ్యాచ్ అని సంచలన కామెంట్స్ చేశారు.’ అని అన్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ డిప్రెషన్‌లో ఉన్నారు.. కాంగ్రెస్ వెంటిలేటర్‌పై ఉంది. బీఆర్‌ఎస్ పార్టీ బీ టీమ్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్‌ఎస్ పార్టీ కలలు కనేది..ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తుంది. కుటుంబ పాలన, అవినీతి పాలన, రైతుల వ్యతిరేక పాలన నిరుద్యోగ వ్యతిరేక పాలన బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. వొచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో పోటీచేసి ఘన విజయం సాధిస్తుంది. ఈ వ్యాఖ్యలతో అటు అధికార బీఆర్‌ఎస్, ఇటు బీజేపీ రెండూ..కాంగ్రెస్ తీరును ఏకిపడేస్తున్నాయి. ఈ తరుణంలో..కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కోమటిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తాయని చెబుతున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు. మరోవైపు కోమటిరెడ్డి కామెంట్స్ వీడియోను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ థాక్రే పరిశీలించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కోమటిరెడ్డి కామెంట్లపై థాక్రే.. కోమటిరెడ్డి కామెంట్లపై ఆరా తీసినట్లు సమాచారం.
అధిష్టానానికి నివేదిక అందించినట్లు తెలుస్తుంది. అంతే కాదు నేడు ఉదయం ఆయన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విడిగా భేటీ అవుతారని తెలుస్తుంది. ఇంకోవైపు రేవంత్ వర్గం ‘కోమటిరెడ్డి వ్యాఖ్యలు’ పార్టీకి తీరని నష్టం చేస్తాయని అంటుంది. అంతేకాదు.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే గెలిచే సత్తా కాంగ్రెస్‌కు ఉందని చెబుతుంది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు సహ నేత అద్దంకి దయాకర్. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కల్గించేలా ఉన్నాయి. వెంకట్ రెడ్డి ప్రతిసారీ పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసేలా వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గా తీసుకోవాలి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆయనపై హైకమాండ్ యాక్షన్ తీసుకొని ఉంటే.. ఇప్పుడు ఇలా మాట్లాడే వాడు కాదు. బీఆర్‌ఎస్ తో పొత్తు విషయం ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగతం తప్ప పార్టీకి సంబంధం లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అవినీతిలో కూరుకుపోయింది. ఓటమి అంచున ఉన్నది. బీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఓటమి అంచున ఉన్న బీఆర్‌ఎస్‌కు పొత్తులు అవసరం ఉండొచ్చు కానీ, కాంగ్రెస్‌కు ఆ అవసరం లేదు. గతంలోనే తెలంగాణ సభలో కాంగ్రెస్ పార్టీకి ఎవరితో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేయశారు. అంతేకాదు.. పొత్తు గుతించి మాట్లాడితే చర్యలు తీసుకుంటాం అన్నారు కూడా. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వొస్తుందని అన్నారు.




