- ‘గాంధీ’ సినిమా చూసి 35 క్షల మంది విద్యార్థులకు ప్రేరణ
- రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల జాతీయ జెండాలు ఇంటింటికీ పంపిణీ
- స్వ్రతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలలో సిఎస్ శాంతికుమారి
- సిఎం సహా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సిఎస్ అభినందనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : రాష్ట్ర ప్రభుత్వం దేశస్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, చైతన్యదీప్తిని భావి తరాలకు తెలియచేసే గొప్ప ప్రయత్నం మన చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదని సిఎస్ శాంతికుమారి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా గత సంవత్సరం ఆగస్టు 8న ప్రారంభించి ఏడాదికి పైగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించున్నామని ఆమె తెలిపారు. అందులో భాగంగా అనేక కార్యక్రమాలను, ఉత్సవాలను నిర్వహించకున్నామని ఆమె తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలలో భాగంగా శుక్రవారం హెచ్‌ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొని స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ…ఈనాటి విద్యార్థులు, యువత, స్వాతంత్య్ర పోరాటం తర్వాత తరానికి చెందిన వారని, పరాయి బ్రిటీష్ పాలన నుండి విముక్తికి, జాతిని జాగృతం చేసి, సర్వస్వం త్యాగం చేసిన ఎందరో మహనీయుల పోరాటస్ఫూర్తి, ఈ తరాలకు తెలియజేయాలనే గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో ‘‘జాతిపిత’’ గాంధీ మహాత్ముని సినిమాను అన్ని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించడం జరిగిందని, ప్రారంభ, ముగింపు రెండు విడుతలలో కలిపి రికార్డు స్థాయిలో సుమారు 35 లక్షల మంది విద్యార్ధినీ, విద్యార్ధులు, ఇతరులు ‘‘గాంధీ’’ సినిమా చూసి ప్రేరణ పొందారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ప్రారంభ, ముగింపు ఉత్సవాలలో దాదాపు 2 కోట్ల 40 లక్షల జాతీయ జెండాలను ఉచితంగా ఇంటింటికీ పంపిణీ చేయడమైందని, ప్రతి ఇంటి మీద రెపరెపలాడే జాతీయ జెండా మన రాష్ట్రంలోనే తయారు కావటం మనందరికీ గర్వకారణమన్నారు. ముగింపు సంబురంలో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 26న కోటి 30 లక్షల మొక్కలు నాటడంతో పాటు, ఫ్రీడమ్ పార్కులలో కూడా పెద్ద ఎత్తున మొక్కల నాటడం జరిగిందని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులనూ, వారి కుటుంబాలను సన్మానించడం ద్వారా వారి త్యాగాలు స్మరించుకున్నామని, ఫ్రీడమ్ ర్యాలీలు, కళాప్రదర్శనలు, సామూహిక గేయాలాపనలు, క్రీడా, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామని సిఎస్ తెలిపారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని రంగాలలో అద్భుతమైన ప్రగతి సాధించిందని, 2014 లో 1,12,162 రూపాయలుగా వున్న తలసరి ఆదాయం నేడు 3,17,115 రూపాయలకు పెరిగిందని, అదేవిధంగా, 2014లో 5.06 లక్షల కోట్లుగా వున్న జిఎస్‌డిపి నేడు 13.13 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతూ, ఇది కదా, ‘‘స్వాతంత్య్ర ఫలం’’ అని ప్రతీ తెలంగాణ బిడ్డ సగర్వంగా తలయెత్తుకునే విధంగా తెలంగాణ పురోగతి సాధించిందని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడంలో స్ఫూర్తినింపిన ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులందరికీ ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన విద్యార్థినీ, విద్యార్థులు, యువత, కవులు, గాయకులు, కళాకారులు, క్రీడాకారులు, స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వాధికారులు, యావత్తు తెలంగాణ ప్రజలందరకీ శాంతికుమారి అభినందనలు తెలిపారు.




