హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : బీసీ జాబితా నుండి తొలగించిన 26 బీసీ కులాలను తిరిగి చేరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని తెలంగాణ తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు జల్లు హేమ సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి తుమరాడ శ్రీనివాస్ రావు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2014 లో రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర బీసీ జాబితా నుండి 26 బిసి కులాలను తొలగించి బిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. గత పదేళ్లలో విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో ఈ 26 కులాల వారు ఎంతో నష్టపోయారని అయన తెలిపారు. ఒక ఇంటిలో ఒకే కుటుంబంలో రాష్ట్రం ఏర్పడక ముందు పుట్టిన పిల్లలు బీసీలు, రాష్ట్రం ఏర్పడ్డ తరువాత పుట్టిన పిల్లలు ఓసీలు ఎలా అవుతారని అయన ప్రశ్నించారు. ఈ విధానం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు. తొలగించిన 26 బీసీ కులాల వారు అన్ని జిల్లాలలో దాదాపు 30 లక్షలమంది ఉన్నారని, అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో 10 లక్షలమంది ఉన్నారని, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటమిల ప్రభావితం చేయగల శక్తి తొలగించిన 26 బీసీ కులాలకు ఉందని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహలు, మద్దతుపై సంఘం ఆధ్వర్యంలో బీసీ జాబితా నుండి 26 బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం మూసాపేట్, రాయల్ ఫంక్షన్ హాల్ లో శనివారం జరుగుతుందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేషాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు తెలంగాణ తూర్పు కాపు సంక్షేమ సంఘం




