(డిసెంబర్ 24, జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవం)
వస్తు,సేవలను కొనుగోలు చేసి,వినియోగించుకునే వ్యక్తిని “వినియోగదారుడు” అని నిర్వచించవచ్చు. ఖరీదు పెట్టి కొన్న వస్తుసేవల్లో ఎలాంటి లోపాలున్నా దాని వలన వినియోగదారుడికి ఆర్ధికంగాను,ఆరోగ్య పరంగాను ఎంతో నష్టం కలగవచ్చు. ఇలాంటి అసౌకర్యాన్ని, ఆర్ధిక నష్టాన్ని,అన్యాయాన్ని వినియోగదారుడు వివిధ చట్టబద్దమైన మార్గాల ద్వారా అధిగమించి, పోరాడి, తగిన నష్ట పరిహారం పొందే హక్కులు ఉన్నాయి. వీటినే “వినియోగదారుల హక్కులు” అంటారు. ఈ హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. తత్ఫలితంగానే వినియోగ దారుల హక్కుల చట్టాలు ఏర్పడ్డాయి.భారత దేశంలో వినియోగదారుల చట్టం 1986 డిసెంబర్ 24 వతేదీన రాష్ట్రపతి ఆమోదం పొందడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని,ప్రతీఏటా డిసెంబర్ 24 వ తేదీన భారత దేశంలో “జాతీయ వినియోగదారుల దినోత్సవం”గా పాటిస్తున్నాం.1986 లో భారత్ లో అమలు లోకి వచ్చిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ముఖ్యోద్దేశం లాభాపేక్ష గల వ్యాపారుల దోపిడీని అరికట్టి, వినియోగదారుల హక్కులను,బాధ్యతలను గుర్తు చేసి,వారిని చైతన్య పరచడం,న్యాయం ప్రసాదించడం.2019 లో కూడా లోక్ సభలో నూతన వినియోగదారుల రక్షణ చట్టం ప్రవేశ పెట్టడం జరిగింది.
వస్తువుల తయారీలో, అమ్మకంలో, నాణ్యతాపరమైన లోపాలు,తూనికలు,కొలతల్లో అవకతవకలు,స్వచ్ఛత లేకపోవడం,ప్రమాదకరమైన వస్తు ఉత్పత్తులనుండి రక్షణ,ఆరోగ్య పరిరక్షణ వంటివి చట్టబద్ధంగా వినియోగదారుడికి లభించిన హక్కులు.కేవలం కాసులకోసం కక్కుర్తి తో వినియోగదారులను దారుణంగా మోసంచేయడం, తూనికలు,కొలతల్లో తేడా నాణ్యతాపరమైన ప్రమాణాలకు తిలోదకాలిచ్చి కల్తీ సరుకులను విక్రయించడం,డిమాండ్ కు తగ్గ రీతిలో సరఫరా చేయకుండా నల్లబజారుకు తరలించి నిత్యావసర వస్తువులను,ఇతర సరుకులను అత్యధిక ధరలకు అమ్మడం వంటి అనైతికమైన ధోరణులపై తమకు జరిగిన అన్యాయాలను ఎదురించి, వినియోగదారుల ఫోరమ్ లో ఫిర్యాదు చేసుకునే వెసులు బాటు కలగడం ప్రజలకు లభించిన వరం.థోరిస్టైన్ వెబ్లెన్,రాల్ఫ్ నాడార్,హెర్బ్ ట్ హోవర్ లాంటి మహామహులు వినియోగదారుల ఉద్యమం లోకి ప్రవేశించడం వలన ప్రజల్లో మరింత క్రియాశీలత పెరిగింది. జాన్ ఎఫ్ కెనడీ ప్రవచించిన సేప్టీ,ఇన్ఫర్మేషన్,చోయస్,వాయస్
భారత దేశంలో కూడా మహాత్మాగాంధీ వినియోగదారుని ప్రాధాన్యత గురించి కూలంకషంగా వివరించారు. వినియోగదారుడంటే మన గుమ్మం తట్టే సందర్శకుడని, వినియోగదారుని వలన ఉత్పత్తి దారుడు లాభపడతాడని, అలాంటి వినియోగదారుడిని గౌరవించడమంటే దేశాన్ని ఆర్థికపథంలో నడిపించడమేనని వివరించారు.తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి,తమ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో మక్కువ పెరగడానికి పేరొందిన వ్యక్తులతో,సెలబ్రిటీలతో వ్యాపార ప్రకటనలు గుప్పిస్తున్నారు.వస్తువుల నాణ్యతను బట్టి కాకుండా సెలబ్రిటీల ఆకర్షణను ఎరగా వేసి, వినియోగదారులను పెడదారి పట్టించడం భావ్యంకాదు. లక్షలు,కోట్లు గుమ్మరించి వ్యాపార ప్రకటనలివ్వడమంటే ఆ భారం కూడా వినియోగదారుడిమీదే పడుతుంది. వంద రూపాయల సరకు ఐదొందలవుతుంది.ఇది మోసం కాదా? అనవసరమైన ప్రకటనల పేరుతోనో, ఆకాశహర్మ్యాలను చూపిస్తూ, ఆర్భాటాలతో వస్తువు నికర ధరకంటే అధికమొత్తం భారం వినియోగదారునిపై మోపడం మోసం కాదా? ఇలాంటి కృత్రిమ ప్రచారాలకు, అనవసరమైన ఆర్భాటాల నడుమ వస్తువుల ధరలను పెంచడం పట్ల వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి మోసపూరితమైన విధానాలను కట్టడి చేయాలి. వినియోగదారుల్లో ఎంతగా చైతన్యం ప్రబలినా ఫలితం మాత్రం నామమాత్రంగానే కనిపిస్తున్నది. ప్రతీ సమస్య పైనా నిరంతరం పోరాడే తీరిక,ఓపిక నశించి “అందరితో పాటే మనం” అనుకుంటూ ప్రజలు కూడా ఛైతన్యం నుంచి స్థబ్ధత వైపు పయనిస్తున్నారు. ఇది బాధాకరమైన విషయమే.ప్రభుత్వాలే మార్కెట్ లోకి విడుదలయ్యే వస్తువులపై శ్రద్ద పెట్టాలి. వస్తువుల నాణ్యత విషయంలోనూ,నకిలీ వస్తువుల తయారీ పట్ల కఠినమైన నిబంధనలు విధించాలి. వినియోగదారుల హక్కులను కాపాడాలి. డిసెంబర్ 24 న జరిగే జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం వినియోగ దారుల విజయానికి ప్రేరణ కావాలి.స్వచ్ఛతా ప్రమాణాలతో కూడిన వస్తూత్పత్తులతో ప్రజల ఆరోగ్యం మెరుగు పడాలి.ఆహార పదార్ధాల కల్తీ అరికట్టబడాలి, ప్లాస్టిక్ వినియోగం తగ్గాలి.
పర్యావరణం మెరుగు పడాలి.వినియోగదారుల్లో చట్టాల పట్ల,తమకున్న హక్కుల పట్ల అవగాహన కలగాలి. వినియోగ దారుల సమస్యలు త్వరిత గతిన పరిష్కారం కావాలి. వినియోగదారుల్లో చైతన్యం రావాలి.ప్లాస్టిక్ వాడకాన్ని నిలువరించాలి. ప్లాస్టిక్ సమస్య ప్రభుత్వాల ముందున్న పెనుసవాల్. ప్రభుత్వాలే ప్లాస్టిక్ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలి. ధనార్జన కోసం ప్రజలను నట్టేట ముంచే కల్తీ పై దృష్టి సారించాలి. నాణ్యతా ప్రమాణాలతో కూడిన వస్తువులను కొనుగోలు చేయగలిగే స్థోమత ప్రజలకు లేదు. కాబట్టి ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని పెంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల తలసరి ఆదాయం ఎక్కువ. ఆదాయం పెరిగితే నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసే ఆర్ధిక శక్తి పెరుగుతుంది. అరకొర ఆదాయంతో ఖరీదైన, నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయడం అసాధ్యం కనుక,ఈ బలహీనత దోపిడీ దారుల నకిలీ దందాకు ఊపిరి పోస్తున్నది. కాబట్టి ప్రప్రథమంగా ప్రజల ఆదాయ మార్గాలు పెంచాలి. జీవన ప్రమాణ స్థాయి పెంచాలి. అప్పుడే వినియోగదారులు నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయగలరు.
ఈ దిశగా ప్రజలను సంసిద్ధం చేయాలి.విషం పెట్టి చంపడం ఎంత నేరమో ఆకర్షణీయమైన పద్ధతిలో ఆహారంలో కల్తీ అనే విషాన్ని నింపి,జనం చేత మింగించి చంపడం కూడా అంతే నేరం. అలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడే వారిని శిక్షించి, ప్రజలను రక్షించినప్పుడే వినియోగదారుల చట్టాలకు సార్ధకత చేకూరుతుంది.మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారుడిని మరింత మోసపోయేలా చేస్తున్నది.సర్వత్రా కల్తీమయమైన ప్రపంచంలో నాణ్యతను,నకిలీని గుర్తించడం కష్టసాధ్యమే. వినియోగ దారుడిని నిరంతరం అప్రమత్తం చేసే పటిష్ఠయంత్రాంగం అవసరం. వినియోగం లేనిదే ఉత్పత్తికి విలువ లేదు. ఈ వాస్తవాన్ని గ్రహించే వినియోగదారుడే నిజమైన దైవంగా అభివర్ణించడం పరిపాటి. అత్యాశతో వినియోగ దారులను మోసం చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. అందుకే వినియోగదారులకు మరిన్ని హక్కులు,వాటికి రక్షణ కావాలి.ప్రమాదకరమైన వస్తువుల తయారీ,ప్రాణహాని గల వస్తుసేవల ఉత్పత్తి,వినియోగం తదితర అంశాలపై వినియోగదారులకు గల చట్టబద్ధమైన హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే వినియోగదారుల చట్టాలు చేయబడ్డాయి. వినియోగదారులను కాపాడడంలో ప్రభుత్వాలు కీలక భాగస్వామ్యం వహించాలి.
సుంకవల్లి సత్తిరాజు,
సంగాయగూడెం,
తూ.గో.జిల్లా, మొ:: 9704903463.




