- రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70 సీట్లు
- బిఆర్ఎస్, బిజెపిల మధ్య రహస్య పొత్తు
- బిఆర్ఎస్ను గెలిపించడానికే రాష్ట్రంలో సైలెంటయిన బిజెపి
- కాంగ్రెస్ ఎంపి, సీడబ్ల్యుసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కాంగ్రెస్ విజయ భేరికి భారీ ఎత్తున తరలిరావాలని ప్రజలకు పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : ఈ నెల 16న హైదరాబాద్‌లో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం, తుక్కుగూడలో జరిగే విజయ భేరి సభ చారిత్రాత్మక ఘట్టాలని నల్గొండ ఎంపీ, సీఈసీ సభ్యుడు కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా సైలెంట్ వేవ్ వీస్తుందని, అండర్ కరెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 70కి పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ అహంకార, అవినీతి, అహంకారమే అందుకు కారణమన్నారు. బీజేపీ, అధికార బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య పొత్తు ఉందని, అందులో భాగంగా బిజెపి తెలంగాణలో సైలెంట్ కావడం, బిఆర్ఎస్ ఎన్నికల్లో గెలువడానికి అవకాశాలను మెరుగుపరుస్తుండడమన్నారు. ఈ విషయంపై రాష్ట్ర పౌరులకు, ముఖ్యంగా మైనారిటీలకు పూర్తి అవగాహన ఉందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
గురువారం గాంధీభవన్‌లో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావు థాక్రే, టీపీసీసీ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్‌సాగర్‌రావు, ఇతర ప్రముఖులతో కలిసి ఏర్పాటు చేసిన విలేజీరుల సమావేశంలో ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో తొలిసారిగా 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం జరగనుందని అన్నారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం నుండి ఇండియన్ యూనియన్‌లో విలీనమైన 75వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకునే సందర్భం కూడా అని ఉత్తమ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయ భేరి సభ భారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ ర్యాలీలలో ఒకటిగా నిలుస్తుందని తాను భావిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినసోనియా గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ఈ ర్యాలీకి హాజరవుతుందని ఆయన అన్నారు. సెప్టెంబరు 17న జరిగే విజయ భేరి సమావేశంలో ఐదు కీలక హామీలను వెల్లడిస్తామని చెప్పారు.
సోనియా గాంధీ తన తాను ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమె ప్రజలకు వాగ్దానం చేసి, ఆ తర్వాత దానిని నెరవేర్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని గట్టిగా విశ్వసిస్తుందని, సమావేశంలో ఇచ్చే ఐదు హామీలు కూడా అందుకు మినహాయింపు కాదని ఉత్తమ్ తెలిపారు. నిబద్ధతకు కట్టుబడే చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అనేది అనేక విజయాల ద్వారా గుర్తించవచ్చునన్నారు. అందులో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించడం, రైతులకు పంట రుణాలు, రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం అమలు, విద్యాహక్కు చట్టాన్ని సమర్థించడం వంటి చారిత్రాత్మ నిర్ణయాలను చెప్పుకోవచ్చన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయడంతో పాటు వేగంగా చర్యలు చేపట్టిందని, కర్నాటకలో అధికారం చేపట్టిన మొదటి 100 రోజుల్లోనే ఐదు హామీల్లో నాలుగింటిని అమలు చేసిందన్నారు. పౌరుల శ్రేయస్సు, దేశ ప్రగతికి పార్టీ యొక్క అచంచలమైన అంకితభావానికి పార్టీ ట్రాక్ రికార్డు నిదర్శనమని ఉత్తమ్ అన్నారు. విజయ భేరి సభకు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని, కాంగ్రెస్ పార్టీకి తమ అండదండలు తెలియజేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.



