సినిమా తర్వాతనే ప్రపంచానికి గాంధీ గురించి తెలిసిందా..?

  • మన ప్రధానికి తెలువదు..కానీ ప్రపంచానికి తెలుసు
  • ఎన్నికల ఫలితాల తర్వాత మహాత్ముడి ఆత్మకథను చదువండి
  • ఎన్‌డిఏకు మళ్లీ అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యం అంతమే..
  • మా అభిప్రాయానికి ప్రజల ఆమోదం
  • ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన మోదీ ‘ధ్యానం’
  • మీడియా సమావేశంలో ప్రధాని మోదీపై మండిపడ్డ కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే
  • ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ వొస్తుందని విశ్వాసం

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 30 : 1982లో రిచర్డ్‌ అటెన్‌బరో దర్శకత్వం వహించిన బయోపిక్‌ విడుదలైన తర్వాతనే మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందని బుధవారం మీడియా ఇంటర్వ్యూలో ప్రధాని చేసిన శ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలపై తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. గాంధీ గురించి  ప్రధాన మంత్రి అధ్యయనం చేసి ఉండకపోవచ్చు కానీ మహాత్ముడు ప్రపంచమం తటికీ తెలుసునని ఖర్గే వ్యాఖ్యానించారు. వివేకానంద సైట్‌లో కూర్చోవడం వల్లనో, గంగా నదిలో స్నానం చేయడం వల్లనో ఆ జ్ఞానం రాదని, దాని గురించి చదవాల్సిందేనని ఖర్గే విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ స్వాతంత్య్ర సమరయోధుడి ఆత్మ కథను చదువాలని ప్రధాని మోదీకి ఖర్గే సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నాయకులు మహాత్మా గాంధీని ప్రశంసించారని, కనీసం 70-80 దేశాల్లో ఆయన విగ్రహాలు ఉన్నాయని, అహింస ద్వారా స్వాతంత్య్రం పొందిన దేశాలకు మహాత్మా గాంధీ గురించి తెలుసునని అన్నారు.

ఆయనకు గాంధీ గురించి, ఆయన సందేశాల గురించి తెలియకపోయే అవకాశం ఉంది కాబట్టి అతనికి రాజ్యాంగం గురించి కూడా తెలియదని తాను అనుకుంటానన్నారు. ఈ రోజుకూ ప్రపంచంలోని ప్రజలు ఈ దేశ స్వాతంత్య్రం, దేశ నిర్మాణం గురించి మాట్లాడేటప్పుడు గాంధీ పేరు తీసుకుంటారన్నారు. ఇక ప్రస్తుత  బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వనికి మరో అవకాశం లభిస్తే అది ప్రజాస్వామ్యానికి అంతమేనన్న తమ అభిప్రాయాన్ని ప్రజలు ఆమోదించారని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే అన్నారు. గురువారం ఆయన దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…మోదీ ఇప్పుడు తనను తాను దేవుని అవతారంగా భావిస్తున్నారని అన్నారు. మోదీ గత 15 రోజుల తన ఎన్నికల ప్రచారం సందర్భంగా 232 సార్లు కాంగ్రెస్‌ పార్టీ పేరును ప్రస్తావించారని.

‘మందిర్‌-మసీదు’ మరియు ఇతర విభజన అంశాల గురించి 421 సార్లు మాట్లాడారని పేర్కొన్నారు. కులం, మతం ప్రాతి పదికగా ప్రసంగాలు చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించినా పట్టించుకోలేదని ఖర్గే అన్నారు. ఇక ప్రచారంలో ప్రధాని మోదీ తన పేరును తాను 758 సార్లు ప్రస్తావించుకున్నారని ఖర్గే పేర్కొన్నారు. అయితే దేశంలో ప్రస్తుతం నెటకొన్న నిరుద్యోగ సమస్య గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని విమర్శించారు. బీజేపీ ‘400 పార్‌’ వాదన అబద్ధమని, 200 కూడా గెలవలేదని అన్నారు. జూన్‌ 4 న ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఆదేశాన్ని ఇస్తారని తాము విశ్వసిస్తున్నామన్నారు, ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ఎన్నికైతే అది ప్రజాస్వామ్యానికి అంతమేనన్న ఇండియా కూటమి అభిప్రాయాన్ని ప్రజలు ఆమోదించారని అన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని, కూటమిని కలుపుకుని జాతీయవాద ప్రభుత్వాన్ని అందిస్తుందని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *