సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: తెలుగు సాహిత్యంలో బాలసాహిత్యం ఓ బలమైన పార్శ్వం. ఇది రెండు పాయలుగా సాగి సాహిత్య క్షేత్రాన్ని మరింత సుసంపన్నం చేస్తూ వస్తున్నది. బాలలకోసం బాలలు రాయడం ఒక పధ్ధతైతే, బాలల కోసం పెద్దలు రాయడం మరో పధ్ధతి. కవిత్వం, కథ, జీవితచరిత్రలు,ఇలా భిన్న ప్రక్రియల్లో రచనలు సాగుతూ బాలల లోకంలో మనోవికాసంతో పాటు సృజనను కూడా బలోపేతం చేయడం మనం గమనిస్తాం. ఇటీవల కాలంలో అధ్యాపకులు తాము కవులు, కవయిత్రులుగా రాణిస్తూనే అంతటితో ఆగకుండా విద్యార్థులలో కూడా సాహిత్యం పట్ల అభిరుచిని కలిగిస్తూ వారిలో సహజంగానే దాగివున్న సృజనను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పద్యం, గద్యం రెండింటా సమాంతరంగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు పిల్లలు. ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి లాంటి బాల సాహితీ విద్యార్థి అవధానాలు చేసి ఔరా అని పెద్దలచే తలలూపించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా ఆయా పాఠశాలల నుంచి ఇలా “కొత్తకలాలు “తమదైన శైలిలో లేత కవితాక్షరకిరణాలను ప్రతిభావంతంగా లోకం పైకి ప్రసరింపజేయడం శుభపరిణామం.సిద్ధిపేటగడ్డ బాల సాహిత్యపు అడ్డా సిద్ధిపేట అనగానే ఒక చైతన్యం మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడినుండి అనేకమంది సాహితీవేత్తలు, కళాకారులు తమదైన వాణితో, బాణితో, రాణించిన, రాణిస్తున్న సందర్భాలు కోకొల్లలు. బాలసాహిత్య విషయానికి వస్తే వేముగంటి నరసింహాచార్యులు, ఐతాచంద్రయ్య, అమ్మన చంద్రారెడ్డి, సామలేటి లింగమూర్తి, గరిపెల్లి అశోక్, ఉండ్రాళ్ళ రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, ఎన్నవెళ్లి రాజమౌళి, వర్కోలు లక్ష్మయ్య,గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ ఇట్లా అనేక మంది కవులుబాలసాహిత్యాన్ని అందిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో దుబ్బాక బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శివునూరి లలితాకృష్ణ స్వతహాగా కవయిత్రి, రచయిత్రి, గొప్ప గాయని. సాహిత్యసేవాసంస్థల నిర్వాహకురాలు. చైతన్యం మూర్తీభవించిన కార్యకర్త. ఆమె సంపాదకత్వంలో ఈ దుబ్బాక ఉన్నత పాఠశాల బాలికలు రాసిన కవితలను ఓ కవితాగుచ్ఛంగా మనకు అందిస్తున్నారు. రేపటి కవితాసూర్యుళ్ల వెలుగులకు ద్వారాలు తెరుస్తున్నారు. ఈ సంకలనంలో మొత్తం 82 కవితలు ఉన్నాయి. వస్తువైవిధ్యంతో పాటు, వ్యక్తీకరణలో కూడా విద్యార్థులు ప్రదర్శించిన పదపోహళింపునూ ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంప్రదాయన్ని గౌరవిస్తూ తొలికవితలో గణపయ్యను స్మరించుకుంది అక్షయ. మావూరు, జాతీయపతాకం, అమ్మ, చదువు, ఆడపిల్ల, బతుకమ్మ, భాష, దీపావళి, స్నేహం, బడిగంట, నాన్న, స్త్రీ, సరస్వతి, తెలుగు, చెట్టు, అన్న, బాల్యం, బడి, పల్లె, నల్లబల్ల, పాఠం, రైతు, సైనికుడు ఇలా పలు వస్తువులను తమ కవిత్వానికి నేపథ్యంగా ఎంచుకొని తమదైన భావాలను అలతి అలతి పదాలలో ఆవిష్కరించారు. కవిత్వపు తూగురాళ్ళవైపు మొగ్గు చూపకుండా పిల్లల భావవ్యక్తీకరణ వైపే పాఠకులు ఓటు వేస్తారని, వెయ్యాలన్న ఒక అభిప్రాయం కలుగుతుంది.ఈ సంకలనంలోని కవితలు చదివాక మనలో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. తేటపదాలతో విద్యార్థులు తమలోని భావాలను ఎంత గొప్పగా ఆవిష్కరించారో ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రకృతిలో పచ్చదనం, అవని ఒడిలో వెచ్చదనం(నయనశ్రీ ), మనిషికి ఉండాలి మంచితనం,తెస్తుంది అదే గొప్పతనం (విజయశ్రీ ),విజయం సాధిస్తే మురువు (అక్షయ ), సహనానికి ఉన్న శక్తి జగమంతా తెలిపేను జనులందరికీ జాతీయజెండా (మానస ), చదువుతోనే భవిత (నస్రీన్ ), కోవెల అంటే కొండంత ఇష్టం (ప్రజ్ఞ ), మా గురువుల బోధనే మాకు బూస్ట్ (సిరిచందన ), అలుపు లేకుండా గెలుపు, గెలుపుతో చక్కని మలుపు (శ్రీజ ), రమ్మని పిలిచెను బతుకమ్మ (ప్రతిభ ), నింగిని పిలుస్తూ నేల, నేలను తలుస్తూ నింగి (లేఖశ్రీ ), మాతృభాషే మనశ్వాస (భావన ), నాన్నే నాకు మిన్న (సంజన ), ఆదర్శాలకు నిలయం భారతదేశం (హేమలత ), మానవతామూర్తే నాకెపుడు స్ఫూర్తి (నవ్య ), చదువుల బడి మమతల గుడి (నేహ ),కలలో అయ్యాను నేను క్వీన్ (హరిణి ), మాతృభాషలో ఉంది జిలుగు, అది పంచుతుంది వెలుగు (శ్రీజ ), పల్లెల్లో ఉంటాయి తెల్లని మనసులు (రేవతి ), స్నేహితులు లేకుండా నేను నిలువ (వైష్ణవి ), మంచిరాతతోనే గెలుపు, రాతతోనే మలుపు (రక్షిత ), చెట్టు, ధరణికి తానే ఇంధనం (ఆనందిని ), మంచితోనే ఆత్మవిశ్వాసం (నిఖిత ), ఏకవచనంగా ఉన్న నేను, స్నేహితులతో కలిసి బహువచనమయ్యాను (సోఫియా పర్వేజ్ ), తరుగుతున్న సుద్దముక్క తెలివిని పెంచుతుంది (నందిని ), మన పండుగలు చెప్తాయి మనమంతా ఒక్కటని (శిరిన్ ), బతుకునిచ్చేది జవాన్, మెతుకునిచ్చేది కిసాన్ ఇలా పలు కవితాపంక్తులను ఉదహరించుకోవచ్చు. ఎంతైనా వ్యాఖ్యానించుకోవచ్చు. ఇదీ బాలల కవితాహృదయం. రేపటి పచ్చని కవితాపందిళ్లకు వేసుకుంటున్న పునాదులు.దుబ్బాకలోనే తొలి బాలల కవితాసంకలనము
సంకలనం రూపు కట్టడం ఒక యజ్ఞం వంటిదే. ఈ విషయంలో సంపాదకురాలు లలితాకృష్ణ పూలల్లో దారంలా అందరినీ సమన్వయం చేస్తూ అందమైన కవిత్వ దండనే అల్లారు. డి. ఈ. ఓ శ్రీనివాస్ రెడ్డి, ఎం.పి.డి.ఓ వేలేటి భాస్కరశర్మ, ఎం. ఈ. ఓ జోగుప్రభుదాస్,కేంద్రసాహిత్యఅకా డమి పురస్కార గ్రహీత డా. పత్తిపాకమోహన్, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. సత్యనారాయణ రెడ్డి రాసిన ముందుమాటలు బాలల కవిత్వం వెనుక మర్మాన్ని,సంపాదకురాలి కృషిని ఆవిష్కరిస్తున్నాయి. మొత్తంగా బాలల కవితాప్రపంచంలో మరో మేలిమి సంకలనం రావడం ఆహ్వానించదగిన పరిణామం. ఈ పుస్తకం ఇలా వెలుగులోకి రావడానికి ఆర్ధికంగా సహకరించిన కృతిస్వీకర్తలు గిరి -రజిత దంపతుల సౌజన్యాన్ని గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలుపుదాం దుబ్బాక ప్రాంతం నుంచి వెలువడిన తొలి బాలల సంకలనం ఇది. రేపటి అసంఖ్యాక సంపుటాలకు వాగ్ధానం చేస్తుందని ఆశిద్దాం.



