జగదేవ్‌పూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: మాకెందుకు దళితబంధు ఇవ్వలేదని ప్రశ్నించిన పాపానికి యాదగిరి అనే దళిత యువకుడిని అధికార మదంతో అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపిటిసి కారింగుల కిరణ్ గౌడ్ దవడ పగలగొట్టాడు. ఈ సంఘటన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని బిజి.వెంకటాపూర్‌లో మంగళవారం జరిగింది. ఓ వైపు స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ..సిఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి కూతవేటు దూరంలోనే అధికార పార్టీకి చెందిన మునిగడప ఎంపిటిసి కిరణ్ గౌడ్ దళిత యువకుడిపై దాడికి పాల్పడటం గమనార్హం. వివరాల్లోకి వెళ్లితే…మునిగడపకు చెందిన బిఆర్ఎస్ పార్టీ ఎంపిటిసి కిరణ్‌కుమార్‌గౌడ్ బిజి.వెంకటాపూర్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం…గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎదురుగా నిలబడ్డ ఎంపిటిసి కిరణ్ గౌడ్‌ను గ్రామానికి చెందిన యాదగిరి, సురేష్ దళితబంధు మాకెందుకు ఇవ్వలేదని ఎంపిటిసి కిరణ్‌గౌడ్‌ను ప్రశ్నించారు. దళితబంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన పాపానికి ఎంపిటిసి కిరణ్ గౌడ్ దళిత యువకుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏకంగా వారి దవడలు పగలగొట్టాడు. మేము అర్హులం కాదా? మాకెందుకు ఇవ్వరు? అని నిలదీయడంతో కోపంతో ఊగిపోయిన ఎంపిటిసి కిరణ్ యాదగిరిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చాడు. అడ్డుకోబోయిన సురేష్‌ను పక్కకు నెట్టేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రశ్నించినందుకే ఎంపిటిసి కిరణ్ గౌడ్ తన అధికార బలంతో దళితులను ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారంటూ బాధితులు జగదేవ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. కాగా, దళితులపై దాడి చేసిన ప్రజా ప్రతినిధిపై చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్యమిస్తామని దళితులు హెచ్చరించారు. గ్రామ దళితులకు పథకాల అమలులో అర్హులకు అన్యాయం చేసి తమ వారికి కట్టబెడుతున్నారని గ్రామ దళితులు ఆరోపించారు. దాడికి పాల్పడిన ఎంపిటిసి కిరణ్ గౌడ్‌పై తక్షణమే చర్యలు చేపట్టాలని దళితులు డిమాండ్ చేశారు. అయితే, బిజి.వెంకటాపూర్ గ్రామానికి దళితబంధు రెండు యూనిట్లు మంజూరు కాగా ప్రజా ప్రతినిధులు తమ అనుచరులకే ఇప్పించుకున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బిజి.వెంకటాపూర్‌లో ప్రశ్నించిన పాపానికి దళిత యువకులపై దాడి చేసిన ఎంపిటిసి కిరణ్ గౌడ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డట్లు కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఎంపిటిసి కిరణ్‌గౌడ్ తీరు సరిగ్గా లేదనీ, పార్టీకి నష్టం చేసేలా ఉందని అధికార పార్టీకి చెందిన పార్టీ నేతలు పలువురు సైతం చెబుతున్నారు.




